కేంద్రానిది నిరంకుశ విధానం

తెలంగాణపై కక్షసాధింపు వైఖరిని ఖండిస్తూ మంత్రి మండలిలో తీర్మానం

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై తీవ్ర వివక్ష చూపుతోందని రాష్ట్ర మంత్రివర్గం విమర్శించింది. ఇప్పటికే అనేక అన్యాయాలకు తోడు ఇటీవల ఆర్థిక ఆంక్షలు విధించడం, రుణ పరిమితిని కుదించడం వంటి చర్యలను ఖండించింది. ఈమేరకు ఏకగ్రీవ తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితుల్లో మార్పులు సహా ఇతర అంశాలన్నింటిపైనా చర్చించారు. సీఎం కేసీఆర్‌ కేంద్రం విధానాలను దుయ్యబట్టగా మంత్రులు సైతం ధ్వజమెత్తారు.ముందుగా నిర్దేశించిన విధంగా రుణపరిమితిని కేంద్రం కొనసాగించని పక్షంలో న్యాయపరంగా పోరాటం చేయాలనే అభిప్రాయం వ్యక్తమయింది. దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని సీఎం వివరించారు.

భూముల అమ్మకాలే శరణ్యం

రాష్ట్రంలో అదనపు ఆదాయ వనరుల సమీకరణకు భూముల అమ్మకమే శరణ్యమనే అభిప్రాయం వ్యక్తమయింది.  ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులు చేయగా... సమావేశంలోని అధికశాతం మంత్రులు ఇదే అభిప్రాయాన్ని తెలియజేసినట్లు తెలుస్తోంది. పన్నుల పెంపు, ఇతర ప్రత్యామ్నాయ వనరుల కంటే భూముల విక్రయమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమయింది.

విపక్షాల నుంచి విమర్శలు వస్తాయనే..

* వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 21న శాసనసభ ప్రత్యేక సమావేశాల గురించి చర్చించారు. నిబంధనలమేరకు వర్షాకాల సమావేశాలు సెప్టెంబరు నాలుగో వారంలోపు జరపాల్సి ఉందని, ఈ లోపే ప్రత్యేక సమావేశాన్ని ఒకరోజు ఏర్పాటు చేసి ముగిస్తే వివక్షాల నుంచి విమర్శలు వస్తాయనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది.

20న మునుగోడులో సీఎం సభ

ఈ నెల 20న మునుగోడు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. మంత్రిమండలి సమావేశం అనంతరం ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో మాట్లాడారు.మునుగోడులో తెరాస ఘన విజయం సాధిస్తుందని పేర్కొన్నట్లు తెలిసింది. దుబ్బాక, హుజూరాబాద్‌లను కూడా తెరాస గెలవాల్సి ఉందని, కొన్ని అంచనాలు తప్పాయని అన్నారు. కేంద్ర నిరంకుశత్వాన్ని ప్రశ్నించడంలో ముందున్న తెరాస విధానాలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయని తెలిపారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని