close

ప్రధానాంశాలు

అభ్యంతరాల స్వీకరణ ఇలాగేనా?

రైతుల జీవితానికి సంబంధించిన అంశమిది
నాలుగు రోజుల్లో మూడు రోజులు సెలవులే: హైకోర్టు

హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
20వరకు గడువు పొడిగించాం: ఏజీ

ఈనాడు, అమరావతి: రాజధానికి భూములిచ్చిన రైతులు సీఆర్‌డీఏకు అభ్యంతరాలు సమర్పించేందుకు గడువును ఈ నెల 20వతేదీ మధ్యాహ్నం 2.30వరకు పొడిగించారు. ఈ మేరకు అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌ హైకోర్టుకు విన్నవించారు. విన్నపాలు, ఫిర్యాదులు సమర్పించడానికి ఈనెల 14 నుంచి 17 వరకు మాత్రమే గడువునివ్వడాన్ని సవాలు చేస్తూ వెలగపూడి గ్రామానికి చెందిన రైతు పాటిబండ్ల వెంకటసుధాకర్‌, మరికొందరు శుక్రవారం హైకోర్టులో వేర్వేరుగా అత్యవసర వ్యాజ్యాలు వేశారు. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం విచారించింది. ఓ పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్‌ వాదనలు వినిపించారు. మూడు రాజధానులకు సిఫారసు చేస్తూ నిపుణుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని వివరించారు. దీనిపై సీఆర్‌డీఏకు అభ్యంతరాలు సమర్పించాలని ప్రభుత్వం ఏర్పాటుచేసిన హైపవర్‌ కమిటీ రైతులను కోరిందని తెలిపారు. 14 నుంచి 16వ తేదీ వరకు ప్రభుత్వ సెలవులేనని, వేలాది రైతులు ఆన్‌లైన్‌లో సమర్పించడం 17వ తేదీన ఒక్క రోజులో అసాధ్యమని అన్నారు. శుక్రవారం సర్వరు పనిచేయలేదని, అభ్యంతరాల సమర్పణకు ఉంచిన నమూనా కూడా సక్రమంగా లేదని తెలిపారు. వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. సముచితమైన గడువునివ్వకుండా ఎలా ముందుకెళతారని ఏజీని ప్రశ్నించింది. మరికొంత సమయమివ్వాలని ఆదేశించింది. ఏ అంశాలపై అభ్యంతరాలు సమర్పించాలో ఎక్కడ పేర్కొన్నారని ప్రశ్నించింది.

‘‘రైతుల అభ్యంతరాల స్వీకరణకు 4 రోజుల గడువునిస్తే 3 రోజులు ప్రభుత్వ సెలవులున్నాయి. ఒక్క రోజే సమయమిచ్చి అభ్యంతరాలు సమర్పించాలనడం ఏ విధంగా సమంజసం? ఏ అంశాలపై అభ్యంతరాలు తెలపాలో కూడా ఉత్తర్వులలో పేర్కొనలేదు. ఆంగ్లంలో ఉన్న ఉత్తర్వులను అర్థం చేసుకోవడానికి రైతులేమైనా ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జ్‌ వర్సిటీల్లో చదువుకున్నారా? రాజధానికి భూములిచ్చిన రైతుల జీవితాలతో ముడిపడిన వ్యవహారమిది.  ఈ విషయం మీకు గుర్తుందా?’

-రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు


విధాన నిర్ణయం మారడానికి వీల్లేదు: సీనియర్‌ న్యాయవాది
పిటిషనర్‌ తరఫున మరో సీనియర్‌ న్యాయవాది సతీష్‌ పరాశరన్‌ వాదనలు వినిపించారు.రాజధానిపై నిపుణుల కమిటీ, బోస్టన్‌ గ్రూప్‌ నివేదికలను ప్రజలకు అందుబాటులో ఉంచేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ప్రభుత్వం మారినంత మాత్రాన విధాన నిర్ణయాలు మారడానికి వీల్లేదన్నారు. న్యాయవాది ఆనంద్‌శేషు వాదనలు వినిపించారు. 16వ తేదీ వరకు 1049 ఈమెయిల్స్‌ రూపంలో, 2012 అభ్యంతరాలు నేరుగా అందాయని అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌ తెలిపారు. 18,761 వెబ్‌సైట్‌లో పోస్టు చేశారని తెలిపారు. 17న 600 వినతులు అందాయన్నారు. వివరాలను నమోదు చేసిన ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. కమిటీ నివేదికలను బహిర్గతం చేయాలన్న న్యాయవాదుల అభ్యర్థనను తిరస్కరించింది.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.