close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ప్రేమ పరీక్ష!

ప్రేమంటే అనిర్వచనీయమైన అనుభూతి.  ఆ ఆనందం కలకాలం  పదిలంగా ఉండాలంటే  ఐ లవ్‌ యూ అని చెప్పగానే ఎస్‌ అనేయకుండా  ప్రేమ కోరే వ్యక్తిని కాస్తయినా పరీక్షించాల్సిందే. 

ప్రేమ పరీక్ష!

ఇద్దరి మధ్యా చిగురించిన ప్రేమ కలకాలం నిలవాలంటే వారి మధ్య ప్రేమాభిమానాలతోపాటు పరస్పర నమ్మకం ఉండాలి. కాబట్టి అతడి ప్రవర్తనను గమనించాలి. మీతోపాటు మీచుట్టూ ఉన్నవారితో ఎలా ప్రవర్తిస్తున్నాడో కూడా చూడాలి. అప్పుడప్పుడు అనుకోకుండా పొరపాట్లు జరుగుతుంటాయి. వాటిని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడా లేదా ధైర్యంగా ఆ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాడా అనేది కూడా అంచనా వేయాలి. 
మీతోపాటు మీ కుటుంబ సభ్యుల పట్ల అతడి వైఖరి ఎలా ఉంటుందనేది జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ అతడు మీతో మాత్రమే మంచిగా ఉంటూ మిగతావారితో బాధ్యతారహితంగా, మర్యాద లేకుండా ప్రవర్తిస్తోంటే ఎస్‌ చెప్పేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడమే మంచిది. 
అతడి పద్ధతులు, అలవాట్లు మెల్లిగా తెలుసుకోండి. అయితే మీకు అన్నీ నచ్చాలనే నియమమేమీ లేదు. మీకు ఇబ్బంది కానంత వరకూ కొన్నింటిని చూసీ చూడనట్లు వదిలేయడమే మంచిది. 
తన ఆశలు, ఆశయాలు, లక్ష్యాలను తెలుసుకోండి. ఉన్నతమైన లక్ష్యాలు, ఆలోచనలు, ఆశయాలు మనుషులను ఉన్నతంగా నిలబెడతాయి. ఎలాంటి లక్ష్యాలు లేకుండా దారం తెగిన గాలిపటంలా ఉండే వ్యక్తిత్వమైతే మీరు ఆలోచించాల్సిందే. 
అతడి మాటతీరు, నడకా, ప్రవర్తనా, మీ పట్ల చూపుతున్న శ్రద్ధ అన్నీ నిజమా కాదా అన్నది తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది. తన ప్రేమను మీతో చెప్పినప్పుడు వాటన్నింటిని పరిగణించాలి. 
స్నేహితులు, బంధువులు కష్టాల్లో ఉన్నప్పుడు అతడు ఎలా స్పందిస్తున్నాడో గమనించాలి. దాంతో తనది సాయం చేసే మనస్తత్వమా లేదా విమర్శించే వైఖరా అనేది తెలుస్తుంది. 
అతడు చెబుతున్నదానికి కట్టుబడి ఉంటున్నాడా లేదా అనేది చాలా ముఖ్యం. కాబట్టి  ఈ విషయంలో తను ఎలా ఉంటున్నాడనేది చూడాలి.


మరిన్ని