close

తాజా వార్తలు

Published : 06/03/2021 01:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బీమా చేస్తున్నారు.. ప్రాణం తీస్తున్నారు! 

కుటుంబాలతో కుమ్మక్కై ‘బీమాసురుల’ ఘోరాలు

పోలీసుల విచారణలో వెలుగులోకి విస్తుపోయే నిజాలు

బీమా అంటేనే ధీమా. ఇంటి యజమానికి ఏదైనా ఊహించని ప్రమాదం జరిగితే బాధిత కుటుంబానికి అండగా ఉంటుందనే భరోసా. నేను లేకపోయినా నా అనేవారు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందీ పడకూడదనే ఎక్కువమంది బీమా చేయించుకుంటుంటారు. కానీ.. కాసుల కోసం కక్కుర్తిపడి నామినీలతో ఒప్పందాలు చేసుకొని గుట్టుచప్పుడు కాకుండా  ఏకంగా ప్రాణాలే తీసేస్తున్నాయి కొన్ని కిరాతక ముఠాలు.  బీమా చేయించుకున్న వ్యక్తుల్ని హత్య చేసి రోడ్డు ప్రమాదాలుగా చిత్రీకరిస్తూ పాలసీ డబ్బుల్ని దోచుకుంటున్నాయి. ఇటీవల నల్గొండ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించడం.. మృతుడి తల్లి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. తీగలాగితే ఆ ఏజెంట్ల ముఠా డొంక కదిలి వారు చేసిన దారుణాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి.

హతమార్చి.. ప్రమాదంగా చిత్రీకరించి..

అమాయకులకు తెలియకుండానే పాలసీలు చేయించడం.. తర్వాత వారిని హతమార్చడం.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడం, నామినీల సాయంతో  బీమా సొమ్మును కొట్టేయడం. దాదాపు ఏడేళ్ల పాటు గుట్టుగా సాగుతున్న ఓ పాలసీ ముఠా ఆగడాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకూ పాలసీ తీసుకున్న 10 మందిని పొట్టన పెట్టుకున్న ఈ బీమాసురుల దారుణాలు చూస్తే పాలసీలంటేనే భయపడే పరిస్థితి. ఈ భయంకరమైన ముఠాలో ఇద్దరు ప్రైవేటు బీమా ఏజెంట్లు, కరడుగట్టిన హంతకులు సభ్యులు. వారికి కొందరు బ్యాంకు సిబ్బంది సాయంగా నిలవగా అంతా కలిసి డబ్బుకోసం ఈ అమానుష కార్యకలాపాలు మొదలుపెట్టారు. 

కథ  అడ్డం తిరిగిందిలా..!

ముందుగా నిరుపేదలు అందునా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులపై దృష్టిపెడతారు. వారి కుటుంబ నేపథ్యం, ఆర్థిక పరిస్థితుల్ని గమనించి కుటుంబ సభ్యుల్ని ఒప్పించి రూ.లక్షకు బీమా చేయిస్తారు. ఒకట్రెండు కిస్తీలు వాళ్లే కట్టేస్తారు. నామినీతో పరిచయం పెంచుకొని మాయమాటలతో  వారినీ ఒప్పిస్తారు. ఒప్పందం కుదుర్చుకుంటారు. తర్వాత వీళ్ల ముఠాలోని కొందరు అనారోగ్యంతో బాధపడుతున్న ఆ వ్యక్తిని హత్య చేస్తారు. ఏ రోడ్డు ప్రమాదంలోనో మృతిచెందినట్టు చిత్రీకరిస్తారు. పోలీసుల నుంచి ఎఫ్‌ఐఆర్‌ తీసుకొని బీమా క్లెయిమ్‌ చేసుకుంటారు. విచారణకు వచ్చిన థర్డ్‌పార్టీ సభ్యులు  డబ్బుల పంపిణీలో బ్యాంకు సిబ్బందిని ఏదోలా తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వచ్చిన మొత్తంలో 20శాతం నామినీకి ఇచ్చి మిగతా మొత్తాన్ని తలా కొంత పంచుకుంటారు. ఇటీవల వివరాలే చూస్తే.. దామరచర్ల మండలంలోని కొండ్రపోల్‌కు చెందిన దేవిరెడ్డి కోటిరెడ్డి మృతదేహం వారం క్రితం నార్కట్‌పల్లి - అద్దంకి రహదారి వద్ద కనిపించింది. ట్రాక్టర్‌ ఢీకొట్టడం వల్లే మరణించారని కుటుంబ సభ్యుల్ని అతడి భార్య నమ్మించింది. కానీ, అంత్యక్రియల సమయంలో కోటిరెడ్డి శరీరంపై గాయాలు చూసిన అతడి తల్లిదండ్రులకు అనుమానం రావడంతో కథ అడ్డం తిరిగింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కోటిరెడ్డి భార్యను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. అప్పుడే ఈ దందా వెలుగులోకి వచ్చింది. బీమా డబ్బుల కోసం ప్రియుడితో కలిసి తానే చంపినట్టు అంగీకరించింది. పాలసీ ఏజెంటు తనను ఒప్పించి ఇలా చేశారని తెలియడంతో గుట్టుబయటపడింది. ఈ హత్యలో భాగం పంచుకున్న బీమా ఏజెంట్‌ను అదుపులోకి తీసుకొని విచారించడంతో పోలీసులే విస్తుపోయే వాస్తవాలు బాహ్య ప్రపంచానికి తెలిశాయి.

