చెప్పాల్సిన కథలు చాలానే ఉన్నాయి   - nandini reddy tarun bhaskar nag ashwin and sankalp reddy about pitta kathalu movie
close
Updated : 05/02/2021 18:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చెప్పాల్సిన కథలు చాలానే ఉన్నాయి 

ఓటీటీ వేదికలు మన కథలకి పట్టం కడుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులకు చేరువ చేస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో మన ‘పిట్టకథలు’ ప్రదర్శితం కాబోతున్నాయి. నలుగురు దర్శకులు తెరకెక్కించిన ఓ సంకలనం ఇది. మహిళల జీవితాల నేపథ్యంలో సాగే ఈ కథల్ని ప్రముఖ దర్శకులు నందినిరెడ్డి,  తరుణ్‌భాస్కర్‌, నాగ్‌ అశ్విన్‌, సంకల్ప్‌ తెరకెక్కించారు. ‘మీరా’లో అమలాపాల్‌, ‘పింకీ’లో ఈషా రెబ్బా, ‘రాముల’లో మంచు లక్ష్మీ, ‘ఎక్స్‌లైఫ్‌’లో శ్రుతిహాసన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ నెల 19 నుంచి ‘పిట్టకథలు’ స్ట్రీమింగ్‌ కానున్న నేపథ్యంలో శుక్రవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుల మనసులోని మాటలు ఇవి...

స్వేచ్ఛకి వేదిక

‘‘నేపథ్యాలు వేరు కావొచ్చేమో కానీ... ‘పిట్టకథలు’ అన్నీ కూడా మానవ సంబంధాల్ని ఆవిష్కరిస్తాయి. పవర్‌ ప్లే అనే ఒక థీమ్‌ ఇచ్చి ఓ చిత్రం చేయమన్నప్పుడు భార్యాభర్తల బంధం నేపథ్యంలో ‘మీరా’ కథని తెరకెక్కించా. ఆడుతూ పాడుతూ స్వేచ్ఛగా చేసిన చిత్రమిది. మీరా ప్రత్యేకంగా నాకెక్కడో తారసపడిన అమ్మాయేమీ కాదు. ఎంతోమంది అమ్మాయిల్ని కలిపితే.. ఒక మీరా’. భార్యాభర్తల బంధంలో ఎన్నో ఒడుదొడుకులు ఉంటాయి. బయటకి కనిపించేది ఒకటైతే, దాని వెనకాల నిజం మరొకటి ఉంటుంది. అలాంటి బంధాల ఆధారంగానే ‘మీరా’ తెరకెక్కించా. ఓటీటీ అనేది అంతర్జాతీయ వేదిక అయినా... నాకెప్పుడూ నా ప్రాథమిక ప్రేక్షకులు మనవాళ్లే. ముందు మన తెలుగు ప్రేక్షకులకు నచ్చాలనుకుంటా. ఆ తర్వాత అవి అందరికీ అర్థమవుతాయి. ఓటీటీ కోసం నేను చేసిన తొలి చిత్రమిది. థియేటర్‌లో విడుదల చేసే సినిమా అయితే... అది ఎప్పుడు విడుదల అవుతుంది? పెద్ద సినిమాలు ఏమైనా ఉన్నాయా? ఏ సీజన్‌లో విడుదల చేయాలి? ఆడుతుందా? లేదా? పంపిణీదారులు ఏమంటారు? ఇలా చాలా ఒత్తిళ్లు ఉంటాయి. ఓటీటీ కోసం సినిమా చేస్తున్నప్పుడు అలాంటి సమస్యలేమీ ఉండవు. దర్శకులకి స్వేచ్ఛనిచ్చే ఓ మంచి వేదిక. ఓటీటీ వేదికల ద్వారా చెప్పాల్సిన కథలు చాలా ఉన్నాయి. తెలుగు సాహిత్యం తెరపైకి రావాల్సిన సమయం ఇది’’.
- నందినిరెడ్డి

సెల్‌ఫోన్లే స్ఫూర్తి

‘‘ఎప్పుడైనా తలతిప్పితే చుట్టూ ఓ ఐదుమంది ఫోన్లు చూసుకుంటూ కనిపిస్తుంటారు. చుట్టూ అందమైన ప్రపంచం కనిపిస్తున్నా పట్టించుకోరు. అలా మనం వాడే సెల్‌ఫోన్లే నేను తీసిన ‘ఎక్స్‌ లైఫ్‌’ కథకి స్ఫూర్తి. ఓ కథ చెబుతున్నప్పుడు ఇది ఓటీటీ, అది థియేటర్‌ అని ప్రత్యేకంగా చూడను. కథని కథలాగే చెప్పాలనుకుంటా. అలాగే ఇది ఏ దేశంలో చూస్తారు, అక్కడి వాళ్లకి నచ్చుతుందా లేదా అని కూడా ఆలోచించను. అంటార్కిటికాలో అయినా అమలాపురంలో అయినా భావోద్వేగాలు ఒక్కటే. నా ‘ఎక్స్‌లైఫ్‌’కి కొవిడ్‌ ఒక్కటే సవాల్‌ని విసిరింది. కరోనా కేసులు ఎక్కువగానే ఉన్న గతేడాది సెప్టెంబర్‌ సమయంలోనే ఈ చిత్రాన్ని పూర్తి చేశా. సాంకేతికతతో కూడిన చిత్రమిది. 30 నిమిషాల సినిమాకి 300 సీజీ షాట్స్‌ అవసరమయ్యాయి’’. - నాగ్‌ అశ్విన్‌

ఎంతో దూరం ప్రయాణం చేస్తాయి

‘‘ఒకొక్క చోటు, ఒక్కో నేపథ్యం, ఒక్కో బంధం ఎన్నెన్నో కథల్ని చెబుతాయి. వాటన్నిటికీ వేదికగా నిలుస్తున్నాయి నెట్‌ఫ్లిక్స్‌లాంటి ఓటీటీ వేదికలు. కథ మన మూలాలకి చెందినదే అయినా... ఎంతోమంది ప్రేక్షకులకు చేరువవుతాయి, ప్రపంచవ్యాప్తంగా మరెంతో దూరం ప్రయాణం చేస్తాయి. ‘పిట్టకథలు’లో భాగంగా నేను చేసిన ‘పింకీ’కి ప్రత్యేకంగా స్ఫూర్తి అంటూ ఏమీ లేదు. ఒక సున్నితమైన కథని, అంతే సున్నితమైన భావోద్వేగాలతో తెరపైకి తీసుకొచ్చా. నేనేం చెప్పాలనుకున్నానో అది పరిమితులు లేకుండా చెప్పా. ఓటీటీ వేదిక కోసం పనిచేస్తున్నప్పుడు దర్శకుడికి స్వేచ్ఛ ఉంటుంది. ప్రతి ప్రేక్షకుడూ ఈ కథల్ని చూసేందుకు ఆస్కారం ఉంటుంది.  ఒక చిత్రం గురించి అప్పటికే బాగుందనో, బాగోలేదనో అభిప్రాయం చెప్పినా పట్టించుకోకుండా, సమయం
దొరికిందంటే చూసి ఆస్వాదిస్తాడు. అలాంటి వేదిక ఇది’’. - సంకల్ప్‌రెడ్డి

ప్రయోగాలకి అవకాశం

‘‘కొన్ని సంఘటనల గురించి, ఊళ్లల్లో కొన్ని పంచాయతీల గురించి వింటున్నప్పుడు ఆశ్చర్యపోతుంటా. అలా ఒకసారి చర్చకొచ్చిన విషయం గురించి ఆలోచిస్తూ, కొంచెం లోతుగా పరిశోధన చేసినప్పుడు తట్టిన కథే... ‘రాముల’. ఈ కథని డార్క్‌ హ్యూమర్‌గా తీసి ప్రయోగం చేయొచ్చు అనిపించింది. నేను లఘు చిత్రాల నుంచి వచ్చినవాణ్నే. అప్పట్లో ఏ కథయినా 10 నుంచి 30 నిమిషాల వ్యవధిలో తీసేలా ఆలోచించేవాణ్ని. ‘పిట్టకథలు’ కోసం ‘రాముల’ కథ తీస్తున్నప్పుడు మరోసారి పాత రోజుల్లోకి వెళ్లినట్టు అనిపించింది. అయితే ఈ చిత్రం విషయంలో మేం చేసిన ప్రయోగం, మార్పుల విషయంలో గర్వంగా అనిపించింది. ఇదివరకు నేను చేసిన లఘు చిత్రం ‘సైన్మా’లోని రాముల, కౌశిక్‌, రామ్‌చందర్‌ తదితర పాత్రలు ఇందులోనూ కనిపిస్తాయి. కొద్దిమంది దర్శకులు అలాంటి ప్రయోగం చేశారు. ఇంట్లో నా భార్యని కూడా నేను రాముల అనే పిలుస్తుంటా (నవ్వుతూ). మన కథల్ని మనం నిజాయతీగా చెబితే, వాటిని అంతర్జాతీయ స్థాయిలోనూ వినూత్నంగా చూస్తారు. మనం ఎదుర్కుంటున్న పాత్రలు, సన్నివేశాలు కొత్తగా ఉండొచ్చు. కానీ అందరి  భావోద్వేగాలూ ఒక్కటే’’. - తరుణ్‌భాస్కర్‌

 

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని