close

తాజా వార్తలు

‘అశోక చక్రం’ ఎమోజీని విడుదల చేసిన ట్విటర్‌

దిల్లీ: భారత 73వ స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో ట్విటర్‌లో భారత అశోక చక్రం ఎమోజీని అందుబాటులోకి తెచ్చినట్లు ఆ సంస్థ ప్రకటించింది. #indiaindependencedayఅని పేర్కొంటూ అశోక చక్రం ఎమోజీని ట్విటర్‌ బుధవారం విడుదల చేసింది. ఈ ఎమోజీ ఆగస్టు 18 వరకు మూడు రోజుల పాటు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఇంగ్లిష్‌, హిందీ, తెలుగుతో పాటు ఇంకా ఏడు  ప్రాంతీయ భాషల ప్రజలు ఈ సింబల్‌ను ఉపయోగించుకునేలా అవకాశం కల్పించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు ట్విటర్‌లో స్వాతంత్ర్యదినోత్సవ హ్యాష్‌ట్యాగ్‌ పోస్ట్‌లలో ఈ ఎమోజీని ఉపయోగించుకోవచ్చు.

ఈ సందర్భంగా ట్విటర్‌ సంస్థ సీనియర్‌ మేనేజర్‌ కమ్రాన్‌ మాట్లాడుతూ.. ‘భారతీయులకు ముఖ్యమైన సందర్భాలకు అనుగుణంగా ఎమోజీలను అందుబాటులోకి తీసుకురావడం మాకు ఎంతో స్ఫూర్తినిస్తోంది. ఈ స్వాతంత్ర్య దినోత్సవ ఎమోజీ భారతీయులందరి మనసుల్లో దేశభక్తి ప్రతి ధ్వనింప చేస్తుందని అనుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. 

భారత జాతీయ పతాకంలోని అశోక చక్రంలో మొత్తం 24 ఆకులు ఉంటాయి. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కో భావాన్ని సూచిస్తాయి. గతంలోనూ ట్విటర్‌ సంస్థ భారత స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలకు ఎర్రకోట, భారత జాతీయ పతాకం తదితర సింబల్స్‌తో భారతీయుల్ని ఆకట్టుకుంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు