ఆర్ట్స్‌ విద్యార్థి.. సాఫ్ట్‌వేర్‌ గురువు
close
Published : 02/03/2020 00:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆర్ట్స్‌ విద్యార్థి.. సాఫ్ట్‌వేర్‌ గురువు

ఒకప్పుడు హలం పట్టి పొలం దున్నిన చేతులు.. వేలాది మంది నిరుద్యోగ యువతకు దిశానిర్దేశం చేస్తున్నాయి. వ్యవసాయం కోసం చేసిన ఆలోచనలు.. సాఫ్ట్‌వేర్‌ వీరులను తీర్చిదిద్దుతున్నాయి. వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. జీవితంలో అనుకోని మలుపు తలుపుతట్టి అతడి గమ్యానికి దిశానిర్దేశం చేసింది. సాఫ్ట్‌వేర్‌ ద్రోణాచార్యను చేసింది. ఆయన కథ ఆసక్తికరమే కాదు... స్ఫూర్తిదాయకమైంది కూడా.

హైదరాబాద్‌ అమీర్‌పేటలో సాఫ్ట్‌వేర్‌ కోర్సుల్లో శిక్షణ తీసుకోవాలనుకునే వారిలో ఆర్‌ఎన్‌రెడ్డి పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఆయన పూర్తి పేరు బండా రామనర్సిరెడ్ఢి అమీర్‌పేటలో ఆర్‌ఎన్‌రెడ్డి ఇనిస్టిట్యూట్‌ నిర్వహిస్తూ ఇప్పటివరకు 15వేల మందికి ఐటీ రంగంలో శిక్షణనిచ్చారు. డాట్‌నెట్‌, పైథాన్‌ శిక్షణలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన ఆయనను సాఫ్ట్‌వేర్‌ ద్రోణాచార్య అని అభ్యర్థులు పిలుస్తుంటారు. చదివింది బీఏ అయినప్పటికీ ఐటీ శిక్షణలో కీలక స్థాయికి చేరుకోవడం ఆయనకే సాధ్యమైంది.

హుజూర్‌నగర్‌లో ఇంటర్మీడియట్‌లో సీఈసీ చదివాక అక్కడే ప్రియదర్శిని కళాశాలో బీకాం చేయాలనుకున్నారు ఆర్‌ఎన్‌ రెడ్ఢి అప్పటికే వ్యవసాయం ఉండటంతో బీకాంలో చేరితే ఇంట్లో సాగు పనులకు ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో బీఏలో చేరారు. కళాశాలలో చేరారేగానీ ఎన్నడూ హాజరైంది లేదు. నిత్యం స్నేహితులు పుస్తకాలు పట్టుకుని.. సైకిల్‌ ఎక్కి కళాశాలకు వెళుతుంటే.. ఇతడు మాత్రం ట్రాక్టర్‌ వేసుకుని డీజిల్‌ క్యాన్‌ పట్టుకుని పొలం పనులకు వెళ్లేవారు. డిగ్రీ చదివే రోజుల్లోనే పూర్తిస్థాయి రైతులా మారిపోయి వ్యవసాయం చేశారు. ట్రాక్టర్‌తో సొంతంగా పొలం దున్ని పంటలు పండించుకునేవారు. ఇలా ఒకటీ రెండూ కాదు ఎనిమిదేళ్లు గడిచింది... ఈ క్రమంలో ఆయన చదువుతో పాటు సాగుభూమి కూడా పెరిగింది.

చివరి నిమిషంలో..

పీజీ చదివి వ్యవసాయం చేసుకుంటున్న నర్సిరెడ్డి ప్రతిభపై స్నేహితులు, బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తుండేవారు. చదువు సరిగ్గా రాక వ్యవసాయం చేసుకుంటున్నాడనేవారు. దీంతో చదువుపై దృష్టిపెట్టాలనుకున్నారాయన. సొంతూళ్లోనే చిన్నపాటి కంప్యూటర్‌ కోర్సులు చేశారు. అదే సమయంలో అమెరికాలో ఉండే ఓ స్నేహితుడి ద్వారా ఎంసీఏ చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిసింది. దీని గురించి వాకబు చేశారు. బీఏ చదివిన వ్యక్తి ఎంసీఏ చేసేందుకు అనుమతి లేదని చెప్పడంతో నిరాశే ఎదురైంది. అదే సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎంసీఏకు విడిగా పరీక్ష ఉండేది. ఈ అవకాశం ఆ ఒక్క ఏడాదికే పరిమితమైంది. దీంతో ఎంతో కష్టపడి సీటు సంపాదించారు.

ఎంసీఏ వదిలేద్దామనుకుని...

అప్పటివరకు తెలుగు మీడియం.. పైగా పల్లెటూరి నుంచి రావడం.. మరోవైపు ఎంసీఏలో ఇంగ్లిషు మీడియం కావడం.. పోటీ తట్టుకోవడం చాలా కష్టమైంది. వెనక్కి వెళ్లిపోదామని చాలాసార్లు అనుకునేవారు. ఒకానొక దశలో ఆర్‌ఎన్‌రెడ్డికి అర్థమైతే తరగతిలోని అందరికీ అర్థమైనట్టేనని అధ్యాపకులు అనేవారు. డిక్షనరీ చూస్తూ... సీనియర్ల సాయం తీసుకుంటూ ఎంసీఏ పూర్తి చేశారు. ఇదే సమయంలో తల్లి మరణించడం ఆయనను తీవ్రంగా కలిచివేసింది. ఏడాదిన్నర తర్వాత బెంగళూరులోని ఓ కంపెనీలో ఉద్యోగం లభించింది. అక్కడ డాట్‌నెట్‌ నేర్చుకుని ఎంసీపీ, ఎంక్యాడ్‌ వంటి సర్టిఫికెట్‌ కోర్సులపై పట్టు సాధించారు. హైదరాబాద్‌ విప్రో కంపెనీలో చేరారు. డాట్‌నెట్‌కు మంచి ఆదరణ ఉందని తెలుసుకుని బోధనారంగంలోకి ప్రవేశించారు. ఓ శిక్షణ కేంద్రంలో 15 వేల మందికి శిక్షణనిచ్చారు. వారిలో 11వేల మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఏటా 1500మందికిపైగా నిరుద్యోగులు డాట్‌నెట్‌, పైథాన్‌ కోర్సుల్లో ఆర్‌ఎన్‌రెడ్డి వద్ద శిక్షణ పొందుతుంటారు. రెండేళ్ల కిందట సొంతంగా తన పేరిట ఇనిస్టిట్యూట్‌ పెట్టుకుని ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తున్నారు. డాట్‌నెట్‌కు సంబంధించి రెండు పుస్తకాలు రాశారు. ఇప్పుడు మంచి మానవ వనరుల కోసం ఎన్నో కంపెనీలు ఆయన శిక్షణ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నాయి. ఇప్పుడాయన సేవారంగంలోనూ అడుగుపెట్టారు. ఆర్‌ఎన్‌రెడ్డి బ్లడ్‌బ్యాంక్‌, ఆర్‌ఎన్‌రెడ్డి హెల్పింగ్‌ హ్యాండ్‌ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

- అమరేంద్ర యార్లగడ్డ, ఈనాడు, హైదరాబాద్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని