close

Published : 20/01/2021 01:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కొనుగోళ్ల సునామీ

ఒకే రోజు 834 పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్‌
4 నెలల్లోనే ఒకరోజు అతిపెద్ద లాభం
అమెరికా ఉద్దీపనపై ఆశలే కారణం
దుమ్మురేపిన హెచ్‌డీఎఫ్‌సీ జంట, ఆర్‌ఐఎల్‌ షేర్లు
రూ.3.41 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద

రెండురోజుల పాటు మదుపర్లను ఒక ఆటాడుకున్న బేర్‌.. బుల్‌ రంకెతో మంగళవారం పక్కకు పారిపోయింది. మదుపర్లు కొనుగోళ్ల సునామీ సృష్టించడంతో మార్కెట్‌ ఉరకలేసింది. అమెరికా ఉద్దీపనపై ఆశలు పెరగడం.. విదేశీ పెట్టుబడులు స్థిరంగా కొనసాగడం..రూపాయి బలపడటం.. కారణం ఏదైతేనేం..  సెన్సెక్స్‌ 834 పాయింట్లు దూసుకెళ్లింది. నిఫ్టీ కూడా డబుల్‌ సెంచరీ చేసి సత్తా చాటింది.  బీఎస్‌ఈలో మదుపర్ల సంపదగా పరిగణించే నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ రూ.3.41 లక్షల కోట్లు పెరిగి రూ.196.19 లక్షల కోట్లకు చేరింది.
అమెరికా సహా అభివృద్ధి చెందిన దేశాల్లో తాజా ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించొచ్చన్న అంచనాలు, మదుపర్లను మళ్లీ కొనుగోళ్లకు ప్రేరేపించాయి. దీంతో సెన్సెక్స్‌ నాలుగు నెలల్లోనే (2020 సెప్టెంబరు 25న 835 పాయింట్లు పెరిగింది) అతిపెద్ద లాభాన్ని మూటగట్టుకుంది. హెచ్‌డీఎఫ్‌సీ జంట, ఆర్‌ఐఎల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు సూచీల లాభాల్లో సగానికి పైగా కారణమయ్యాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 11 పైసలు పెరిగి 73.17 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లలో హాంకాంగ్‌, సియోల్‌, టోక్యో రాణించగా, షాంఘై నష్టపోయింది. ఐరోపా మార్కెట్లు లాభాల్లో ట్రేడయ్యాయి.
మార్కెట్‌ పరుగు సాగిందిలా:  300 పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభమైన సూచీ..  అదే జోరు కొనసాగించి, 49,499.86 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 49,398 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 239.85 పాయింట్లు దూసుకెళ్లి 14,251.15 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ సూచీ 14,350.85- 14,546.05 పాయింట్ల మధ్య కదలాడింది.


ఏవి ఎంత..

* సెన్సెక్స్‌ షేర్లలో 27 లాభాల్లో నడిచాయి. బీఎస్‌ఈలో 2124 షేర్లు లాభపడగా, 874 స్క్రిప్‌లు నష్టపోయాయి. 148 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
* బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 6.77%, బజాజ్‌ ఫైనాన్స్‌ 5.25%, హెచ్‌డీఎఫ్‌సీ 3.25%, ఎల్‌ అండ్‌ టీ 2.64%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 2.64%, సన్‌ఫార్మా 2.55%, ఎన్‌టీపీసీ 2.21%, ఏషియన్‌ పెయింట్స్‌ 2.18%, బజాజ్‌ ఆటో 2.13% మేర పెరిగాయి.
* టెక్‌ మహీంద్రా, ఐటీసీ, ఎం అండ్‌ ఎం 0.54% వరకు నష్టపోయాయి.
* అన్ని రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి. స్థిరాస్తి, లోహ, విద్యుత్‌, యంత్ర పరికరాలు, పరిశ్రమలు, ఫైనాన్స్‌ 4.04% మేర పరుగులు తీశాయి.
* మధ్య స్థాయి షేర్ల సూచీ, చిన్న స్థాయి షేర్ల సూచీ 2.31% వరకు పెరగడం విశేషం.
* కార్ల ధరలను రూ.34000 వరకు పెంచనున్నట్లు ప్రకటించడంతో మారుతీ సుజుకీ షేరు 1.10 శాతం లాభంతో రూ.7900 వద్ద ముగిసింది.
* ఆకర్షణీయ త్రైమాసిక ఫలితాలు ప్రకటించడంతో మైండ్‌ ట్రీ షేరు ఇంట్రాడేలో 5.96% రాణించి రూ.1759.70 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 1.19% లాభంతో రూ.1680.30 దగ్గర స్థిరపడింది.
* త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర షేరు 15.89% పెరిగి రూ.7.73 వద్ద ముగిసింది.


 

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని