సూర్య కోసమే అలా చేశానన్న కోహ్లీ - opened to fit in players like surya but no guarantee that rohit and i will open in t20 wc kohli
close
Published : 23/03/2021 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సూర్య కోసమే అలా చేశానన్న కోహ్లీ

పుణె: టీ20 ప్రపంచకప్‌లో తాను ఓపెనింగ్‌ చేస్తానని కచ్చితంగా చెప్పలేనని టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. సూర్యకుమార్‌ వంటి యువకులకు అవకాశమిచ్చేందుకే ఆఖరి టీ20లో రోహిత్‌తో కలిసి ఓపెనింగ్‌ చేశానని స్పష్టం చేశాడు. జట్టు మేళవింపునకు అవసరమైతే ఎలాంటి పాత్రనైనా స్వీకరిస్తానని వెల్లడించాడు. ఇంగ్లాండ్‌తో తొలి వన్డేకు ముందు అతడు మీడియాతో మాట్లాడాడు.

‘మైదానంలో దిగే జట్టు కూర్పులో సెలక్టర్లకు ఎలాంటి పాత్ర లేదు. ఇక రోహిత్‌ చెప్పినట్టుగా ఇదొక వ్యూహం మాత్రమే. నిజమే, మేమిద్దరం కలిసి ఓపెనింగ్‌ చేయడాన్ని ఆస్వాదించాం. మా బ్యాటింగ్‌ జట్టుపై సానుకూల ప్రభావం చూపించింది.  అయితే భవిష్యత్తులోనూ ఇదే కొనసాగుతుందన్న గ్యారంటీ లేదు’ అని కోహ్లీ తెలిపాడు.

‘నేను గతంలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేశాను. మూడో స్థానంలో దిగాను. ఒకప్పుడు టీ20 క్రికెట్లో ఓపెనింగ్‌ చేశాను. అయితే ఓపెనర్‌గా నా పాత్రను అర్థం చేసుకోవాలని అనుకుంటున్నా. అలా చేయడం వల్ల సూర్యకు చోటిచ్చేందుకు అవకాశం దొరుకుతుంది. అతడిలాగే బ్యాటింగ్‌ కొనసాగిస్తే జట్టు అవసరాల మేరకు ఏ పాత్ర పోషించేందుకైనా నేను సిద్ధమే. ప్రపంచకప్‌ సమీపించే నాటికి దీనిపై మరింత చర్చిస్తాం’ అని విరాట్‌ అన్నాడు.

తొలి వన్డేలో రోహిత్‌తో కలిసి శిఖర్‌ ధావన్‌ ఓపెనింగ్‌ చేస్తాడని కోహ్లీ స్పష్టం చేశాడు. ఈ సిరీసు టీ20 ప్రపంచకప్‌నకు అదనపు సన్నద్ధతగా భావిస్తున్నామని అన్నాడు. వన్డేల్లో రోహిత్‌-ధావన్‌ ఓపెనింగ్‌ భాగస్వామ్యంపై తమకెలాంటి సందేహాలు లేవని పేర్కొన్నాడు. కొన్నేళ్లుగా వారు జట్టుకు శుభారంభాలు అందించారని వెల్లడించాడు. ఈ ఏడాది టీ20 ప్రపంపచకప్‌ ఉండటం, పనిభారం దృష్ట్యా షెడ్యూళ్లను ఆటగాళ్లను సంప్రదించాక చేస్తే బాగుంటుందని అన్నాడు.

‘గతంలో ఎన్నోసార్లు చెప్పాను. పనిభారంపై సమీక్ష అవసరం. ప్రస్తుతం మేం ఆంక్షల మధ్య ఉంటున్నాం. మున్ముందూ బుడగల్లోనే ఉండాల్సి రావొచ్చు. అందుకే శారీరకంగానే కాకుండా మానసికంగానూ తాజాగా ఉండటం అవసరం. ఈ విషయంపై ఆటగాళ్లతో మాట్లాడాలి. ఈ సంక్లిష్టమైన రోజుల్లో ఆడేవాళ్లు ఆడగలుగుతారు. ఇబ్బందిగా ఉంటే వారు తప్పుకొని ఇతరులకు అవకాశం ఇస్తారు’ అని కోహ్లీ తెలిపాడు.

అంతే కాకుండా ఫామ్‌లో లేని ఆటగాళ్లకు జట్టు అండగా ఉంటుందని రాహుల్‌ను ఉద్దేశించి విరాట్‌ అన్నాడు. ‘గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న ఆటగాడితో ఎలా వ్యవహరించాలో జట్టు యాజమాన్యానికి తెలుసు. వారు మానసికంగా ప్రశాంతంగా ఉండటం ముఖ్యం. మేం ఆ పని కొనసాగిస్తున్నాం. బయట విమర్శలు వస్తున్నాయని మాకు తెలుసు. కొందరు వాటికి అలవాటు పడ్డారు’ అని విరాట్‌ చురకలు అంటించాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని