close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
స్తబ్దుగా.. స్వల్పంగా

స్టాక్‌ మార్కెట్‌ ఈ వారం
పరిమిత శ్రేణిలోనే సూచీల కదలికలు

జూన్‌ ఫలితాల ముందు అప్రమత్తత
చైనా పరిణామాలు, కరోనా కేసులపై దృష్టి

10380- 10700 మధ్యే నిఫ్టీ!

దేశీయ సూచీలు ఈవారం స్వల్ప శ్రేణికి పరిమితమై చలించవచ్చు. కార్పొరేట్ల ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసిక ఫలితాలకు ముందు మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించే అవకాశం ఉంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) గురువారం ఫలితాలు ప్రకటించనుంది. కంపెనీల ఆర్థిక స్థితి, గిరాకీ లాంటి వాటిపై కొవిడ్‌-19 ప్రభావం ఏ మేరకు పడిందో ఈ ఫలితాల ద్వారా మదుపర్లు ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది. భారత్‌- చైనాల మధ్య పరిణామాలు, మే నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు కూడా ఈవారం సూచీలపై ప్రభావం చూపొచ్చు. నిఫ్టీ ఈవారం 10380- 10700 శ్రేణిలో కదలాడొచ్చని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ఈవారానికి సంబంధించి, వివిధ రంగాలపై విశ్లేషకుల అంచనాలు ఇలా..
* చమురు రంగ షేర్లు సానుకూల ధోరణితో స్వల్ప శ్రేణిలో కదలాడొచ్చు. అప్‌స్ట్రీమ్‌ కంపెనీల షేర్లతో పోలిస్తే రిఫైనరీ కంపెనీల షేర్లు మెరుగ్గా రాణించవచ్చు.  
* భారీ యంత్ర పరికరాల రంగానికి మద్దతునిచ్చే పరిణామాలేవీ లేకపోవడంతో ఈ రంగ షేర్లు స్తబ్దుగా చలించొచ్చు. సమీక్షా త్రైమాసికంలో ఆర్డర్లు బాగా తగ్గడం ఈ షేర్లపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చు.
* టెలికాంలో భారతీ ఎయిర్‌టెల్‌ షేర్ల జోరు ఈవారమూ కొనసాగే అవకాశం ఉంది. వన్‌వెబ్‌ సంస్థను బ్రిటన్‌ ప్రభుత్వంతో కలిసి చేజిక్కించుకోవడం లాంటి పరిణామాలు ఇందుకు దోహదం చేయొచ్చు.  
* సిమెంటు కంపెనీల షేర్లు ఈవారం పెరిగే అవకాశం ఉంది. వర్షాకాలం గిరాకీ తగ్గినప్పటికీ.. సిమెంటు ధరలు పెరగడంతో ఈ రంగ షేర్లు బలంగానే కనిపిస్తున్నాయని చెబుతున్నారు.
* ఎటువంటి కీలక పరిణామాలు లేనందున బ్యాంకింగ్‌ షేర్లు స్వల్ప శ్రేణికి పరిమితమై చలించవచ్చు. మార్కెట్‌ కనుగుణంగా స్పందించే అవకాశం ఉంది.
* వాహన రంగ షేర్లు స్వల్ప శ్రేణికే పరిమితం కావచ్చు. రానున్న రోజుల్లో వాహన కంపెనీలు డిస్కౌంట్లు ప్రకటించే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. ఇదే జరిగితే ఈ రంగ షేర్లపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
* ఎఫ్‌ఎమ్‌సీజీ రంగ షేర్లు సానుకూలంగా చలించే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో గిరాకీ పుంజుకోవచ్చన్న అంచనాలే ఇందుకు నేపథ్యం. మదుపర్లు ఈ షేర్లను రక్షణాత్మక ధోరణిలో చూస్తున్నారు కూడా.
* ఔషధ రంగ షేర్లు బలహీనంగా కదలాడొచ్చు. లాక్‌డౌన్‌ ఆంక్షలతో సరఫరా వరోధాలు ఎదుర్కొన్నందున, ఫలితాలు ఆశాజనకంగా ఉండకపోవచ్చని ఇప్పటికే పలు ఔషధ కంపెనీలు సంకేతాలు ఇవ్వడాన్ని మదుపర్లు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.
* టీసీఎస్‌ గణాంకాలు, యాజమాన్యం చేసే వ్యాఖ్యలు ఐటీ రంగ షేర్లకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.
* ప్రపంచ మార్కెట్ల నుంచి లోహ రంగ షేర్లు సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. ఉక్కు, అల్యూమినియం ధరల పెంపుపై ఆయా కంపెనీలు తీసుకున్న, తీసుకునే నిర్ణయాలు కూడా ప్రభావం చూపుతాయి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.