ప్రపంచానికి గాంధీజీ పోరాట స్ఫూర్తి ఆదర్శం

గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌

విద్యాధరపురం (విజయవాడ), న్యూస్‌టుడే: ప్రపంచ దేశాలకు గాంధీజీ పోరాట స్ఫూర్తి ఆదర్శమని రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. విజయవాడలోని స్వాతంత్య్ర సమరయోధుల భవనంపై ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా సర్వోదయ ట్రస్టు ఏర్పాటుచేసిన 30 అడుగుల జాతిపిత మహాత్మాగాంధీ కుడ్య విగ్రహాన్ని ఆయన ఆదివారం ఆవిష్కరించారు. దేశ స్వాతంత్రోద్యమంలో గాంధీజీ పిలుపు మేరకు లక్షల మంది వీధుల్లోకి వచ్చి బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా అహింసా మార్గంలో పోరాడారని, అదే వివిధ దేశాలకు ప్రేరణనిచ్చిందని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మహనీయులను స్మరించుకోవాలని, ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని కోరారు. స్వాతంత్య్ర సమరయోధురాలు రావూరి మనోరమ(96), జి.విమలకుమారి, రావూరి శారద, మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌, ఎస్‌.స్వర్ణలత, సామంతపూడి నరసరాజు, జి.కమలమ్మలను గవర్నర్‌ సత్కరించారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు, సర్వోదయ ట్రస్టు అధ్యక్షుడు డాక్టర్‌ జి.వి.మోహన్‌ప్రసాద్‌, కార్యదర్శి ఎం.వెంకటేశ్వరరావు, సభ్యులు ఎం.సి.దాస్‌, కొత్తా విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts