MAA Elections: ‘మా’ ప్రెసిడెంట్‌.. బిరుదు కాదు బాధ్యత: మంచు విష్ణు - manchu vishnu press meet about maa elections
close
Updated : 24/09/2021 18:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

MAA Elections: ‘మా’ ప్రెసిడెంట్‌.. బిరుదు కాదు బాధ్యత: మంచు విష్ణు

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ప్రెసిడెంట్‌ అనేది ఒక బిరుదు కాదని, ఒక బాధ్యత అని మంచు విష్ణు అన్నారు. ‘మా’ ఎన్నికల్లో భాగంగా తన ప్యానెల్‌ సభ్యులతో కలిసి శుక్రవారం  విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంచు విష్ణు సుదీర్ఘంగా మాట్లాడారు.

‘‘మా’ పుట్టి 25 సంవత్సరాలు అయింది. చాలా మంది కళాకారులకు తమిళనాడు/ చెన్నై అన్నం పెట్టింది. ఇప్పటికీ పెడుతూనే ఉంది. ప్రత్యేకంగా తెలుగు నటులకు ఒక సంఘం ఉండాలని ‘మా’ను ఏర్పాటు చేశారు. ఎంతోమంది అతిరథ మహారథులు తెలుగు సినిమా కోసం, నటీనటుల సంక్షేమం కోసం పాటుపడ్డారు. తెరపై చూసినట్లు సినిమా నటులు ఖరీదైన జీవితాలను గడుపుతారని చాలా మంది అనుకుంటారు. కానీ, మేకప్‌ తీసి ఇంటికి వచ్చిన తర్వాత మేమూ మీలాగే జీవిస్తాం. ఒక నటుడికి ఈ ఏడాది మొత్తం పని ఉండొచ్చు. వచ్చే ఏడాది కనీసం మూడు నెలలు కూడా పని దొరకని పరిస్థితి ఏర్పడొచ్చు. నటుడి కష్టాలు, ఆవేదన అతడికే తెలుస్తుంది. వాళ్ల కుటుంబ సభ్యులకు కూడా తెలియదు. ఆ బాధ ఎవరితోనూ పంచుకోలేం. ఆర్టిస్ట్‌ల కోసం, మా అందరి కోసం ‘మా’ ఉంది. ‌మా ప్రెసిడెంట్‌ అనేది ఒక బిరుదు కాదు.. బాధ్యత. దాన్ని నేను సమర్థంగా తీసుకోగలననే నమ్మకంతో వస్తున్నా. ఈ ఎన్నికలు ఇలా జరగడం పట్ల మేమెవరమూ సంతోషంగా లేం. నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం నాన్నకు ఇష్టం లేదు. నాన్న 46ఏళ్ల నట జీవితంలో ఈ స్థాయిలో నటులు విడిపోలేదు. ఇంత బీభత్సంగా ఎన్నికలు జరగలేదు’’

‘‘2015-16లో స్వర్గీయ దాసరి నారాయణరావుగారు, సీనియర్‌ నటులు మురళీమోహన్‌గారు నన్ను ఎగ్జిక్యూటివ్‌ ప్రెసిడెంట్‌గా పోటీ చేయమన్నారు. ఇదే విషయాన్ని నాన్న దగ్గర ప్రస్తావిస్తే, ‘ఆ పదవి బాధ్యతతో కూడుకున్నది. నీ అనుభవం సరిపోదు. నీకు వరుస సినిమాలు ఉన్నాయి. నటుల సంక్షేమం కోసం నువ్వు సమయాన్ని కేటాయించలేవు’ అన్నారు. మార్పు తీసుకురాగలననే ధైర్యంతో ఇప్పుడు వస్తున్నా. ‘మా’లో ఎన్నో సవాళ్లు ఉన్నాయి. వాటన్నింటినీ సమర్థంగా ఎదుర్కొనే సత్తా మా ప్యానెల్‌కు ఉంది. ప్రత్యర్థి ప్యానెల్‌లో మంచి నటులు ఉన్నారు. వారిలో కొందరు నా బ్యానర్‌లోనూ పనిచేశారు. ఒక నిర్మాతగా వాళ్లను నా సినిమాలోకి తీసుకుంటా. కానీ మా అసోసియేషన్‌లో పనిచేసేంత సామర్థ్యం వాళ్లకు లేదు. ఈ విషయంలో నాకన్నా ఎవరూ బాగా పనిచేయలేరు. దీన్ని ఎక్కడైనా చెబుతా. వాళ్ల గురించి ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. వాళ్ల ప్రసంగాలు విన్నా. వాళ్లు చెప్పింది 99 శాతం నేను ఆమోదించను. తినడానికే సగం మందికి తిండి లేదు. రెస్టారెంట్‌కు డిస్కౌంట్‌లో ఎలా తినగలుగుతారు. ‘మా’ ఒక ఛారిటీ ఆర్గనైజేషన్‌ కాదని ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ అంది. పెద్దలకు పింఛన్‌ ఇవ్వడాన్ని ఛారిటీ అని ఎలా అంటారు? అది మన బాధ్యత. రేపు వయసు అయిపోయిన తర్వాత మనల్ని కూడా చూసుకోవాలి కదా! డబ్బున్న వాడికీ, లేని వాడికీ కరోనా స్పష్టత ఇచ్చింది’’

