
తెలంగాణ
ఇద్దరికీ గుండెపోటే!
ఈనాడు డిజిటల్, కామారెడ్డి, గాంధారి, న్యూస్‌టుడే: ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి వచ్చిన రోగి, ప్రాణం పోసేందుకు ప్రయత్నించిన వైద్యుడు... ఇద్దరూ గుండెపోటుతో మరణించిన విషాదకర ఘటన కామారెడ్డి జిల్లా గాంధారిలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజ్జుల్ తండాకు చెందిన కాట్రోత్ జగ్యానాయక్(48) గొల్లాడితండాలోని బంధువుల ఇంటికి శనివారం దినకర్మకు వెళ్లారు. కార్యక్రమం అనంతరం ఆదివారం తెల్లవారుజామున ఇంటికి ప్రయాణమవుతున్న సందర్భంలో గుండెపోటు వచ్చి సొమ్మసిల్లి పడిపోయారు. కుటుంబసభ్యులు ఆయనను వెంటనే గాంధారిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. జగ్యానాయక్కు చికిత్స చేస్తూ.. వైద్యుడు లక్ష్మణ్ (43) హఠాత్తుగా గుండెపోటుకు గురై అక్కడికక్కడే కుప్పకూలారు. ఆసుపత్రి సిబ్బంది చికిత్స చేస్తుండగానే లక్ష్మణ్ కన్నుమూశారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న జగ్యానాయక్ను కామారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో ఆయనా మృతి చెందారు. లక్ష్మణ్ది మహబూబాబాద్ జిల్లా కురవి మండలం టేకుపల్లి తండా. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్, ఎంఎస్ సర్జన్ పూర్తి చేశారు. ప్రస్తుతం నిజామాబాద్‌లోని వైద్యకళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ గాంధారిలో ప్రైవేట్ క్లినిక్ నడుపుతున్నారు. ఆయనకు ఇద్దరు అమ్మాయిలు శ్రీజ(13), దక్షిణి(11), భార్య స్నేహలత ఉన్నారు. రోగి జగ్యానాయక్కు భార్య గంగిబాయి, ముగ్గురు కుమారులున్నారు.