పాలసీదారుడి భార్యతోనే కుమ్మక్కై..

ఏడాది క్రితం రాళ్లవాగుతండాలో అనారోగ్యానికి గురై మృత్యువుకు చేరువలో ఉన్న వ్యక్తినీ ఇలాగే దారుణంగా హత్య చేశారు. మిర్యాలగూడ మండలం గూడూరు సమీపంలో నార్కట్‌పల్లి -అద్దంకి రహదారిపై వాహనం ఢీకొట్టి చనిపోయినట్టు చిత్రీకరించారు. అతడి పేరుపై ఉన్న రూ.కోటి బీమాను సదరు ఏజెంట్‌ క్లెయిమ్‌ చేసుకొని నామినీకి మాత్రం నామమాత్రంగానే ముట్టజెప్పాడు. మూడేళ్ల క్రితం ఇదే మండలంలోని బొల్లిగుట్ట తండాలో ఒక వ్యక్తిని చంపేందుకు ఈ ముఠా పథకం వేసింది. పాలసీపై అతడి భార్యతో అవగాహన కుదుర్చుకుంది. బాధితుడికి అనుమానం రావడంతో పెద్ద మనుషులతో పంచాయితీ పెట్టాడు. అసలుకే మోసం రానుందని గ్రహించిన ఏజెంట్‌ వారివద్ద మాయ మాటలు చెప్పి తప్పించుకున్నాడు. 2018లో గుంటూరు జిల్లా తెనాలి వద్ద జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. అక్కడి పోలీసులు ఆ మృతదేహానికి శవపంచనామా చేయించగా.. బలమైన గాయాలు బయటపడ్డాయి. అనుమానం వచ్చి సీసీటీవీ ఫుటేజీలు, కాల్‌ డేటాను పరిశీలించారు. వాటి ఆధారంగా కుటుంబ సభ్యుల్లో ఒకరిని అదుపులోకి తీసుకొని విచారించారు. అప్పుడే తొలిసారి దామరచర్ల మండలం రాళ్లవాగుతండాకు చెందిన ప్రైవేటు బీమా ఏజెంటు పేరు తెరపైకి వచ్చింది. అతడు చెప్పినట్టే హత్య చేసినట్టు మృతుడి కుటుంబ సభ్యుడు అంగీకరించాడు. అనారోగ్యంతో ఉన్న ఆ వ్యక్తిపై రూ.50లక్షలు బీమా చేసినట్టు తెలిపాడు. కొంతకాలానికి ఆ పాలసీ దారుడిని చంపి రోడ్డుపై పడేసి కారుతో ఢీకొట్టి ప్రమాదంగా చిత్రీకరించారని ఆ వ్యక్తి వెల్లడించాడు.ఈ కేసులో అరెస్టైన ఏజెంట్‌ బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ అదే దందాకు తెరతీశాడు. మూడేళ్లలో దాదాపు ఐదారుగురిని ఇలాగే చంపి వారికి రావాల్సిన బీమా సొమ్ముని సొంతం చేసుకున్నట్టు విచారణలో తేలింది. 

నాలుగైదేళ్లలో రూ.50కోట్ల సంపాదన

ఈ దందాలో కీలకంగా వ్యవహరిస్తున్న ఇద్దరు ఏజెంట్లు నాలుగైదేళ్లలో దాదాపు 50 కోట్ల వరకు సంపాదించినట్టు పోలీసులు గుర్తించారు. రెండు రోజుల క్రితం రాళ్లవాగుతండా, మిర్యాలగూడ, హైదరాబాద్‌, మాచర్ల, ఒంగోలుతో పాటు పలు ప్రాంతాల్లో నిందితుల ఇళ్ల నుంచి విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దామరచర్లకు చెందిన ఓ ఏజెంట్‌ మిర్యాలగూడలో కోట్ల విలువ చేసే రెండు భవంతులతో పాటు వ్యవసాయ భూమి,  హైదరాబాద్‌ పరిసరాల్లో 10 వరకు ప్లాట్లు, గుంటూరు, మాచర్లలో అపార్ట్‌మెంట్లు ఉన్నట్టు విచారణలో వెల్లడైనట్టు సమాచారం. మాచర్లకు చెందిన మరో ఏజెంట్‌కు గుంటూరు, ఒంగోలులో విలువైన ప్రాంతాల్లో ప్లాట్లు ఉన్నట్టు తెలిసింది. రెండేళ్ల కిందట కూడా ఇదే తరహాలో తెలుగు రాష్ట్రాల్లో కొన్ని కేసులు రాగా.. పోలీసులు ఆ ముఠా ఆటకట్టించి కటకటాల్లోకి పంపారు. ఇదే సమయంలో ప్రభుత్వ జీవిత బీమా సంస్థలో కొందరి వ్యవహారంపై సీబీఐ విచారణ చేపట్టడం అప్పట్లో సంచలనమైంది.

గిరిజనులే లక్ష్యంగా ఘోరాలు

ఇదిలా ఉండగా.. ప్రీమియం కట్టి అనంతరం బీమా డబ్బుల కోసం హత్యచేసి ప్రమాదాలుగా చిత్రీకరిస్తున్న ముఠా దందాలు రెండు రాష్ట్రాల్లోనూ విస్తరించినట్టు నల్గొండ పోలీసులు గుర్తించారు. ముఠా సభ్యులు ఏడేళ్లుగా దామరచర్ల-మిర్యాలగూడ-  నల్గొండ- సూర్యాపేట, హైదరాబాద్‌తో పాటు ఏపీలోని దాచేపల్లి, మాచర్ల, గుంటూరు ,ఒంగోలులో పది మందిని ఇలా హత్య చేసినట్టు సమాచారం. ఈ ముఠాలో దామరచర్ల మండలానికి చెందిన ఓ ఏజెంట్‌ తో పాటు మాచర్లకు చెందిన మరో ఏజెంట్‌ కీలకంగా వ్యవహరించినట్టు గుర్తించారు. దీంతో సంబంధం ఉన్న 20మంది నిందితులను నల్గొండ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించినట్టు తెలుస్తోంది. ఇందులో మరిన్ని విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులు గిరిజన ప్రాంతాలున్న దామరచర్ల, మాచర్ల, ఒంగోలు ప్రాంతాలపై ప్రధానంగా దృష్టిపెట్టారు. ఒక్క దామరచర్ల మండలంలోనే ఏడుగురిని చంపినట్టు అంగీకరించినట్టు సమాచారం. ఈ బీమా డబ్బును కాజేస్తున్న ముఠా ప్రధాన లక్ష్యం గిరిజనులే కావడం గమనార్హం.

గిరిజన ప్రాంతాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులపై కన్నేసి వారి కుటుంబ సభ్యులను కలిసి బీమా డబ్బులు సైతం తామే కడతామని ఒప్పిస్తారు. తర్వాత ముఠా సభ్యులు మీరు పైసాకట్టలేదు.. పైగా మీకు లక్షలు వస్తాయి.. బీమా చేయించుకున్న వ్యక్తి బతికి ఉన్నా అంత డబ్బు సంపాదించలేడంటూ నామినీలకు పదేపదే నచ్చచెబుతారు. ఆ డబ్బు కుటుంబానికి చాలా ఉపయోగపడుతుందంటూ పలు రకాలుగా  మభ్యపెడతారు. చివరకు వారిని ఒప్పించి తమ ఆలోచనను ఆచరణలో పెడుతున్నారు ఈ కిరాతకులు.ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని