TCS: రూ.850 పెట్టుబడికి రూ.28,000
close

Updated : 11/06/2021 12:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TCS: రూ.850 పెట్టుబడికి రూ.28,000

17 ఏళ్లలో 3000% ప్రతిఫలం: టీసీఎస్‌

దిల్లీ: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో (టీసీఎస్‌) పెట్టుబడి పెట్టిన మదుపర్లు/వాటాదార్లకు 17 ఏళ్లలో 3000 శాతం ప్రతిఫలం అందించామని టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ వెల్లడించారు. 2004లో టీసీఎస్‌ ఒక్కో షేరును రూ.850 చొప్పున ఆఫర్‌ చేయగా, ఇప్పుడు దాని విలువ సుమారు రూ.28,000 వరకు ఉందని (డివిడెండ్‌+బోనస్‌లు కలిపి) పేర్కొన్నారు. ‘2004లో ఐపీఓకు వచ్చిన టీసీఎస్‌ గత 17 ఏళ్లుగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా దూసుకెళుతోంది. కంపెనీని నడిపించడంలో  27 ఏళ్లపాటు ఎఫ్‌సీ కోహ్లి ఎంతగానో శ్రమించారు. పరిశోధన, వినూత్నతతో బహుళ సాంకేతికతల్ని జోడించడం ద్వారా టీసీఎస్‌ను గొప్ప స్థాయికి తీసుకొచ్చార’ని దృశ్య మాధ్యమ పద్ధతిలో నిర్వహించిన టీసీఎస్‌ 17వ వార్షిక సాధారణ సమావేశంలో చంద్రశేఖరన్‌ వెల్లడించారు. కొవిడ్‌ ఉపశమన చర్యలకు టాటా గ్రూప్‌ 2020 మార్చి నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.2,500 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఒకరితో ఒకరు కలిసి మాట్లాడుకోవడం సామాజిక అవసరమని, కొవిడ్‌ మహమ్మారి తరవాత ఉద్యోగులను కార్యాలయాలకు రమ్మని పిలుస్తామని చంద్రశేఖరన్‌ తెలిపారు. ప్రస్తుతం 97 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తున్నారని ఆయన చెప్పారు.  టీసీఎస్‌లో గత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 40,185 మందిని చేర్చుకోవడం ద్వారా మొత్తం ఉద్యోగుల సంఖ్య  4.88 లక్షలకు చేరిందని టీసీఎస్‌ సీఈఓ రాజేశ్‌ గోపీనాథన్‌ పేర్కొన్నారు. కొవిడ్‌-19 ఉపశమన చర్యలకు టాటా ట్రస్ట్స్‌తో కలిసి సుమారు  రూ.273 కోట్లు సహాయం చేసినట్లు టీసీఎస్‌ పేర్కొంది. మాలిక్యూల్‌ డిస్కవరీ, కొవిడ్‌ డేటా మేనేజ్‌మెంట్‌, డయాగ్నొస్టిక్‌ కిట్లు, ఎపిడెమియోలాజికల్‌ అధ్యయనం, నిర్వహణ వంటి 72 కొవిడ్‌ సంబంధిత అంశాలపై కంపెనీ పరిశోధన, అభివృద్ధి విభాగం పని చేస్తోందని తెలిపింది.


1ఎంజీలో టాటా డిజిటల్‌కు మెజార్టీ వాటా

దిల్లీ: ఆన్‌లైన్‌లో ఆర్డర్లు తీసుకుని ఔషధాలు సరఫరా చేసే, రోగ నిర్థారణ, టెలి కన్సల్టేషన్‌ సేవలను అందించే ఆరోగ్య సంరక్షణ సంస్థ 1ఎంజీ టెక్నాలజీస్‌లో మెజార్టీ వాటా కొనుగోలు చేసినట్లు టాటా సన్స్‌కు పూర్తి అనుబంధ సంస్థ అయిన టాటా డిజిటల్‌ గురువారం వెల్లడించింది. ఇందుకోసం ఎంత మొత్తం వెచ్చించిందీ బహిర్గతం చేయలేదు. ఇటీవలే క్యూర్‌ఫిట్‌ హెల్త్‌కేర్‌లో 75 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.550 కోట్లు) పెట్టుబడులు పెట్టి వాటాలు కొనుగోలు చేసిన టాటా డిజిటల్‌, తాజాగా 1ఎంజీలో మెజార్టీ వాటా తీసుకోవడం విశేషం. వినియోగదార్ల అవసరాలన్నీ తీరే డిజిటల్‌ వ్యవస్థను సృష్టించడంపై దృష్టి పెట్టిన టాటా గ్రూప్‌, భిన్న రంగాలకు చెందిన సంస్థలను స్వాధీనం చేసుకుంటోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇ-ఫార్మసీ, ఇ-డయాగ్నొస్టిక్స్‌, టెలీ-కన్సల్టేషన్‌ వంటి రంగాలు వేగంగా వృద్ధి చెందుతున్నాయని టాటా డిజిటల్‌ వివరించారు. ఈ విపణి సుమారు 100 కోట్ల డాలర్ల (రూ.7,500 కోట్లు) వరకు ఉందని, ఏడాదికి 50 శాతం చొప్పున సంచిత వార్షిక వృద్ధి రేటుతో ముందుకెళ్లే అవకాశం ఉందని టాటా డిజిటల్‌ సీఈఓ ప్రతీక్‌ పాల్‌ వెల్లడించారు. టాటా పెట్టుబడులు మా ప్రయాణానికి మరింత బలాన్ని చేకూరుస్తాయని, అత్యంత నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు, సేవలు దేశ వ్యాప్తంగా వినియోగదార్లకు అందించగలుగుతామని 1ఎంజీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ ప్రశాంత్‌ టాండన్‌ వివరించారు. 2015లో ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్తుతం 20000 పిన్‌కోడ్ల ప్రాంతాల్లో సేవలందిస్తోంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని