రోడ్డు ప్రమాదాల్లో పంచ ప్రాణాలు బలి

ప్రధానాంశాలు

Published : 25/11/2021 04:06 IST

రోడ్డు ప్రమాదాల్లో పంచ ప్రాణాలు బలి

 లారీని కారు  ఢీకొని ముగ్గురి దుర్మరణం

మృతుల్లో ఇద్దరు అక్కాచెల్లెళ్ల పిల్లలు

మరో ఘటనలో ట్రిపుల్‌ రైడింగ్‌లో ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థుల బలి

కీసర, వనస్థలిపురం, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ నగరం, శివార్లలో బుధవారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కీసర అవుటర్‌ రింగ్‌రోడ్డుపై కారు అదుపుతప్పి లారీని ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. కుత్బుల్లాపూర్‌ పేట్‌బషీరాబాద్‌ శ్రీ అవెన్యూ గేట్‌-3 లో నివసించే సుమంత్‌రెడ్డి(20) బుధవారం తన సోదరుడిని నీట్‌ శిక్షణ కోసం ఖమ్మంలో వదిలి వచ్చేందుకు అల్వాల్‌కు చెందిన తన సమీప బంధువు పవన్‌కుమార్‌రెడ్డి(21), డ్రైవర్‌ శంకర్‌రెడ్డి(38)తో కలిసి కారులో వెళ్లారు. తిరుగుప్రయాణంంలో సుమంత్‌రెడ్డి కారు నడుపుతున్నాడు. కీసర టోల్‌ప్లాజా దాటిన తర్వాత బ్రేకులు ఫెయిల్‌ కావడంతో సుమంత్‌రెడ్డి కారును కుడివైపు నుంచి ఎడమవైపు తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు. వేగం అదుపు చేయలేక అక్కడున్న గ్రిల్‌ను, తర్వాత ఎడమవైపు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టాడు. దీంతో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. సుమంత్‌రెడ్డితో పాటు పక్కనే కూ4ర్చున్న శంకర్‌రెడ్డి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. తీవ్ర గాయాలపాలైన పవన్‌కుమార్‌రెడ్డిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ప్రమాదంలో లారీ పక్కన నిలబడి ఉన్న ఇద్దరు కార్మికులు స్వల్పంగా గాయపడ్డారు. మృతులు సుమంత్‌రెడ్డి, పవన్‌రెడ్డి అక్కాచెల్లెళ్ల పిల్లలు. మరో దుర్ఘటనలో కళాశాలకు వెళ్లి వస్తున్న ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు బోర్‌వెల్‌ వాహనం కింద పడి మృతి చెందారు. నగరంలోని హబ్సిగూడకు చెందిన రోహిత్‌రెడ్డి(20), జడ్చర్లకు చెందిన విశాల్‌(20), వనస్థలిపురానికి చెందిన గౌతమ్‌రెడ్డి(20) ఇబ్రహీంపట్నంలోని సీవీఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నారు. బుధవారం ముగ్గురూ కలిసి రోహిత్‌రెడ్డి ద్విచక్రవాహనంపై కాలేజీ నుంచి వస్తున్నారు. సాగర్‌ రహదారి పక్కన శ్రీపురం కాలనీ కమాన్‌లోంచి లోపలకి వెళ్తుండగా ఓ బోర్‌వెల్‌ లారీ వీరి వాహనానికి తగలడంతో అదుపు తప్పి కింద పడిపోయారు. బండి నడుపుతున్న గౌతమ్‌రెడ్డి రోడ్డుపై పడిపోగా వెనుక కూర్చున్న విశాల్‌, రోహిత్‌రెడ్డి లారీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. తల్లిదండ్రులకు విశాల్‌ ఒక్కడే కుమారుడు.

ప్రమాదంలో ధ్వంసమైన కారుAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన