నా కల నెరవేరుతోంది: ప్రభాస్‌ - Prabhas About Biggest Surprise
close
Updated : 09/10/2020 12:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా కల నెరవేరుతోంది: ప్రభాస్‌

బిగ్‌ సర్‌ప్రైజ్‌ గురించి ఎవరేమన్నారంటే..

హైదరాబాద్‌: తన కల నెరవేరుతోందని బాహుబలి ప్రభాస్‌ అన్నారు. నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. కొంతకాలం క్రితం ప్రకటించిన ఈ సినిమాకి సంబంధించి ఓ బిగ్‌ సర్‌ప్రైజ్‌ను చిత్రబృందం శుక్రవారం సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. అగ్ర కథానాయకుడు అమితాబ్‌ బచ్చన్‌ ఈ సినిమాలో ఓ కీలకపాత్ర పోషిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ స్పెషల్‌ వీడియోని సైతం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో చిత్రబృందం నుంచి వచ్చిన బిగ్‌ సర్‌ప్రైజ్‌ గురించి ప్రభాస్‌, నాగ్‌ అశ్విన్‌తోపాటు బిగ్‌బి సైతం స్పందించారు.

‘అమితాబ్‌ బచ్చన్‌ సర్‌తో స్ర్కీన్‌ పంచుకోవాలనే నా కల ఎట్టకేలకు నెరవేరుతోంది’ అంటూ ప్రభాస్‌ హర్షం వ్యక్తం చేశారు. అలాగే దర్శకుడు నాగ్‌ అశ్విన్‌.. ‘నమస్కారం బిగ్‌బి.. ఇది అతిథి పాత్ర లేదా స్పెషల్‌ అప్పియరెన్స్‌ కాదు. ఎంతో కీలకమైన పూర్తిస్థాయి పాత్ర. ఆయన పాత్ర పేరే అప్పట్లో మా మొదటి వర్కింగ్‌ టైటిల్‌. మా సినిమాలో నటించేందుకు అంగీకరించినందుకు ధన్యవాదాలు అమితాబ్‌ సర్‌. మీ సమయానికి తగ్గ గొప్ప ప్రతిఫలాన్ని మేము మీకు అందిస్తాం’ అని అన్నారు. మరోవైపు అమితాబ్‌ సైతం ప్రభాస్‌ సినిమాలో నటించడం పై స్పందించారు. ‘ఇలాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లో నేను కూడా భాగం కావడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నా..!’ అని బిగ్‌ బి అన్నారు.

వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్‌కి జంటగా దీపికా పదుకొణె నటించనున్నారు. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రానికి మెంటార్‌గా వ్యవహరించనున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. మరోవైపు గతేడాది విడుదలైన ‘సైరా’ సినిమాలో అమితాబ్‌ గోశాయి వెంకన్న పాత్రలో మెప్పించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని