ఒకే క్లెయిమ్‌కు రెండు బీమా పాల‌సీల‌ను వాడుకోవ‌చ్చా? - Can-we-utilize-two-policies-for-one-claim
close

Updated : 23/07/2021 17:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒకే క్లెయిమ్‌కు రెండు బీమా పాల‌సీల‌ను వాడుకోవ‌చ్చా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: మీ వద్ద కంపెనీ బృంద బీమాతో పాటు ఫ్యామిలీ ఫ్లోటర్ / వ్యక్తిగత పాలసీలు ఉన్నాయనుకుందాం. చాలా వరకు వ్యక్తిగత/ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలలో ఒక ఏడాదిలో ఎటువంటి క్లెయిమ్ లేకపొతే, పునరుద్ధరణ సమయంలో నో క్లెయిమ్ బోనస్ అందిస్తాయి. ఈ సదుపాయం కొనసాగించడానికి ముందుగా బృంద బీమాని క్లెయిమ్ చేసుకోవడం మంచిది. 

రమేశ్‌కి రెండు ఆరోగ్య బీమా ప‌థ‌కాలు ఉన్నాయ‌నుకోండి. మొద‌టి పాల‌సీ బీమా హామీ మొత్తం రూ.3 ల‌క్ష‌లు, రెండో పాల‌సీ రూ.3 ల‌క్ష‌లు. అయితే ఏదైనా చికిత్స‌కు సంబంధించి ఆస్ప‌త్రిలో చేరిన‌ప్పుడు బిల్లు రూ.3 ల‌క్ష‌లు వ‌చ్చింద‌నుకోండి. అప్పుడు క్లెయిమ్ చేసుకునేందుకు అతని వద్ద రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి, ఏదో ఒక పాలసీలోని రూ.3 లక్షల హామీని పూర్తిగా ఉపయోగించుకోవచ్చు. లేదంటే, రెండు పాలసీలలోనూ కావలసినంత బీమా హామీని వాడుకోవచ్చు. ప్రతి పాలసీకి కొన్ని ప్రత్యేకమైన ఫీచర్స్ ఉంటాయి. కాబట్టి చెరి సగం వాడుకోవడం వల్ల రాబోయే  క్లెయిమ్స్‌లో రెండు పాలసీలు (కొంత మొత్తం బీమా హామీ) అందుబాటులో ఉంటాయి. ఆరోగ్య బీమా క్లెయిమ్ సమయంలో  ఏ పాల‌సీని ఎంచుకోవాలనేదానికి ఎలాంటి నియ‌మాలు ఉండ‌వు. అవ‌స‌రాన్ని బ‌ట్టి మీవద్ద ఉన్న  ఒకటి లేదా అన్ని పాలసీలను వినియోగించుకునే అవ‌కాశం ఉంటుంది.  

రెండు పాల‌సీల‌ను ఒకేసారి ఎలా ఉప‌యోగించాలి?

మీవద్ద రెండు వేర్వేరు బీమా సంస్థల పాలసీలు ఉన్నాయనుకుందాం. మీరు ఆసుపత్రిలో చేరినప్పుడు, రెండు బీమా సంస్థలనుంచి క్లెయిమ్ పొందాలనుకుంటే , ఈ రెండింటి ఆమోదం తప్పనిసరి. మీ వద్ద ఉన్న ఏదైనా ఒక  బీమా  కంపెనీకి మీ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. డిశ్చార్జ్ స‌మ‌యంలో మొదటి  బీమా సంస్థ ఆసుప‌త్రికి బిల్లు చెల్లించినట్లుగా సెటిల్‌మెంట్ లెట‌ర్‌ను జారీ చేస్తుంది. మీరు రెండో బీమా సంస్థ‌ను సంప్ర‌దించాలంటే ఈ లెట‌ర్ అవ‌స‌రం. ఇందులో చికిత్స‌కు సంబంధించిన వివ‌రాలు, బిల్లు చెల్లింపులు, పాల‌సీ వివ‌రాలు, ఆస్ప‌త్రిలో చేరిన తేదీతో స‌హా అన్నీ ఉంటాయి. అవ‌స‌ర‌మైతే మరిన్ని డాక్యుమెంట్ల‌ను కూడా అడిగే అవ‌కాశం ఉంటుంది. మిగిలిన క్లెయిమ్  సొమ్ము కోసం, సెటిల్‌మెంట్ లెట‌ర్‌తో పాటు బిల్లుల ఫొటోకాపీలను రెండో బీమా సంస్థకు సమర్పించవలసి ఉంటుంది.  అయితే ఒకే బీమా సంస్థ‌లో రెండు పాల‌సీలు క‌లిగి ఉంటే ఇది మ‌రింత సుల‌భ‌మ‌వుతుంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని