close
బోటు తీయడం కష్టమే!

నౌకాదళమూ చేతులెత్తేసింది
  వెలికితీతకు పలు వ్యూహాల పరిశీలన
‘బలిమెల’ పద్ధతి అసాధ్యమని నిర్ధారణ

కచ్చులూరు, దేవీపట్నం నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధులు: పాపికొండల్లో కచ్చులూరు దగ్గర సుడిగుండంలో చిక్కుకుని మునిగిన బోటును వెలికితీయడం కష్టంగా మారింది. గల్లంతైన వారిలో ఇంకా దాదాపు 20 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. బోటులో కొందరు చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. అందుకు తగ్గట్టే ప్రమాద ప్రాంతంలో మంగళవారం కొన్ని మృతదేహాలు వెలికివచ్చాయి. ఈ నేపథ్యంలో బోటును కనుగొని పైకి తేవడం ఎంతో ముఖ్యం. పలు కీలక బృందాలు ఎంతో కృషి చేస్తున్నా... ఫలితం కానరాలేదు.

దశరథ్‌ వచ్చారు... సాధ్యం కాదన్నారు
జాతీయ విపత్తు నిర్వహణ బృందం, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందం, నౌకాదళం, ఉత్తరాఖండ్‌ విపత్తు నిర్వహణ బృందం... బోటు వెలికితీతలో నిమగ్నమయ్యాయి. నౌకాదళానికి చెందిన ఉన్నతాధికారి దశరథ్‌కు ఈ తరహా వెలికితీతల్లో ఎంతో అనుభవం ఉందని, ఆయన వస్తే విషయం తేలిపోతుందని సోమవారం అధికారుల మధ్య కొంత చర్చ జరిగింది. అనుకున్నట్లే దశరథ్‌ మంగళవారం వచ్చారు. ప్రమాద ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. గోదావరిలో 150 అడుగుల లోతు దాకా వెళ్లేందుకే తమకు అనుమతి ఉందని, అంతకుమించి వెళ్లలేమని దశరథ్‌ పేర్కొన్నట్లు కొందరు అధికారులు చెప్పారు. ఇంత సమయం తర్వాత అంత లోతున ఎవరూ జీవించి ఉండే అవకాశం లేదని, ఈ పరిస్థితుల్లో సాహసం చేసేందుకు తమకు అనుమతులు ఉండవని పేర్కొన్నట్లు సమాచారం.

ఆ పద్ధతీ పనికిరాదు...
బోటు ఉనికిని గుర్తించి, వెలికి తీసేందుకు విభిన్న వ్యూహాలను అధికార యంత్రాంగం మంగళవారం పరిశీలించింది. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బోట్లను ఎలా పైకి తెచ్చారు? ఆ విధానాలను కచ్చులూరు దగ్గర వర్తింపజేసేందుకు అవకాశం ఉందా? లేదా అని అధికారులు చర్చించారు. కొన్నేళ్ల కిందట బలిమెల రిజర్వాయరులో భద్రతా బలగాలతో కూడిన బోటు మునిగింది. అప్పట్లో దాన్ని వెలికితీసేందుకు అనుసరించిన పద్ధతిని ఇక్కడ అమలు చేయొచ్చా? అని మొదట ఆరా తీశారు. బలిమెల సహాయక చర్యల్లో పాలుపంచుకున్న సీలైన్‌ అనే సంస్థ ప్రతినిధిని ఘటనా స్థలానికి రప్పించారు. అన్ని కోణాల్లోనూ పరిశీలించాక... ఆ విధానాన్ని ఇక్కడ అనుసరించడం అసాధ్యమని తేల్చారు.

బలిమెల ఘటనలో ఇలా...
* జలాశయం కావడంవల్ల అక్కడ ప్రవాహం నిశ్చలంగా ఉంది.
* మునిగిన బోటును 60-70 అడుగుల లోతులోనే గుర్తించగలిగారు.
* స్కూబా డైవర్లను లోపలికి పంపించి... బోటుకు తాళ్లను కట్టి, బెలూన్‌ సాంకేతికత ద్వారా పైకి తేలేలా చేయగలిగారు.

కచ్చులూరులో ఎందుకు కష్టం
* 315 అడుగుల లోతులో బోటు చిక్కుకుని ఉండొచ్చని అంచనా.
* నేవీ, జాతీయ విపత్తు నిర్వహణ దళానికి చెందిన స్కూబా డైవర్లు 50-60 అడుగుల లోతు వరకే వెళ్లగలిగారు.
* బోటు ఉన్న ప్రదేశానికి చేరుకుని దానికి తాళ్లు కట్టడమో మరొకటి చేయటమో సాధ్యం కాదు.
* కాకినాడ నుంచి వచ్చిన మత్స్యకారులు అంత ఎక్కువ లోతుకు వెళ్లలేమని తేల్చారు.
* బోటు మునిగిన ప్రాంతంలో నది వెడల్పు తక్కువ, లోతుకు వెళ్తున్న కొద్దీ ప్రవాహ వేగం ఉద్ధృతంగా ఉంది.

వారి సాంకేతికత మెరుగు

ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సోనార్‌ పరిజ్ఞానంతో బోటు ఉనికిని తెలుసుకునేందుకు ప్రయత్నించినా ఫలితం చిక్కలేదు. ప్రస్తుతం ఉన్న అన్ని బృందాల్లోనూ ఉత్తరాఖండ్‌ రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందం దగ్గర ఉన్న సాంకేతికత కొంత మెరుగ్గా ఉందని ఓ కీలక విభాగానికి చెందిన ప్రాంతీయ స్థాయి అధికారి వ్యాఖ్యానించారు. నదిలో దాదాపు 150 మీటర్ల వరకు ఆచూకీ కనుగొనే సామర్థ్యం వారికి ఉంది. అందుకే ఉత్తరాఖండ్‌ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళ సిబ్బందిని రప్పించారు. సైడ్‌ సోనార్‌ ద్వారా దాదాపు 300 అడుగులకు పైగా పరిశీలించారు. బోటును గుర్తించేందుకు ఇసుక మేటలు అడ్డంకిగా మారాయి. బోటు మునిగిన ప్రాంతాన్ని అంచనా వేసినా.. సరిగ్గా ఎక్కడుందో, ఎటువైపు బోల్తాపడిందో తెలుసుకోవడానికి ఇది అవరోధంగా మారింది.  ప్రమాదస్థలి 2 కొండల నడుమ వాలుగా ఉండటంతో దానికనుగుణంగా సైడ్‌ సోనార్‌ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. మంగళవారం ఉదయం నుంచి 20, 30 సార్లు బోటు ఆచూకీని కనుగొనేందుకు ప్రయత్నించారు. నీటిలో దృశ్యాలను సేకరించగలిగే స్టార్‌ఫిష్‌ పరికరాన్ని లోపలకు పంపారు. కొంత లోతుకు వెళ్లాక ఇసుక మేటలు మినహా ఇంకేమీ కనిపించలేదని ఉత్తరాఖండ్‌ విపత్తు నిర్వహణ దళం ఇన్‌స్పెక్టర్‌ జితేంద్ర జోషి ‘ఈనాడు’ ప్రతినిధికి తెలిపారు. ప్రమాద ప్రదేశం దగ్గర సుడిగుండాలు అధికంగా ఉండటంతో బోటు అట్టడుగుకు చేరుకుని ఉండొచ్చని వివరించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు మరికొందరు కలిసి బోటు మునిగిపోయిన ప్రాంతంలో తాడుకు కొక్కెం కట్టి లోపలికి వేసినా ఫలితం లేకపోయింది.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.