భయాన్ని భయపెట్టాలి

అంతర్యామి

భయాన్ని భయపెట్టాలి

మనిషి ఉనికిని ప్రశ్నార్థకం చేసి బలహీనపరచి మనుగడ ఎలాగన్న దిగులుతో జీవితాన్ని అంతం చేసే పెనుభూతం- భయం. అంతుచిక్కని వ్యాధి మహమ్మారిలా దాపురించి ఆయుష్షును అపహరించి తనవారిని దూరం చేస్తుందన్న భయం, శత్రువు ఏ క్షణంలో దాడిచేసి ఎలా ఉసురు తీస్తాడోనని కంటిమీద కునుకు కరవై ప్రాణభయంతో వణికేలా చేసే భయం, ఎంతటి బలవంతుడినైనా మానసికంగా దుర్బలుడిని చేసి ఆందోళన, కుంగుబాటుతో సగమయ్యేలా చేసే భయం... ఇవన్నీ ఎందుకు దాపురిస్తాయి? సమస్యల పట్ల, భవిష్యత్తు పట్ల అవగాహన లేక, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక తొందరపాటుకు లోనై స్వయంకృతాపరాధంతో జీవితాన్ని దుఃఖభాజనం చేసుకున్న కొందరి వెతలే ఈ భయాలు. జీవితాలను మింగేసే పిరికితనం, వచ్చి పడుతున్న కష్టాలను ఎదిరించలేని అసమర్థత నిస్సత్తువకు లోనుచేసి విచలితుల్ని చేస్తాయి.

ఒక్కోసారి వ్యక్తిగత భయాలు సామూహిక భయాలుగా మారి, సమాజాన్ని ఆవహించి, ప్రజను, జాతిని నిర్వీర్యం చేసే ప్రమాదముంది. అలాంటి తరుణంలో జనాన్ని సంఘటితపరచి, ఓదార్చి, ధైర్యంగా ఏకతాటిపై నడిపించే శక్తి కావాలి. చేయి పట్టుకుని ముందుకు నడిపించే వ్యక్తి రావాలి. స్వాతంత్య్ర పాంచజన్యాన్ని పూరించి, జాతికి జవ జీవాలందించి సామూహికంగా విదేశీ శక్తుల్ని తరిమికొట్టారు గాంధీజీ. కదన రంగంలో పిరికితనం ఆవహించి సత్తువ కోల్పోయిన అర్జునుడికి సమయానికి అండగా నిలిచి, గీతను బోధించి ధైర్యాన్ని నింపాడు శ్రీకృష్ణుడు.

భయపడుతున్నంతకాలం భయపెట్టే వాళ్లుంటారు. మన మనోధైర్యాన్ని మరింత దిగజారుస్తారు. కావలసినవారైనా వారికి దూరంగా ఉండటమే మేలు. మనల్ని మనం పిరికివాళ్లుగా భావిస్తే అలాగే మిగిలిపోతాం. సింహసదృశ ధైర్యంతో ఎదురు తిరిగితే, మనలోని శక్తి మనకు అర్థమై విజయ సోపానాలను చేరుకుంటాం. ఉలి దెబ్బలు ఓరిమితో భరించిన బండరాయి, బహువిధ ఆకృతులతో ఒప్పారినట్లు మొక్కవోని ఆత్మవిశ్వాసం, సడలని నమ్మకం, సూక్ష్మదృష్టి, సమయానికి తగిన తెలివి ఎక్కడ ప్రవర్తిల్లుతాయో అక్కడ ఎంతో బలవత్తరమైన శక్తి అయినా ధైర్యవంతుణ్ని పడగొట్టలేదు.

భయమే మృత్యువు. దానికి తల వంచక సమర్థంగా ఎదిరించాలి. ‘ప్రపంచం పిరికిపందలది కాదు. భయాన్ని చూసి పారిపోకు. ఢీకొట్టి నిలు. ఉక్కు సంకల్పంతో దాన్ని ఎదిరించు’ అన్నారు స్వామి వివేకానంద. ప్రేమే జీవితమని గుర్తించి, ప్రేమతో భయాన్ని జయించాలి. తెలివితో చిరుదీపం వెలిగించి, పెనుచీకటిని తరిమికొట్టాలి. ఆత్మస్థైర్యంతో ఔషధాలు స్వీకరించి మహారోగాల్ని సైతం దేహం నుంచి పారదోలాలి. ప్రేమవర్షంతో ముంచెత్తి శత్రువును కూడా మిత్రుడిగా చేసుకోవాలి. ఓర్పు, క్షమ, ప్రేమ, కరుణ నిరంతరం మనలో పొంగిపొర్లాలి.

రేపటి గురించి దిగులు పడితే నేటి ఆనందం చేజారి మనశ్శాంతి కోల్పోయే పరిస్థితి దాపురిస్తుంది. చీకటంటే భయపడే పిల్లవాడిని ఆ చీకట్లోనే ఉంచి భయం ఎక్కడుందో చూపించమని, అది నిన్నేం చేయదని ధైర్యం నూరిపోయాలి. నిజానికి భయాన్ని మనం భయపెట్టాలేగానీ, భయానికి మనం తలొంచితే అది మనల్ని కబళిస్తుంది. ఏ జాతి అయితే పిరికితనానికి బానిస కాకుండా దృఢ చిత్తంతో తలెత్తుకుని నిలబడుతుందో ఆ జాతే లోకానికి ఆదర్శం. ఆ జాతి వెన్నెముక ఎప్పుడూ దృఢంగా నిటారుగా నిలబడుతుంది.

- మాడుగుల రామకృష్ణ


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న