‘‘అసోసియేషన్‌లో ఉన్న 900మందికీ లైఫ్‌, మెడికల్‌ ఇన్సూరెన్స్ ఇవ్వడమే నా ప్రాధాన్యం. ఎడ్యుకేషన్‌ పాలసీ గురించి ఏమైనా మాట్లడారా? ఆ ప్యానెల్‌లో ఉన్న ఎవరైనా దీనిపై మాట్లాడటానికి వస్తే, నేను సిద్ధం. కెమెరా ముందు ఉన్నప్పుడు నాకు కలిగే ఆనందం మరెప్పుడూ కలగదు. ప్రతి ఒక్కరికీ పని కల్పించడమే నా లక్ష్యం. 900 మంది ఒక కుటుంబం. ఈ ఎన్నికల వ్యవహారం మీడియా ముందుకు వచ్చి ఉండకూడదు. కానీ, ఆలస్యమైపోయింది. ఇప్పుడు దాన్ని పట్టుకుని శూలశోధన చేయడం అనవసరం. 900 మంది 2000 మంది కావాలి. కొత్త టాలెంట్‌ ఇండస్ట్రీలోకి రావాలి. నిర్మాత దేవుడితో సమానం. వాళ్లకు గౌరవం ఇచ్చినప్పుడే మనం బతకగలం. వాళ్ల దగ్గరకు వెళ్లి అవకాశాల ఇవ్వాలని కోరాలి. కొత్తగా ఓటీటీ వేదికలు వస్తున్నాయి. వాళ్లనూ కలవాలి. ఒక నిర్మాత ఓటీటీ ఫ్లాట్‌ఫాం ప్రారంభించారు. దాన్ని చూసి మనం గర్వపడాలి. పని కలిగించడమే నా అజెండా. అదే నా ప్రాధాన్యం. అందుకే ఈ ప్యానెల్‌ను ఎన్నుకున్నా. బాబూమోహన్‌, పృథ్వీలాంటి సీనియర్‌ నటుల అనుభవం నాకు కావాలి. శివ బాలాజీ లాంటి యువరక్తం ‘మా’ అభివృద్ధికి అవసరం. మా ప్యానెల్‌లోనే అత్యధికమంది మహిళలు ఉన్నారు. ఈ ప్యానెల్‌లో అన్ని పార్టీల వాళ్లం ఉన్నాం. అందరికీ శిరస్సు వంచి చెబుతున్నా, దయచేసి మా ఎన్నికల్లో రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోవద్దు. ఇక్కడ ‘మా’ ఎన్నికలు మాత్రమే జరుగుతున్నాయి. రాజకీయాలతో అసోసియేషన్‌కు సంబంధం లేదు. ‘విష్ణు ఎన్నికల్లో పాల్గొంటాడు అవకాశం ఇవ్వండి’ అని మా నాన్న ఎవరినీ అడగలేదు. అయితే, ‘విష్ణును ఎన్నికల నుంచి తప్పుకోమనండి’ అంటూ ఒకరు ఫోన్‌ చేశారు. ఆ తర్వాతే నాన్న రంగంలోకి దిగారు. అసోసియేషన్‌లో ఉన్న 600 మందికి ఫోన్‌ చేసి, ‘విష్ణు ఎన్నికల్లో దిగుతున్నాడు. మీ సపోర్ట్‌ కావాలి’ అని అడిగారు. అంతకుముందు వరకూ నాన్న ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు’’ అని మంచు విష్ణు చెప్పుకొచ్చారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని