కోర్టుకెళ్లే యోచనలో చంద్రబాబు?

ప్రధానాంశాలు

కోర్టుకెళ్లే యోచనలో చంద్రబాబు?

జగన్‌ ప్రభుత్వానిది కక్ష సాధింపన్న తెదేపా అధినేత

ఈనాడు, అమరావతి, హైదరాబాద్‌: రాజధాని అమరావతి అసైన్డ్‌ భూముల వ్యవహారంలో తనకు సీఐడీ నోటీసులు ఇవ్వడాన్ని కోర్టులో సవాలు చేయాలన్న యోచనలో  తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబు ఉన్నట్టు సమాచారం. చంద్రబాబును మంగళవారం పార్టీ సీనియర్‌ నాయకులు పయ్యావుల కేశవ్‌, కిశోర్‌కుమార్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో కలసినప్పుడు.. సీఐడీ నోటీసుల అశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. ‘ప్రభుత్వం కక్షపూరితంగా వెళ్తోంది. మొదట పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు నా వరకూ వచ్చారు. ధైర్యంగా ఎదుర్కొందాం. ఏ తప్పూ చేయనప్పుడు ఇలాంటి వాటికి భయపడాల్సిన పనిలేదు’ అని వారితో చంద్రబాబు పేర్కొన్నట్టు తెలిసింది. చంద్రబాబు బుధవారం ఏలూరు వెళుతున్నారు. కుమారుడు చనిపోయిన విషాదంలో ఉన్న మాజీ ఎంపీ మాగంటి బాబును ఆయన పరామర్శించనున్నారు. అక్కడి నుంచి అమరావతికి చేరుకుంటారు. న్యాయనిపుణులతో చర్చించాక.. తదుపరి కార్యాచరణపై ఆయన నిర్ణయం తీసుకోనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.

అక్రమ కేసులు: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తూ అక్రమ కేసులు పెడుతూ కక్షసాధింపు ధోరణిలో జగన్‌ ప్రభుత్వం పాలన సాగిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తెదేపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, సీనియర్‌ నేతలు మచ్చా నాగేశ్వరరావు, రావుల చంద్రశేఖరరెడ్డి, అరవిందకుమార్‌గౌడ్‌, బక్కని నర్సింలు తదితరులు మంగళవారం చంద్రబాబు ఇంటికి వెళ్లి కలిశారు. ఏపీ ప్రభుత్వం పెట్టిన కేసులపై ఈ సందర్భంగా వారు చర్చించారు. ఏపీ ప్రభుత్వ తీరును తెలంగాణ తెదేపా నేతలు తప్పుపట్టారు. ఏపీలో ప్రభుత్వం ఏర్పడిన 20 నెలల తర్వాత కావాలని చంద్రబాబును ఇబ్బంది పెట్టాలని అక్కడి సీఎం జగన్‌ చూస్తున్నారని రావుల అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా పోటీచేసిన రమణ తన ప్రచార తీరును అధినేతకు వివరించారు.
హైకోర్టు చెప్పినా వినకుండా: అనంతరం మాజీ ఎమ్మెల్యేలు బక్కని నర్సింలు, కాట్రగడ్డ ప్రసూన, తెలుగుమహిళ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు జ్యోత్స్న, ఏపీ తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. అమరావతి భూముల సేకరణలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరగలేదని హైకోర్టు చెప్పినా జగన్‌ వినకుండా.. అహంకారపూరితంగా చంద్రబాబుపై మళ్లీ కేసులు పెట్టారని నర్సింలు ఆరోపించారు. జగన్‌ వల్ల ఎంతోమంది అధికారులు జైలు పాలయ్యారని, ఇప్పటికైనా కక్షసాధింపు రాజకీయాలు మానుకోవాలని దివ్యవాణి అన్నారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని