వైకాపా రౌడీయిజానికి ముకుతాడువేయాలి:పవన్‌
close
Published : 12/03/2020 17:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైకాపా రౌడీయిజానికి ముకుతాడువేయాలి:పవన్‌

‘స్థానిక’ మేనిఫెస్టో విడుదల చేసిన భాజపా, జనసేన

విజయవాడ: రాష్ట్రంలో వైకాపా రౌడీయిజానికి ముకుతాడు వేయాల్సిన సమయం వచ్చిందని.. ఎవరు ఎన్ని బెదిరింపులకు పాల్పడినా అభ్యర్థులు తట్టుకుని బలంగా నిలబడాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి భాజపా-జనసేన ఉమ్మడిగా రూపొందించిన ‘విజన్‌ డాక్యుమెంట్‌’ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి పవన్‌ కల్యాణ్‌ ఆవిష్కరించారు. అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు. తొలుత పవన్‌ మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో యువతకు అవకాశం కల్పించాలనే భాజపా-జనసేన కలిసి పోటీ చేస్తు్న్నాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో చాలా చోట్ల నామినేషన్లు వేయలేని పరిస్థితులు నెలకొన్నాయని పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అభ్యర్థులు నామినేషన్లు వేయలేని విధంగా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు అనగానే ప్రజలు భయానికి గురయ్యే పరిస్థితులు సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. దౌర్జన్యాలకు పాల్పడితే ఎన్నికలు నిర్వహించడం ఎందుకని పవన్‌ ప్రశ్నించారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్న ఘటనలకు సంబంధించిన పూర్తి వివరాలను డీజీపీ, ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పవన్‌ చెప్పారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కఠినంగా వ్యవహరించినట్లయితే ఇలాంటి ఘటనలు జరిగేవి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. భయపెట్టి సాధించిన గెలుపు ఎన్నటికీ నిలబడదని పవన్‌ వ్యాఖ్యానించారు.

ఎన్నికలు ఏకగ్రీవం చేసుకోవాలనే ఇలా..: కన్నా

రాష్ట్రంలో జరుగుతున్న దాడులకు సంబంధించి పోలీసులు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి ఉపయోగం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. రాష్ట్రంలో దౌర్జన్యకరమైన వాతావరణం నెలకొందని.. పలుచోట్ల అభ్యర్థుల నామినేషన్‌ ఫారాలు లాక్కుని వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఏకగ్రీవం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని కన్నా విమర్శించారు. సవాళ్లను దాటుకుని నామినేషన్లు వేసినా పరిశీలనలో కూడా తిరస్కరిస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంత అరాచకం, దుర్మార్గమైన పరిస్థితి ఎప్పుడూ చూడలేదన్నారు. పోలీసులు, యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలు, అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆక్షేపించారు. నెల్లూరు, కాళహస్తిలో కత్తిపోటు ఘటనలు చోటుచేసుకున్నాయని చెప్పారు.

ప్రమాదంలో ప్రజాస్వామ్యం: దేవధర్‌

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని భాజపా రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ సునీల్‌ దేవధర్‌ అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు కాదు.. ఎంపికలు జరుగుతున్నాయని విమర్శించారు. తెదేపా ఎన్నికలు జరపలేదని.. జన్మభూమి కమిటీల పేరుతో మోసం చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు వైకాపా అదే తరహాలో అరాచక పాలన సాగిస్తోందని ఆక్షేపించారు. రాష్ట్రంలో ఈ పరిస్థితులు పోవాలంటే భాజపా-జనసేన కూటమి బలపడాల్సిన అవసరం ఉందన్నారు. తెదేపా నాగరాజు అయితే వైకాపా సర్పరాజు అని.. ఈ రెండు పార్టీలు ప్రజలపై విషాన్ని చిమ్ముతున్నాయని దేవధర్‌ ఎద్దేవా చేశారు.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని