పెళ్లి నగల్ని ఇలా భద్రంగా దాచుకుందాం! - these simple tips to follow to take care of your bridal jewellery post wedding
close
Updated : 15/06/2021 17:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెళ్లి నగల్ని ఇలా భద్రంగా దాచుకుందాం!

పెళ్లిలో మనం కుందనపు బొమ్మలా కనిపించాలంటే.. ధరించే దుస్తులతో పాటు వాటికి నప్పేలా పెట్టుకునే ఆభరణాలదీ కీలక పాత్ర! అందుకే పెళ్లికి చేయించుకునే నగల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు అమ్మాయిలు. ఈ క్రమంలో బంగారం, వెండి, ముత్యాలు.. వంటి ఆభరణాలే మన పెళ్లిళ్లలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే ఇలా ఆభరణాలు ధరించడంతోనే సరిపోదు.. శుభకార్యం ముగిశాక వాటిని భద్రంగా దాచుకోవడమూ ముఖ్యమే అంటున్నారు నిపుణులు. అప్పుడే అవి ఎక్కువ కాలం మన్నడంతో పాటు విరిగిపోవడం, మెరుపు తగ్గిపోవడం, డ్యామేజ్‌ కావడం.. వంటి సమస్యలు రావని చెబుతున్నారు. అందుకోసం ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుందంటున్నారు.
దేనికదే విడివిడిగా!
సాధారణంగా మనం ధరించే ఆభరణాల్లో పొడవాటి హారాలు, నెక్లెస్‌లు, గాజులు, పాపిటబిళ్ల, వడ్డాణం.. వంటివే ఎక్కువగా ఉంటాయి. వీటన్నింటినీ ఒకే బాక్స్‌లో కాకుండా విడివిడిగా అమర్చాల్సి ఉంటుంది. అయితే ఆయా ఆభరణాలు చేయించుకునే క్రమంలో లేదంటే కొనేటప్పుడే వాటిని ప్రత్యేకమైన బాక్సుల్లో పెట్టిస్తారు. కాబట్టి వాడకం పూర్తయ్యాక వాటిని నేరుగా ఆయా బాక్సుల్లో అమర్చితే సరిపోతుంది. ఒకవేళ బాక్స్‌లు లేనట్లయితే వెల్వెట్‌ లేదా శాటిన్‌ క్లాత్‌ అమర్చిన బాక్సులు బయట మార్కెట్లో దొరుకుతాయి. మీకున్న ఆభరణాల సైజును దృష్టిలో ఉంచుకొని ఆయా బాక్సుల్ని కొనుగోలు చేయచ్చు. ఇలా వీటిని భద్రపరిచే క్రమంలో అందులో కొన్ని కర్పూరం బిళ్లలు వేయడం మర్చిపోవద్దు. తద్వారా బాక్స్‌లో తేమ లేకుండా, నగలు పాడవకుండా ఈ బిళ్లలు ఉపయోగపడతాయి.


ఆరు నెలలకోసారి!
కొంతమంది నగల్ని తరచూ వాడుతుంటారు. మరికొంతమంది నెలల తరబడి తీయకుండా లాకర్లోనే ఉంచుతారు. ఇది ఎంత మాత్రమూ సరికాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఆభరణాలు తరచూ వేసుకున్నా, వేసుకోకపోయినా కనీసం ఆరు నెలలకోసారి వాటిని శుభ్రపరచడం తప్పనిసరి అంటున్నారు. ఈ క్రమంలో వాడిన ప్రతిసారీ, వాడకపోతే ఆరు నెలలకోసారి వాటిని మైక్రోఫైబర్‌ క్లాత్‌తో నెమ్మదిగా తుడవాలి. ఈ క్రమంలో వాటిపై చేరిన దుమ్ము, ఇతర మలినాలు తొలగిపోతాయి.. నగలు శుభ్రపడతాయి. అలాగే మెరుగు పెట్టించాల్సిన అవసరం ఉన్న వాటికి మెరుగు పెట్టించచ్చు.


చివరగా ధరించాలి!
సాధారణంగా పూర్తిగా తయారై నగలు పెట్టుకున్నాక.. ఆఖర్లో పెర్‌ఫ్యూమ్‌ కొట్టుకుంటాం.. కానీ పెర్‌ఫ్యూమ్‌ కొట్టుకున్నాకే ఆఖర్లో నగలు పెట్టుకోమంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఈ సుగంధ పరిమళాల్లోని రసాయనాల వల్ల నగల మెరుపు తగ్గిపోయే ప్రమాదముంటుందట! అలాగే వీటిని భద్రపరిచే క్రమంలోనూ రసాయనాలు లేని చోట, సూర్మరశ్మి నేరుగా పడని చోట గాలి చొరబడని డబ్బాల్లో భద్రపరచుకోవాల్సి ఉంటుంది.


వెండి నగలైతే ఇలా!
వెండి పట్టీలు, వెండితో చేసిన ఇతర ఆభరణాల్ని సైతం బంగారు నగల్లాగే గాలి చొరబడని డబ్బాల్లో, ఇతర లోహాలకు దూరంగా భద్రపరచాల్సి ఉంటుంది. ఎందుకంటే వెండి నగలపై ఉండే ఆక్సైడ్‌ పూత గాలి తగలడం వల్ల క్రమంగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. తద్వారా అవి కొన్నాళ్లకు మెరుపు కోల్పోయి నల్లగా మారతాయి. కాబట్టి భద్రపరిచేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఈ రోజుల్లో వెండి ఆభరణాల్ని భద్రపరచుకునేందుకు యాంటీ-టర్నిష్‌ పేపర్‌/క్లాత్‌ వంటి ప్రత్యేకమైన క్లాత్స్‌ మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. వాటిని ఎంచుకోవచ్చు.. ఒకవేళ అవి అందుబాటులో లేని పక్షంలో మస్లిన్‌ క్లాత్‌ (మెత్తటి వస్త్రం), టిష్యూ పేపర్లలోనూ వెండి నగల్ని అమర్చి లాకర్‌లో పెట్టేయచ్చు. ఈ క్రమంలో కొన్ని సిలికాజెల్‌ సాచెట్స్‌ లేదంటే యాక్టివేటెడ్‌ చార్‌కోల్‌ను ఆ డబ్బాల్లో ఉంచి వెండి నగల్ని భద్రపరచాలి. తద్వారా ఆ డబ్బాలో తేమ ఏదైనా ఉంటే ఇవి పీల్చుకుంటాయి. తద్వారా అవి ఎక్కువ కాలం మన్నుతాయి. ఒకవేళ అవి మెరుపు కోల్పోయినట్లయితే వాటికి కాస్త టూత్‌పేస్ట్‌ను రుద్ది.. ఆపై మెత్తటి గుడ్డతో తుడిచేస్తే సరిపోతుంది.


వాటిపై గీతలు పడకుండా!
కొంతమంది తమ వివాహం కోసం వజ్రాల ఆభరణాలు ఎంచుకుంటుంటారు.. లేదంటే వారి ఆభరణాల్లో కనీసం ఒక్కటైనా వజ్రం పొదిగిన నగ ఉండేలా చూసుకుంటారు. అయితే ఎక్కువ కాలం పాటు మన్నినప్పటికీ.. పదే పదే వాడే క్రమంలో వీటిపై గీతలు పడడం, డ్యామేజ్‌ కావడం.. వంటివి ఎక్కువగా జరుగుతాయంటున్నారు నిపుణులు. అంటే ఇవి చాలా సున్నితమైనవని అర్థం. అందుకే వీటిని అంతే సున్నితంగా పరిగణించాలంటున్నారు. ఈ క్రమంలో వాడిన ప్రతిసారీ సబ్బు నీటితో శుభ్రపరచడం, పొడి గుడ్డతో తుడవడం, పూర్తిగా ఆరిన తర్వాత ప్రత్యేకమైన బాక్సుల్లో విడివిడిగా భద్రపరచడం వల్ల.. ఇవి డ్యామేజ్‌ కాకుండా జాగ్రత్తపడచ్చు.. అలాగే ఎక్కువ కాలం కొత్త వాటిలా మెరిపించుకోవచ్చు.


మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని