పెళ్లి రోజు ముందు గొడవ పడ్డారా? - tips to celebrate an anniversary even your marriage is in trouble
close
Updated : 19/07/2021 16:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెళ్లి రోజు ముందు గొడవ పడ్డారా?

అమన్‌-అఖిలకు పెళ్లై నాలుగేళ్లయింది. మొదటి రెండేళ్లు ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరు.. ఆ తర్వాత చీటికీ మాటికీ చిర్రుబుర్రులాడడం, ఒకరిపై ఒకరు నిందలేసుకోవడంతో రాన్రానూ ఇద్దరి మధ్య సఖ్యత కొరవడుతోంది. ఈ పంతంతోనే అమూల్యమైన పెళ్లి రోజుని కూడా మిస్సవుతున్నారు.

పావని-ప్రేమ్‌లది కూడా ఇదే సమస్య. ఇలా ఎడమొహం, పెడమొహంగా ఉన్న సమయంలోనే వీరి పెళ్లి రోజు రానే వచ్చింది. ‘అసలే ఒకరంటే ఒకరికి పడట్లేదు.. ఇలాంటప్పుడు పెళ్లి రోజు జరుపుకోవడం అవసరమా?’ అంటోంది పావని.

దాంపత్య జీవితంలో పెళ్లికి ఎంతటి ప్రాధాన్యముందో.. ఏటేటా వచ్చే వివాహ వార్షికోత్సవానికీ అంతే ప్రాముఖ్యం ఉంటుంది. అయితే ఇద్దరి మధ్య గొడవలు, పొరపచ్ఛాలు దొర్లినప్పుడు ఇలాంటి ప్రత్యేక సందర్భాలకు అంతటి ప్రాధాన్యమివ్వరు చాలామంది దంపతులు. కానీ ఇలాంటప్పుడే కాస్త రాజీపడి ఎవరో ఒకరు వెనక్కి తగ్గితే అనుబంధంలో పడిన బీటలకు ప్యాచ్‌ వేయచ్చని చెబుతున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. తద్వారా వైవాహిక బంధంలోని మధురిమల్ని మళ్లీ ఆస్వాదించవచ్చంటున్నారు. మరి, అదెలాగో మనమూ తెలుసుకుందాం రండి..

ఆ జ్ఞాపకాల్ని ఇలా గుర్తు చేయండి!

పెళ్లైన మరుక్షణం నుంచి ఆలుమగల మధ్య ఎన్నెన్నో మధురానుభూతులు చోటుచేసుకుంటాయి. వాటన్నింటినీ ఓసారి జ్ఞప్తికి తెచ్చుకోవడానికి వివాహ వార్షికోత్సవాన్ని మించిన మంచి సందర్భం మరొకటి లేదంటున్నారు నిపుణులు. అయితే అప్పటికే ఇద్దరి మధ్య అన్యోన్యత కొరవడినప్పుడు ఇలాంటివన్నీ గుర్తు చేసుకోవడం అనవసరమనిపిస్తుంటుంది. అలాగని అదే పంతం పట్టుకొని కూర్చుంటే దూరం మరింత పెరిగే అవకాశముంది. కాబట్టి ఈ దూరాన్ని దగ్గర చేయాలంటే మీ ఇన్నేళ్ల జీవితంలో చోటుచేసుకున్న మధురమైన జ్ఞాపకాలకు అక్షర రూపమివ్వాల్సిందే అంటున్నారు నిపుణులు.

ఈ క్రమంలో ‘వెడ్డింగ్‌ యానివర్సరీ మెమరీ బుక్‌’ చక్కటి ఎంపిక! అచ్చం పుస్తకం లాగే ఇందులో కొన్ని పేజీలుంటాయి. ప్రతి పేజీలో ఓవైపు ఫొటోఫ్రేములు, మరోవైపు దానికి సంబంధించిన జ్ఞాపకాలు రాయడానికి వీలుగా ఖాళీ పేజీ ఉంటుంది. ఇద్దరూ కలిసి దిగిన ఫొటోల్లోంచి కొన్ని ఎంచుకొని.. వాటితో ఈ మెమరీ బుక్‌ని నింపేయచ్చు. ఇక దీన్ని యానివర్సరీ రోజు మీ భాగస్వామికి బహుమతిగా అందిస్తే.. అది చూసి వారి మనసులో ఉన్న కోపం కచ్చితంగా హుష్ కాకి అయిపోవాల్సిందే! ఇద్దరి మధ్య పొరపచ్ఛాలున్నా.. మీపై వారికి కోపం ఉన్నా.. అది తాత్కాలికమే అని.. వారికి అర్థమైపోతుంది. సో.. కాస్త సమయం పట్టినా ఇద్దరూ తిరిగి చిలకా గోరింకల్లా కలిసిపోతారు.

