close

తాజా వార్తలు

‘చౌకీదార్‌’ మద్దతుదారులతో మోదీ మాట్లాడతారు..

500 ప్రాంతాల వారితో వీడియో కాన్ఫరెన్స్‌: రవిశంకర్‌ ప్రసాద్‌

న్యూదిల్లీ: దేశానికి తాను ఓ ప్రధానమంత్రిలా కాకుండా ఓ చౌకీదార్‌ (కాపలాదారుడు)లా పనిచేస్తానని గత లోక్‌సభ ఎన్నికల ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యను కాంగ్రెస్‌ పార్టీ పదేపదే గుర్తు చేస్తూ ‘కాపలాదారుడే దొంగ’ అంటూ ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘మై భీ చౌకీదార్‌’ (నేనూ కాపలాదారుడినే) అంటూ సామాజిక మాధ్యమాల్లో భాజపా ఉద్యమాన్ని ప్రారంభించింది. అంతేగాక భాజపా నేతలు తమ పేర్ల ముందు చౌకీదార్‌ అని అనే పదాన్ని పెట్టుకున్నారు. కాపలాదారుడు పేరుతో కాంగ్రెస్‌ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతపర్చాలని భావిస్తోంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల దాదాపు కోటి మంది భాజపా కార్యకర్తలు, మద్దతుదారులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన విషయం తెలిసిందే. త్వరలోనే ఆయన.. ఇటువంటి మరో అతిపెద్ద వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి, ‘మై భీ చౌకీదార్‌’ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్న వారితో మాట్లాడనున్నారు. 

ఈ విషయాన్ని మంగళవారం కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్ వెల్లడించారు. ‘‘మోదీ నిర్వహిస్తున్న ‘మై భీ చౌకీదార్‌’ ప్రచారంలో భాగంగా మార్చి 31న వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన తన మద్దతుదారులతో మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతామని ప్రతిజ్ఞ చేసిన దేశంలోని 500 ప్రాంతాల వారితో మోదీ ఒకేసారి మాట్లాడనున్నారు. ఇది ఓ ప్రజా ఉద్యమం. ‘మై భీ చౌకీదార్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను లక్షల మంది ట్వీట్‌ చేస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు. ‘మోదీ.. ధనవంతులకే కాపలాదారుడు.. రైతులకు, పేదవారికి కాదు’ అంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఆ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీ చేస్తున్న వ్యాఖ్యల పట్ల రవిశంకర్‌ ప్రసాద్‌ స్పందించారు. ‘సంపద, అధికారం ఉన్న కుటుంబంలో పుట్టిన వారు.. పలు కేసుల్లో బెయిల్‌పై బయట ఉన్నవారే భాజపా ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు