ఈడీ విచారణకు అంజన్‌ కుమార్‌ యాదవ్‌

ఈనాడు, దిల్లీ: సికింద్రాబాద్‌ మాజీ ఎంపీ అంజన్‌ కుమార్‌ యాదవ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు బుధవారం విచారించారు. యంగ్‌ ఇండియా ట్రస్టుకు విరాళాలిచ్చిన కేసులో విచారణకు హాజరు కావాలని గతంలో ఈడీ ఆయనకు నోటీసులు ఇచ్చింది. దీంతో ఆయన తన కుమారుడు అరవింద్‌ యాదవ్‌తో కలిసి ఉదయం 10.45 గంటలకు దిల్లీలోని ఈడీ కార్యాలయానికి వచ్చారు. అధికారులు ఆయనను సుమారు రెండు గంటలపాటు విచారించారు. ట్రస్టుకు ఎందుకు విరాళాలిచ్చారు.. అందుకు ఎవరు ప్రోత్సహించారని ప్రశ్నించారు. విచారణ అనంతరం అంజన్‌కుమార్‌ విలేకరులతో మాట్లాడారు. యంగ్‌ ఇండియా ట్రస్టు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సూచన మేరకు తాను స్వచ్ఛందంగా విరాళం ఇచ్చినట్లు ఈడీ అధికారులకు చెప్పానని ఆయన తెలిపారు. కక్ష సాధింపుతోనే కాంగ్రెస్‌ నేతలను ఈడీ విచారిస్తోందని ఆయన మండిపడ్డారు.


మరిన్ని