ఓ మెట్టు దిగితే తప్పు లేదు!

ఏళ్లు గడిచే కొద్దీ దంపతుల మధ్య మొదట్లో ఉన్నంత సఖ్యత ఉండదనే చెప్పాలి. అందుకు ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడం కూడా ఓ కారణమే! అయితే వీటిని దూరం చేసుకొని అనుబంధాన్ని దగ్గర చేసుకోవాలంటే రాజీపడడం ఒక్కటే మార్గమంటున్నారు నిపుణులు. అలాకాకుండా తప్పు ఎదుటివారిది కాకపోయినా వాళ్లే వచ్చి మీ కాళ్లు పట్టుకోవాలనే అహం ప్రదర్శిస్తే మాత్రం అనుబంధాన్ని తెగే దాకా లాగడమే అంటారు. కాబట్టి అలాంటి అహం, ఆధిపత్యాన్ని పక్కన పెట్టి.. నిజంగా మీ నుంచి తప్పు దొర్లితే వెళ్లి క్షమాపణ కోరండి.. ఒకవేళ తప్పు లేకపోయినా మీ జీవిత భాగస్వామి కోసం ఓ మెట్టు దిగినా పోయేదేమీ లేదంటున్నారు నిపుణులు. కాబట్టి పెళ్లి రోజున కూడా పూర్వపు గొడవల్నే తలచుకొని ముభావంగా ఉండే బదులు.. సర్దుకుపోయి ఇద్దరూ కలిసి సరదాగా సమయం గడిపితే అనుబంధమూ తిరిగి దృఢమవుతుంది.. ఇలా గొడవ పడి కలిసిన ఈ మధుర క్షణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది కూడా!

సఖ్యత పెంచే ‘స్టేకేషన్’!

పెళ్లి రోజు వంటి ప్రత్యేక సందర్భాలను నచ్చిన ప్రదేశాలకు వెళ్లి జరుపుకోవడం, అదీ కుదరకపోతే కనీసం ఆ రోజు డిన్నర్‌కైనా వెళ్లడం చాలామంది దంపతులు చేసేదే! అయితే కరోనా కారణంగా ప్రస్తుతం బయటికి వెళ్లి ఎంజాయ్‌ చేసే పరిస్థితి లేదు. అయినా సరే.. బయటికి వెడితేనే ఒకరిపై మరొకరికి ఉన్న కోపం తగ్గిపోతుంది, కలిసి సమయం గడిపినట్లుంటుంది అనుకోకుండా ఇంట్లోనే హ్యాపీగా ‘స్టేకేషన్‌’ని ఎంజాయ్‌ చేయచ్చు. ఇందులో భాగంగా వర్చువల్‌ రియాల్టీ టెక్నాలజీ సహాయంతో ఇంట్లో కూర్చొనే మీకు నచ్చిన ప్రదేశాలకు వెళ్లి రావచ్చు. కాసేపు కలిసి వ్యాయామం చేయడం, మరికాసేపు సరదాగా కబుర్లు చెప్పుకోవడం, రాత్రుళ్లు ఇంట్లోనే డిన్నర్‌ డేట్‌.. ఇలా ఆలోచిస్తే పెళ్లి రోజు దంపతులకు మధురానుభూతుల్ని పంచే అంశాలు చాలానే ఉంటాయి. ఇక ఈ క్రమంలో గతంలో మీ ఇద్దరి మధ్య జరిగిన చేదు అనుభవాలు గుర్తుకు రమ్మన్నా రావు.. అంటే ఇవీ బీటలు వారిన అనుబంధాన్ని తిరిగి పునర్నిర్మిస్తాయనే కదా అర్థం!

ముందే ప్లాన్‌ చేశారా?

ఆలుమగల బంధంలో ఎన్ని ఒడిదొడుకులున్నా.. పెళ్లి రోజు, పుట్టినరోజు వంటి ప్రత్యేక సందర్భాలొస్తున్నాయంటే మాత్రం ముందు నుంచీ ఎంతో కొంత ప్లాన్ చేసుకోవడం సహజం! ఈ క్రమంలో- తమ భాగస్వామిని సర్‌ప్రైజ్‌ చేయాలనుకునే దంపతులూ ఎంతోమంది ఉంటారు. ఇలాగైనా గొడవలు సద్దుమణిగి తిరిగి హ్యాపీగా ముందుకెళ్లచ్చన్నది వారి భావన! మీరూ ఇలాంటి ఆలోచనలోనే ఉన్నారా? అయితే ప్రొసీడ్‌ అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీరు చేసే సర్‌ప్రైజ్‌, ఇచ్చే కానుక, వారికిష్టమైన పదార్థం వండి పెట్టడం.. ఇలా ఏదైనా సరే.. వాళ్లు ఎలా ప్రతిస్పందిస్తారోనన్న విషయం పక్కన పెట్టి వాళ్లను సంతోషపెడదాం అన్న ఆలోచనతోనే ముందుకు సాగితే తప్పకుండా ఫలితం ఉంటుందంటున్నారు. దీంతో ‘ఇద్దరి మధ్య జరిగిన గొడవలు మర్చిపోయి తను నా కోసం ఇంత చేసినప్పుడు నేను మొండిగా ప్రవర్తించడంలో అర్థం లేదు..’ అని ఎదుటివారు కరిగిపోయే ఆస్కారమూ లేకపోలేదు. మరి, ఇదీ ఒకవిధంగా పెళ్లి రోజున ఇద్దరినీ తిరిగి కలిపే అంశమే కదా!!

మీ కోసం మీరుగా..!

ఎంత గొడవలైనా ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో తిరిగి మామూలైపోయే జంటలు కొన్నుంటే.. ‘ఏ అకేషన్‌ వచ్చినా నా మనసు మాత్రం కరగదు..’ అని మొండిగా భీష్మించుక్కూర్చుంటారు మరికొందరు. ఇలాంటి వారికోసం ఎదుటివారు ఏం చేసినా వీళ్ల మనసు కరగదు.. సరికదా గత చేదు అనుభవాలను గుర్తు చేసుకుంటూ సంతోషంగా గడిచిపోవాల్సిన రోజును మరింత నరకం చేస్తుంటారు. భాగస్వామిని బాధపెడుతుంటారు. మీ భార్య/భర్త కూడా ఇంతేనా?! అయితే ఈ ప్రత్యేకమైన రోజున వాళ్ల కోసం మీరు ముభావంగా ఉండకుండా మీకు మీరుగా సమయం గడపమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీకు నచ్చిన కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌తో కాసేపు మాట్లాడడం.. నచ్చిన సినిమాలు చూడడం/గేమ్స్‌ ఆడుకోవడం/పిల్లలతో గడపడం.. వంటివి చేయచ్చు. తద్వారా మనసు సానుకూలంగా ఉంటుంది. మీలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఇక ఆ తర్వాత ఓ సందర్భం చూసుకొని ఎంతకీ మారని మీ భాగస్వామి గురించి మీ ఇంట్లో పెద్దవాళ్లు, వాళ్ల అమ్మానాన్నలతో కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారమయ్యే అవకాశాలు ఉంటాయి.

కాబట్టి దాంపత్య బంధంలోని గొడవల్ని సాకుగా చూపి.. బంగారం లాంటి వివాహ వార్షికోత్సవాన్ని నరకం చేసుకోకుండా ఇలా సంతోషంగా గడిపేయండి. బీటలు వారిన అనుబంధాన్ని తిరిగి దగ్గర చేయడానికి, ఇద్దరినీ ఒక్కటి చేయడానికి ఈ ప్రత్యేకమైన రోజును ఇలా ఉపయోగించుకోండి! అంతేకాదు.. మీ మధ్య పొరపచ్ఛాలున్నప్పుడు మీరు మీ వివాహ వార్షికోత్సవాన్ని ఎలా సెలబ్రేట్‌ చేసుకుంటారు? తిరిగి దగ్గరవడానికి ఎలాంటి చిట్కాలు పాటిస్తారు? మాతో పంచుకోండి.. ‘దాంపత్య బంధంలో గొడవలూ తీపి జ్ఞాపకాలే’ అని మీ మాటగా అందరికీ తెలియజేయండి.


మరిన్ని

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని