అందిపుచ్చుకుంటే అవకాశాలు మెండు
eenadu telugu news
Published : 25/09/2021 02:20 IST

అందిపుచ్చుకుంటే అవకాశాలు మెండు

ఇంజినీరింగ్‌ సీఎస్‌ఈలో కొత్త కోర్సులతో ప్రయోజనం 

న్యూస్‌టుడే,  నరసరావుపేట అర్బన్‌  జిల్లాలో ఉన్న సాంకేతిక కళాశాలలు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, సైబర్‌ సెక్యూరిటీ, తదితర కోర్సులకు అనుమతులు పొందాయి. దీంతో జిల్లాలో 2వేల సీట్లు అదనంగా విద్యార్థులకు లభిస్తాయి. నరసరావుపేటలో మూడు కళాశాలలు గతేడాది నుంచి ఆయా కోర్సుల్లో బోధన చేస్తుండగా తాజాగా మరో మూడు కళాశాలలు అనుమతులు సాధించాయి. దీంతో ఇక్కడే 360 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. గుంటూరు, మంగళగిరి, బాపట్ల తదితర ప్రాంతాల్లోని అన్ని ప్రముఖ విద్యాసంస్థలు నూతన కోర్సులు నిర్వహిస్తున్నాయి. కొత్త కోర్సులతో సీఎస్‌ఈ విభాగంలో సీట్ల కొరత తీరడంతో విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉండనున్నాయి. ఎంసెట్‌లో ర్యాంకులు ఆధారంగా సీఎస్‌ఈలో సీటు రాకుంటే మేనేజ్‌మెంట్‌ కోటాలో చేరాల్సి ఉంటుంది. కళాశాలల యాజమాన్యాలు వారి కోటా సీట్లకు రూ.లక్షల్లో  వసూలు చేస్తున్నాయి. నరసరావుపేటలోని ఓ కళాశాల ప్రస్తుతం రూ.1.5లక్షల నుంచి రూ.2లక్షల వరకూ వసూలు చేస్తుంది. అదే కళాశాలలో కృత్రిమ మేధస్సుకు సంబంధించిన కోర్సులో ప్రభుత్వ రుసుముకే సీటు దొరికే పరిస్థితి ఉంది. అంతే కాకుండా ప్రస్తుతం పరిశ్రమలు ఉత్పత్తులు తయారీ విభాగంలో రోబోటిక్స్‌ను వినియోగిస్తున్నాయి. ఆయా పరిశ్రమల్లో కృత్రిమ మేధస్సుతో పాటు రోబోటిక్స్‌ సంబంధించిన విద్యార్థులకే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. 

కంప్యూటర్‌ రంగంలో సాఫ్ట్‌వేర్, సమాచార పరిజ్ఞానం ఆధారంగా ఎక్కువ మందికి ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ఈ క్రమంలోనే కృత్రిమ మేధస్సు, సైబర్‌సెక్యూరిటీ, రోబోటిక్స్, డేటా సైన్సెస్‌ తదితర అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఏఐసీటీఈ వీటిని గమనంలోకి తీసుకుని విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా కొత్త కోర్సులకు అనుమతి ఇచ్చింది. జిల్లాలో పలు కళాశాలలు కృత్రిమ మేధస్సు, డేటాసైన్సెస్, సైబర్‌ సెక్యూరిటీ తదితర కోర్సులు సీఎస్‌ఈలో భాగంగా బోధించేందుకు అనుమతులు పొంది నిర్వహిస్తున్నాయి. ఎంసెట్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు ఇస్తారు. అయితే ఎక్కువమంది సీఎస్‌ఈ కోర్సులో చేరేందుకు ఆసక్తి ఉన్నా అన్ని సీట్లు అందుబాటులో ఉండడం లేదు. ఈ కారణంగా విద్యార్థులు కొత్త కోర్సుల్లో చేరేలా కళాశాలల అధ్యాపకులు ప్రోత్సహిస్తున్నారు. 

జిల్లాలో సాంకేతిక కళాశాలలు 44
సీఎస్‌ఈలో సీట్లు 4,000
కొత్త కోర్సులతో అందుబాటులో ఉన్న సీట్లు 2,000 

పరిశ్రమల అవసరాల మేరకే.. 
ఉద్యోగాలు ఇచ్చే సంస్థలు ఏవైనా కంప్యూటర్‌ కోర్సుల విద్యార్థులకే అవకాశాలు ఇస్తున్నాయి. అందుకే సీఎస్‌ఈ కోర్సు కంటే అందులోనే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కోర్సును ఎంచుకున్నా. భవిష్యత్తు అంతా కృత్రిమ మేధస్సు ఆధారంగా ఉత్పత్తి, రూపకల్పన, పంపిణీ జరుగుతుంది. ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉండే కోర్సు చదివితే మేలని ఇందులో చేరా.
- పి.జయలక్ష్మీ, ద్వితీయ సంవత్సరం 

అన్ని రంగాలపై ప్రభావం
పరిశ్రమల్లో తయారీ, వైద్యరంగంలో పరీక్షలు, శస్త్రచికిత్సలు ఇలా ప్రతిదాంట్లోనూ కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్‌ ప్రభావం ఉంది. సీఎస్‌ఈ కోర్సు అంటే గతంలో ప్రోగ్రాం రాయడానికే పరిమితంగా ఉండేది. పరిశ్రమల అవసరాలకు తగిన విధంగా సాఫ్ట్‌వేర్‌లు రూపకల్పన చేసేలా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమల తీరు మారింది. మానవ వనరులు, యంత్ర పరికరాలను ఉపయోగించే చేసే ఉత్పత్తికి బదులు రోబోట్‌ల వినియోగం పెరగనుంది. అందుకు తగిన విధంగా నిపుణులకు ఉద్యోగాలు ఇస్తున్నాయి. అందువల్లే సీఎస్‌ఈలో కృత్రిమ మేధస్సు ప్రధానాంశంగా కోర్సు ఎంచుకున్నా.  - వి.సంతోష్‌కుమార్, ద్వితీయ సంవత్సరం 

కోర్సు ఒకటే.. ప్రాధాన్యమే ఎక్కువ
సీఎస్‌ఈ విభాగంలో 48 సబ్జెక్టులు ఉంటాయి. అందులో కృత్రిమ మేధస్సు, సైౖబర్‌ సైక్యూరిటీ కూడా ఉంటాయి. అయితే నేను కృత్రిమ మేధస్సు ఆధారంగా ఉద్యోగావకాశం పొందాలన్న లక్ష్యంతో ఉన్నా. కుటుంబసభ్యుల్లో ఇంజినీరింగ్‌ చేసి ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు ఉన్నారు. వారి సలహా మేరకు సీఎస్‌ఈ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కోర్సులో చేరా. ఇందులో మిగిలిన అంశాల కంటే కృత్రిమ మేధస్సుకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అందుకనే ఈ కోర్సు ఎంచుకున్నా. 20 శాతం ఉద్యోగావకాశాలు ఈ కోర్సు ద్వారా వస్తాయి. 
- టి.ప్రియాంక, ద్వితీయ సంవత్సరం  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని