krithi shetty: ‘ఉప్పెన’ తర్వాత అన్నీ అలాంటి పాత్రలే వచ్చాయి: కృతిశెట్టి

‘మాచర్ల నియోజకవర్గం’ అన్ని వర్గాలను ఆకట్టుకునే సినిమా అని, కుటుంబ ప్రేక్షకులు కూడా థియేటర్‌కు వచ్చి చూసేలా ఉంటుందని కథానాయిక కృతిశెట్టి పేర్కొంది. నితిన్‌తో కలిసి ఆమె నటించిన తాజా చిత్రమిది. రాజశేఖర్‌ దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా కృతి పంచుకున్న విశేషాలు..

తెలుగులో వరుస సినిమాలు చేస్తున్నారు.. కథల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?

కృతిశెట్టి: నాలోని ప్రతిభని గుర్తించి అవకాశాలు ఇస్తున్న దర్శక-నిర్మాతలకు కృతజ్ఞతలు. కథ విన్నప్పుడే ఒక నమ్మకం వస్తుంది. సినిమా ప్రేక్షకులకు వినోదం పంచుతుందనిపిస్తుంది. అలా అనుకునే చేస్తా. ఫలితంపై నాకు ఎలాంటి బాధా ఉండదు. ఏది జరిగిన ఒక పాఠంగానే తీసుకుంటాను తప్ప.. అదే ఆలోచిస్తూ కూర్చోను.

‘మాచర్ల నియోజకవర్గం’ కథ ఎలా ఉండబోతుంది ?

కృతిశెట్టి: ఇందులో నా పాత్ర పేరు స్వాతి. కథ గురించి అప్పుడే ఎక్కువ చెప్పకూడదు గానీ.. నేను విన్న వెంటనే ఓకే చెప్పిన స్క్రిప్ట్ ఇది. చాలా అద్భుతమైన కథ.  పొలిటికల్ టచ్‌తో పాటు మంచి సాంగ్స్, కామెడీ, యాక్షన్ అన్నీ మంచి ప్యాకేజ్‌ మూవీ. ఫ్యామిలీస్ అంతా థియేటర్‌కి వచ్చి ఎంజాయ్ చేస్తారు.

నితిన్‌తో పనిచేయడం ఎలా అనిపించింది?

కృతిశెట్టి: నితిన్‌ నేనూ మంచి స్నేహితులమయ్యాం. ఆయన చాలా నిజాయితీ గల వ్యక్తి. ఆయనలో అందమైన అమాయకత్వం కూడా ఉంది. అలాగే దర్శకుడు రాజశేఖర్ చాలా కూల్‌ పర్సన్‌. ఎప్పుడూ కోపం రాదు. చిరాకు పడరు. ఆయనకి గొప్ప విజయాలు దక్కాలని కోరుకుంటాను.

‘ఉప్పెన’ తర్వాత మళ్ళీ అలాంటి బలమైన పాత్ర చేయలేదనే ఆలోచన వస్తుంటుందా ?

కృతిశెట్టి: ఒక నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంటుంది.  ఉప్పెన తర్వాత బ్యాలెన్స్ చేసుకొని ప్రాజెక్ట్స్ సైన్ చేశాను. అయితే వరుసగా కమర్షియల్ సినిమాలు విడుదలవుతున్నాయి. ఇంద్రగంటి, సూర్య చిత్రాలలో భిన్నంగా కనిపిస్తా. కొత్త కథల విషయంలో కూడా కొంచెం సెలక్టివ్ గా ఉంటున్నా.

మహిళా ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేసే ఆలోచన ఉందా?

కృతిశెట్టి: ఇప్పటికి ఆ ఆలోచన లేదు. అది చాలా బాధ్యతతో  కూడుకున్న అంశం. దర్శక నిర్మాతలు బలమైన నమ్మకం కలిగించినప్పుడు దాని గురించి ఆలోచిస్తా. ఉప్పెన తర్వాత అలాంటి రోల్స్ వచ్చాయి. కానీ ఒకేరకంగా ఉంటాయని చేయలేదు. ప్రస్తుతం సూర్య గారితో ఒక సినిమా. అలాగే నాగచైతన్యతో మరో సినిమా. ఇంద్రగంటి గారి సినిమా. ఇంకొన్ని కథలు చర్చల్లో ఉన్నాయి.

సినిమాలు కాకుండా వేరే లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా ?

కృతిశెట్టి: నాకు చిన్నప్పటి నుండి ఎన్జీవో స్టార్ట్ చేయాలనీ ఉండేది. త్వరలోనే మొదలుపెడతానని అనుకుంటున్నాను.

ఫ్రెండ్ షిప్ డే ప్లాన్స్ ఏమిటి ? మీ జీవితంలో బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారా ?

కృతిశెట్టి: ముంబైలో ఉన్నప్పుడు ఫ్రెండ్ షిప్ బ్యాండ్స్ కట్టుకునేవాళ్ళం. నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటే మా అమ్మే. అమ్మ కంటే బెస్ట్ ఫ్రెండ్ ఎవరూ లేరు. చిన్నప్పటి స్నేహితులు కూడా ఉన్నారు.మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని