Corona: ఒక్కరోజే 2000 దాటిన మరణాలు - india reports more than 2000 covid deaths in single day
close
Updated : 21/04/2021 10:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: ఒక్కరోజే 2000 దాటిన మరణాలు

కొత్తగా 2.95లక్షల మందికి పాజిటివ్‌

దిల్లీ: కరోనా సృష్టిస్తున్న ప్రళయానికి యావత్‌ భారతావని వణుకుతోంది. మునుపటి కంటే రెట్టింపు వేగంతో విస్తరిస్తోన్న ఈ మహమ్మారి.. ఒక్క రోజే దాదాపు 3లక్షల మందిపై విరుచుకుపడింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 2.95లక్షల కేసులు నమోదయ్యాయి. కరోనా దేశంలోకి ప్రవేశించిన తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక ఇదే సమయంలో మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుండటం భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా 2023 మందిని వైరస్‌ బలితీసుకుంది. దేశంలో రోజువారీ మరణాలు 2వేలు దాటడం ఇదే తొలిసారి. 

మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 16,39,357 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. 2,95,041 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,56,16,130కి  చేరింది. 

ఇదే సమయంలో కొవిడ్‌తో 2023 మంది మృత్యువాతపడ్డారు. కరోనా ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటివరకు మంది 1,82,553 మంది వైరస్‌కు బలయ్యారు. మరణాల రేటు 1.18శాతంగా ఉంది.  

ఒక్కరోజులో సంభవించిన మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 519, దిల్లీలో 277, ఉత్తరప్రదేశ్‌లో 162 మరణాలు నమోదయ్యాయి.

మరోవైపు గడిచిన 24 గంటల్లో మరో 1,67,457 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు 1,32,76,039 మంది వైరస్‌ను జయించగా.. రికవరీ రేటు 85.56శాతంగా ఉంది.

కరోనా ఉద్ధృతితో దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 21లక్షలు దాటింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 21,57,538 యాక్టివ్‌ కేసులుండగా.. క్రియాశీల రేటు 13.26శాతానికి పెరిగింది. 

ఇక దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా సాగుతోంది. మంగళవారం మరో 29.90లక్షల మందికి వ్యాక్సిన్లు ఇవ్వగా.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 13 కోట్ల మందికి పైగా కరోనా టీకాలు పొందారు. 

ఆ రాష్ట్రాల్లో ఉద్ధృతంగానే..

ఇక తొలుత మహారాష్ట్రలో మొదలైన కరోనా రెండో దశ ఉద్ధృతి చాపకింద నీరులా దేశమంతా పాకింది. మహారాష్ట్ర తర్వాత ఉత్తరప్రదేశ్‌, దిల్లీ, కర్ణాటకల్లో రోజువారీ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. అత్యధికంగా మహారాష్ట్రలో 62,097, యూపీలో 29,754, దిల్లీలో 28,395, కర్ణాటకలో 21,794 కొత్త కేసులు నమోదయ్యాయి.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని