మీరా భారత్‌ మహాన్‌

ప్రధానాంశాలు

మీరా భారత్‌ మహాన్‌

రజతం గెలిచిన వెయిట్‌లిఫ్టర్‌ చాను
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ బోణ

ప్రపంచ వేదికపై తనదైన ముద్ర వేయాలని తహతహలాడుతున్న దేశానికి ఇంతకుమించిన ఆరంభమేముంటుంది! ఎప్పటిలా... ఇంకెప్పుడు పతకాల పట్టికలో చేరతామా అని ఆశగా నిరీక్షించాల్సిన పనిలేదు.

మన మీరా మెరిసింది... పతకంతో మురిపించింది!

టోక్యో: మణిపుర్‌ ఉక్కు మహిళ మీరాబాయి చాను ఒలింపిక్‌ పతక పోటీల తొలి రోజే భారతదేశానికి రజతాన్ని అందించింది. ఆత్మవిశ్వాసమే కొండంత బలంగా 49కేజీల విభాగంలో 202 కిలోలు ఎత్తి రెండో స్థానం సాధించింది. చాను పుణ్యమా అని కాసేపే అయినా.. చరిత్రలో ఏనాడూ లేని విధంగా పట్టికలో భారత్‌ ద్వితీయ స్థానాన్ని ఆక్రమించింది. 2016 రియో క్రీడల చేదు జ్ఞాపకాలను చెరిపేసుకుంటూ.. తెలుగు తేజం మల్లీశ్వరి (2000-సిడ్నీ-కాంస్యం) తర్వాత ఒలింపిక్‌ పతకం గెలిచిన భారత వెయిట్‌ లిఫ్టర్‌గా మీరాబాయి చాను ఘనత సాధించింది.

సగర్వంగా రజతాన్ని ముద్దాడింది. మల్లీశ్వరిని అధిగమిస్తూ భారత్‌ తరఫున ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వెయిట్‌లిఫ్టర్‌గా చాను నిలిచింది. స్నాచ్‌లో 87 కిలోలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 115 కిలోలు మొత్తం 202 కిలోలు ఎత్తింది. చైనా లిఫ్టర్‌ హు జిహుయ్‌ 210 (94కేజీ+116కేజీ) కిలోలు ఎత్తి స్వర్ణం సాధించింది. మొత్తం మూడు విభాగాల్లోనూ (స్నాచ్‌, క్లీన్‌ అండ్‌ జెర్క్‌, టోటల్‌) ఆమె ఒలింపిక్‌ రికార్డులు సృష్టించింది. ఇండోనేషియాకు చెందిన అయిసా విండీ కంటికా 194 కిలోలు (84కేజీ+110కేజీ) ఎత్తి కాంస్యం సొంతం చేసుకుంది. చాను స్నాచ్‌లో తన బలహీనతను దృష్టిలో ఉంచుకుని పోటీని జాగ్రత్తగా ఆరంభించింది. తొలి ప్రయత్నంలో 84 కిలోలు ఎత్తిన ఆమె.. రెండోసారి 87 కిలోలు మోసింది. చివరగా.. నిరుడు జాతీయ ఛాంపియన్‌షిప్‌ సందర్భంగా నమోదు చేసిన తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన (88కేజీ) కన్నా కిలో ఎక్కువగా 89 కిలోలు ఎత్తడానికి ప్రయత్నించింది. కానీ సఫలం కాలేకపోయింది. దీంతో స్నాచ్‌ను 87 కిలోలతో ముగించింది. ఇందులో జిహుయ్‌ (94 కేజీ) మాత్రమే చాను కన్నా మెరుగైన ప్రదర్శన చేయగలిగింది. చాను క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో వరుసగా 110 కిలోలు, 115 కిలోలు ఎత్తింది. మూడో ప్రయత్నంలో 117 కిలోలు ఎత్తడానికి ప్రయత్నించి విఫలమైంది. ఎత్తుంటే అది ఒలింపిక్‌ రికార్డయ్యేది. చివరి ప్రయత్నంలో సఫలం కాలేకపోయినా.. మొత్తంగా ఆమె ప్రదర్శన భారత్‌కు రజతాన్ని అందించింది. మీరాబాయి చాను ఇంతకుముందు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పసిడి సాధించింది. రెండుసార్లు కామన్వెల్త్‌ ఛాంపియన్‌గా నిలిచింది.


అయిదేళ్లుగా కల కంటున్నా

యిదేళ్లుగా దీని గురించి కల కంటున్నా. చాలా గర్వంగా ఉంది. పసిడి కోసం ప్రయత్నించా. కానీ నాకు రజతం కూడా గొప్పే. ఈ ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున తొలి పతకం గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది.

- మీరాబాయి చాను


15

లింపిక్స్‌లో వ్యక్తిగత పతకం నెగ్గిన 15వ భారత అథ్లెట్‌ మీరాబాయి. మహిళల్లో మల్లీశ్వరి, మేరీకోమ్‌, సైనా నెహ్వాల్‌, పి.వి.సింధు, సాక్షి మలిక్‌ల తర్వాత ఈ ఘనత సాధించింది ఆమే. వీరిలో సింధు, మీరా రజతాలు గెలవగా.. మిగతా వాళ్లు కాంస్యాలు సాధించారు.


ఇంతకుమించిన ఆరంభమేముంది

మీరాతో మాట్లాడిన ప్రధాని

దిల్లీ: రజతంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత ప్రస్థానాన్ని ఘనంగా ఆరంభించిన వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చానును ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. టోక్యోలో ఉన్న మీరాతో ఫోన్లో మాట్లాడిన ఆయన.. ఆమెపై ప్రశంసలు కురిపించారని, భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. ‘‘టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇంతకంటే ఆనందమైన ఆరంభం ఏముంటుంది? మీరాబాయి అద్భుత ప్రదర్శనతో భారత్‌ ఉప్పొంగుతోంది. ఆమె విజయం ప్రతి భారతీయుడికీ స్ఫూర్తి కలిగిస్తోంది’’ అని ప్రధాని ట్వీట్‌ చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని