ఇళ్ల అమ్మకాల్లో హైదరాబాద్‌ అదరహో
close

Published : 26/03/2021 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇళ్ల అమ్మకాల్లో హైదరాబాద్‌ అదరహో

జనవరి-మార్చిలో 64 శాతం వృద్ధి
దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఇక్కడే అధికం: అనరాక్‌

దిల్లీ: దేశంలోని 7 ప్రధాన నగరాలలో ఇళ్లు, ఫ్లాట్ల అమ్మకాలు ఏడాది క్రితంతో పోలిస్తే, ఈ ఏడాది జనవరి-మార్చిలో 29 శాతం పెరగొచ్చని స్థిరాస్తి కన్సల్టెంట్‌ అనరాక్‌ నివేదిక పేర్కొంది. గృహరుణ రేట్లు తక్కువగా ఉండటం, మహారాష్ట్ర ప్రభుత్వం స్టాంప్‌డ్యూటీలో కోత విధించడం, నిర్మాణదారులు ఇస్తున్న రాయితీలు ఇందుకు ఉపకరించాయని తెలిపింది. 2020 తొలి త్రైమాసికంలో 7 ప్రధాన నగరాలలో 45,200 ఇళ్లు, ఫ్లాట్లు అమ్ముడుపోగా, ఈ ఏడాది ఇదే సమయంలో అమ్మకాలు 58,290కి చేరొచ్చని అంచనా వేసింది. మొత్తం అమ్మకాల్లో ముంబయి, పుణె వాటాయే 53 శాతం ఉంటుందని అనరాక్‌ ఛైర్మన్‌ అనుజ్‌ పురి పేర్కొన్నారు.

సంస్థ వెల్లడించిన వివరాలివీ..
విక్రయాల్లో వృద్ధి హైదరాబాద్‌లో అధికంగా ఉంది. 2020 జనవరి-మార్చిలో 2680 యూనిట్లు అమ్ముడుపోగా, ప్రస్తుత త్రైమాసికంలో ఈ సంఖ్య 64 శాతం వృద్ధితో 4,400కు చేరనుంది.
దేశంలోనే ఖరీదైన స్థిరాస్తి విపణిగా పేర్కొనే ముంబయిలో స్టాంప్‌డ్యూటీని పరిమితకాలం పాటు తగ్గించడం కలిసొచ్చింది. ఏడాది క్రితం ఇక్కడ 13910 యూనిట్లు అమ్ముడుపోగా, ప్రస్తుత త్రైమాసికంలో 46 శాతం అధికమై 20,350కి చేరనున్నాయి.
పుణెలో 7200 నుంచి 47 శాతం వృద్ధితో 10550కి, చెన్నైలో 2190 నుంచి 30 శాతం వృద్ధితో 2850కి, కోల్‌కతాలో 2440 నుంచి 10 శాతం వృద్ధితో 2680కు, దిల్లీలో 8150 నుంచి 8 శాతం వృద్ధితో 8790 యూనిట్లకు చేరనున్నాయి.  
బెంగళూరులో మాత్రం 8630 నుంచి అతిస్వల్పంగా పెరిగి 8670 యూనిట్లకు చేరొచ్చని నివేదిక తెలిపింది.
అమ్ముడవ్వాల్సినవి 6.42 లక్షలు
ఈ 7 నగరాలలో ఇంకా అమ్ముడవ్వాల్సిన యూనిట్లు 6.42 లక్షలున్నాయని పేర్కొంది. ఏడాది క్రితం ఈ సంఖ్య 6.44 లక్షలు కాగా, ఈసారి స్వల్పంగా తగ్గింది. ఇదే సమయంలో 6 నగరాలలో ధరలు సగటున 1-2 శాతం పెరిగాయి. కోల్‌కతాలో మాత్రం స్థిరంగా ఉన్నాయని నివేదిక వివరించింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని