close

ప్రధానాంశాలు

రైతులకు డిజిటల్‌ వేదిక..

ఆరుగాలం శ్రమించే రైతులకు.. తమ ఉత్పత్తులకు లభిస్తున్న ధర ఎంత? దాన్ని ఎక్కడ అమ్మితే ఎక్కువ రాబడి రావచ్చు అని తెలుసుకునే విషయంలో ఎప్పుడూ చిక్కులే.. పంట సస్యరక్షణ విషయంలోనూ తెలుగులో సమాచారం దొరికేది తక్కువే. వీటన్నింటికీ ఒకే చోట సమాధానం దొరికితే.. ఈ ఆలోచనతో పుట్టిన అంకురమే.. ‘నా పంట’. వ్యవసాయానికి నా వంతుగా ఏం చేయొచ్చనే ప్రయత్నమే ఈ సంస్థ అని అంటున్నారు వ్యవస్థాపకుడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వి.నవీన్‌ కుమార్‌. రైతులకు డిజిటల్‌ వేదిక ఏర్పాటు చేస్తున్నామని చెబుతూ ఆయన ‘నా పంట’ గురించి ఇలా వివరిస్తున్నారు.

మాది వరంగల్‌.. చిన్నప్పటి నుంచి వ్యవసాయాన్ని చూస్తూనే పెరిగాను. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌ వచ్చాను. ఎంబీఏ పూర్తి చేశాను. ఆ తర్వాత రెండు ప్రముఖ ప్రైవేటు బ్యాంకుల్లో పనిచేశాను. ఒకసారి ఇంటికి వెళ్లినప్పుడు మాకు తెలిసిన ఒక రైతు ఆత్మహత్య చేసుకోవడం చూశాను. నిత్యం ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారనే వార్తలు వింటుంటాం.. చదువుతుంటాం.. ఇదో పెద్ద సామాజిక సమస్య. దీనికి కారణాలేమిటి? నా వంతుగా ఏదైనా పరిష్కారం చూపగలనా? ఇదే నాకు వచ్చిన తొలి ఆలోచన. దానికి సమాధానం వెతుకుతూ... నాలుగైదు నెలలపాటు ఎంతోమంది రైతులను కలిశాను. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, ఈ రంగంలోని నిపుణులను సంప్రదించాను. కల్తీ విత్తనాల సమస్య, గిట్టుబాటు ధర అందకపోవడంతో పాటు, ఖర్చులు, ఆదాయాలకు సంబంధించిన లెక్కలు సరిగా చూసుకోకపోవడం, ఏ సమయంలో ఏ పంట వేస్తే లాభం, చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు ఇలా ఎన్నో విషయాల్లో రైతులకు సరైన సహాయం అందడం లేదని గుర్తించాను. ప్రభుత్వం రైతుల కోసం అందిస్తున్న ఎన్నో పథకాలపై వారికి అవగాహన ఉండటం లేదు. సమాచారం అందడంలోనూ ఆలస్యం అవుతోంది. చిన్న రైతుల మాట అటుంచి, 10-15 ఎకరాల్లో పంటలు పండిస్తున్న వారి పరిస్థితీ అంతంతే.. ఇవన్నీ సంస్థను ప్రారంభించే ముందు  నేను తెలుసుకున్న అంశాలు. వీటన్నింటికీ పరిష్కారం చూపాలనే లక్ష్యంతోనే ‘నా పంట’ను ప్రారంభించాను.


ఏం చేస్తున్నామంటే...

సంస్థను 2017 జూన్‌ 2న ప్రారంభించాను. వ్యవసాయానికి సంబంధించిన ఒక విషయం తెలుసుకోవాలంటే.. ఆంగ్లంలో కావాల్సినంత సమాచారం ఉంది. కానీ, స్థానిక భాషల్లో ఇది కష్టమే. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తిగా తెలుగులో ఈ యాప్‌ను తీసుకొచ్చాం. రైతులకు తెలిసిన విషయాలను మరింత నిశితంగా తెలుసుకోవడం, పదిమందితో వారి ఆలోచనలు పంచుకోవడం ఇదే మేము ప్రాథమికంగా చేసిన పని. పొలాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి, విత్తనాల రకాలు, ఏ సమయంలో నాటుకోవాలి, ఎరువులు ఏ మోతాదులో వాడాలి, కలుపు తీయడం, పురుగులను నిర్మూలించేందుకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలేమిటి? లాంటి సందేహాలన్నీ మా వేదికపై ఉంటాయి. ఒక రసాయనిక పురుగు మందు ఎన్ని రకాలుగా పనిచేస్తుంది, వాటిని ఏయే పంటలకు వాడొచ్చు, రైతులు పొరపాటున విష ప్రభావానికి గురైనప్పుడు, విరుగుడుకు ఏం చేయాలో ఆ సూచనలన్నీ మా యాప్‌లో ఉంటాయి. 120 రకాల పంటలకు సంబంధించి రసాయనిక, ప్రకృతి, సేంద్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేసే వారికి ఏం కావాలన్నా ఇందులో లభిస్తుంది.


ఖర్చు లెక్కలూ తెలుసుకోవచ్చు..

రైతులకు పెట్టుబడులు పెట్టడమే తెలుసు.. కానీ, వాటికి లెక్కలు రాయరు. దీంతో వారికి ఎంత లాభం వచ్చింది, నష్టం వచ్చిందనే విషయాలూ అర్థం కావు. దీన్ని దృష్టిలో పెట్టుకొని, వారికి ఒక ఫైనాన్షియల్‌ టూల్‌నూ ఇందులో తీసుకొచ్చాం. రైతు తాను ప్రతి రోజూ చేసిన ఖర్చు, వచ్చిన ఆదాయాలు ఇందులో నమోదు చేస్తే చాలు.. అతని మొత్తం లెక్కలన్నీ ఒకేచోట కనిపిస్తాయి. దీంతోపాటు, తక్కువ ఖర్చు చేసేందుకు అవసరమైన సూచనలూ ఇస్తుంటాం.
ప్రస్తుతం 1,82,000 మంది మా యాప్‌ను వినియోగిస్తున్నారు. ఇందులో రైతులతోపాటు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలూ ఉన్నారు. మొత్తం 3,500 మార్కెట్లలో ఉన్న ధరల వివరాలను ఎప్పటికప్పుడు అందిస్తున్నాం. గోదాముల వివరాలూ తెలియజేస్తాం. ఒక పంట ఒక ప్రాంతంలో ఎన్ని ఎకరాల్లో సాగవుతోంది లాంటి సమాచార విశ్లేషణ మా దగ్గర లభిస్తుంది. రైతులందరికీ మా యాప్‌ ఉచితంగానే సేవలనందిస్తోంది.


సొంతంగానే..

గత మూడేళ్లుగా నేను సంపాదించిందీ... కుటుంబ సభ్యుల నుంచి సమీకరించిన మొత్తం రూ.కోటి, దీంతోపాటు మిత్రుల ఆర్థిక సహాయం కలిపి రూ.కోటిన్నర వరకూ పెట్టుబడి పెట్టాను. సంస్థను ప్రారంభించినప్పుడు ముగ్గురితో ప్రారంభించాను. ప్రస్తుతం మొత్తం 8 మంది సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. మే నాటికి 35 మంది ఉద్యోగులను నియమించుకునే ప్రయత్నాల్లో ఉన్నాం. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో సేవలనందిస్తున్నాం. 2020 డిసెంబరు నాటికి మొత్తం 16 రాష్ట్రాల్లోకి విస్తరించాలని అనుకుంటున్నాం. డిసెంబరు నాటికి రూ.22 కోట్ల ఆదాయాన్ని ఆర్జించే లక్ష్యంతో ఉన్నాం. విస్తరణ కోసం దాదాపు రూ.30 కోట్ల పెట్టుబడిని సమీకరించే ప్రయత్నాల్లో ఉన్నాం. 2023 నాటికి కనీసం 3లక్షల మంది రైతులకు మా సేవలను విస్తరించాలన్నది ప్రయత్నం. రసాయనిక, ప్రకృతి, సేంద్రీయ వ్యవసాయ పద్ధతుల్లో ఎలా వ్యవసాయం చేయాలనేది మా ద్వారా తెలియజేస్తుంటాం. మైక్రోసాఫ్ట్‌తో పాటు, పలు రాష్ట్ర ప్రభుత్వాలు మా ప్రయత్నాన్ని గుర్తించి, ప్రోత్సహిస్తున్నాయి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.