ప్రాంతాలు వేరైనా ప్రేమ ఒక్కటే...
close
Updated : 31/07/2021 05:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రాంతాలు వేరైనా ప్రేమ ఒక్కటే...

బెంగళూరుకు చెందిన అభిరామ్‌, కశ్మీరుకు చెందిన సోనా సహోద్యోగులు. ఇరువురి స్నేహం ప్రేమగా మారి ఏడడుగుల వరకు నడిపించింది. బెస్ట్‌ ఫ్రెండ్స్‌గా ఉన్న వారు దాంపత్యంలోకి అడుగుపెట్టాక పరిస్థితి మారింది. ఒకరిపై మరొకరు నిందలు మోపుకోవడం మొదలు పెట్టారు. ఆ బంధం బీటలు వారే వరకు వెళ్లకూడదంటే కొన్ని నియమాలను పాటించాల్సిందే అంటున్నారు మానసిక నిపుణులు. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చినా  ప్రేమ మాత్రం ఒక్కటే అంటూ, దాన్ని ఎలా నిలుపుకోవాలో సూచిస్తున్నారు.

గౌరవించాలి

పుట్టి పెరిగిన ప్రాంతం, కుటుంబ వాతావరణ ప్రభావం ప్రతి వారిపైనా ఉంటుంది. వివాహమైన వెంటనే భార్యాభర్తల సంప్రదాయాలు, అలవాట్లు, అభిరుచులు మారిపోవు. అయితే ఒకరినొకరు గౌరవించుకోవాలి. ప్రేమకు గౌరవం తోడైతేనే ఆ బంధం కలకాలం నిలుస్తుంది. ఎదుటివారి జీవనశైలిని గుర్తించి, దానికి తగినట్లుగా నడుచుకోవాలి. అలాకాకుండా నేనిలా ఉన్నాను, నాలాగే నువ్వూ ఉండాలి అంటే మాత్రం అనుబంధం గాఢత తగ్గుతుంది. అలా జరగకుండా ఇరువురూ ప్రయత్నించాలి.

భాష నేర్చుకుంటే

దంపతుల్లో ఒకరి భాషను మరొకరు నేర్చుకోవడానికి కృషి చేయాలి. కొత్త భాషను నేర్చుకుంటే అవతలి వారి మనోభావాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. అది ఇద్దరినీ మరింత దగ్గర చేస్తుంది. బంధాల మధ్య భాష ఎప్పుడూ అవరోధం కాకూడదు. అది సమస్యగా మారితే భార్యాభర్తల మధ్య అగాధం ఏర్పడుతుంది. ఒకరికొకరు వారి భాషను ఎదుటి వారికి పూర్తిగా నేర్పడానికి ప్రయత్నించాలి. అలా ఇరువురూ కొంత సమయాన్ని కేటాయిస్తే అది వారి మధ్య అనుబంధాన్నీ, సాన్నిహిత్యాన్నీ పెంచుతుంది.

హేళన వద్దు

బంధువులు, స్నేహితుల ఎదుట జీవిత భాగస్వామికి తన సంస్కృతి సంప్రదాయాలు తెలియవని ఎద్దేవా చేయకూడదు. అది అవతలి వారి మనసులో వేదన నింపుతుంది. క్రమంగా ఆత్మన్యూనతగా మారే ప్రమాదమూ ఉంది. తమ ప్రాంత విశేషాలు, పండుగల గురించి ఒకొరికొకరు వివరించి చెప్పడమే కాదు, ఎదుటివారి మనోభావాలకు, నమ్మకాలకు విలువనివ్వాలి. ఇవన్నీ ఆ దాంపత్యాన్ని నిండు నూరేళ్లూ నిలుపుతాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని