close

గ్రేటర్‌ హైదరాబాద్‌

సేవల ద్వారా దాతృత్వం చాటుకోవాలి 

ప్రైవేటు సంస్థలకు కేటీఆర్‌ పిలుపు 
సిరిసిల్లలో ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రికి భూమి పూజ

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల: రాష్ట్రంలో ప్రైవేటు సంస్థలు పేదలకు సేవ చేయడం ద్వారా తమ దాతృత్వాన్ని చాటుకోవాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రి, హెటిరో సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న కంటి ఆసుపత్రి భవన నిర్మాణానికి మంగళవారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ... ప్రజలకు సేవచేయడంలో కార్పొరేట్‌ సంస్థలు తమ ఉన్నతిని చాటుకోవాలన్నారు. ఆసుపత్రి భవన నిర్మాణానికి ప్రభుత్వం 0.32 ఎకరాలు కేటాయించగా హెటిరో సంస్థ సీఎస్‌ఆర్‌లో భాగంగా రూ.5 కోట్ల వ్యయంతో భవనాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఏడాది కాలంలో అన్ని వసతులతో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. జిల్లాలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబోయే కంటి ఆసుపత్రి రాష్ట్రంలో ఏడవదిగా పేర్కొన్నారు. వీరి స్ఫూర్తితో ఇతర కార్పొరేట్‌ సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను ప్రోత్సహించేలా మీడియా విస్తృత ప్రచారం కల్పించాలని ఆయన కోరారు. ‘సర్వేంద్రియానాం.. నయనం ప్రధానం’ అన్నట్లుగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో పేదలందరికీ కంటివెలుగు కార్యక్రమం ద్వారా పరీక్షలు చేయించారని గుర్తుచేశారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రజల ఆరోగ్య సమాచారాన్ని సేకరించే పనిలో రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ నిమగ్నమైందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రి ఉపాధ్యక్షులు అత్మకూరి రామం, డైరెక్టర్‌ రోహిత్‌కన్నా, హెటిరో సంస్థ ప్రతినిధులు రత్నాకర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు