Published : 14/02/2020 09:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘ఖాకీ’లకే బురిడీ!

పోలీసు ఉన్నతాధికారిగా చెలామణి
పోస్టింగ్‌ల ఆశచూపి నగదు వసూలు
పోలీసులకు చిక్కిన 18 కేసుల్లో నిందితుడు
వివరాలు వెల్లడించిన శ్రీకాకుళం ఎస్పీ అమ్మిరెడ్డి

అరసవల్లి, న్యూస్‌టుడే: ప్రజల శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులకే రక్షణ లేకుండా పోయింది...నిత్యం బ్యాంకు అధికారులమంటూ ప్రజలను దోచుకునే  వారికి ఆధార్‌ నంబరు, బ్యాంకు ఖాతా నంబరు ఇవ్వవద్దంటూ ధైర్యం చెప్పే పోలీసులకే దెబ్బ తగిలింది..కేవలం పోలీసులనే లక్ష్యంగా పెట్టుకుని వారికి ఉద్యోగాలు వేయిస్తానంటూ రూ.లక్షలు దోచేశాడు ఓ ప్రబుద్దుడు. పోలీసుస్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తూ, సస్పెండ్‌ అయిన...వీఆర్‌లో ఉన్న....విధుల్లో  అసంతృప్తిగా ఉన్నవారిని గుర్తించి అటువంటి వారికి ఫోన్‌చేసి పోస్టింగ్‌ వేయిస్తానంటూ డబ్బులు గుంజేసిన వ్యక్తి ఎట్టకేలకు శ్రీకాకుళం పోలీసులకు చిక్కాడు. కేసు వివరాలను శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఎస్పీ ఆర్‌.ఎన్‌. అమ్మిరెడ్డి వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం... అనంతపురం జిల్లా నల్లమాడ మండలం వేళ్లుమద్ది గ్రామానికి చెందిన రాచపల్లి శ్రీను అలియాస్‌ మంగళ శ్రీను అనే వ్యక్తి ఏడోతరగతి వరకు చదువుకున్నాడు. శ్రీకాకుళం జిల్లా జేఆర్‌పురం పోలీసుస్టేషన్‌లో పనిచేస్తూ వివిధ కారణాలతో వీఆర్‌లో ఉన్న పాత ఎస్‌.ఐ.అశోక్‌బాబుకు నెల రోజుల కిందట రాచపల్లి శ్రీను ఫోన్‌ చేసి తాను విశాఖపట్నం డీఐజీ మాట్లాడుతున్నాని నమ్మబలికాడు. మీరు వీఆర్‌లో ఉన్నారని తెలిసింది...మీ సమస్యను పరిష్కరిస్తానన్నాడు. ఇందుకు రూ.4 లక్షలు నాలుగు విడతులుగా ఇవ్వాలని సూచించాడు. పండ్లు అమ్ముకున్న వ్యక్తులకు చెందిన బ్యాంకు ఖాతాలు సేకరించి పోలీసు అధికారులకు ఇచ్చాడు. 2006 నుంచి బంగారు గొలుసుల చోరీల కేసుల్లో 18 ఎన్‌బీడబ్ల్యూ కేసులున్నాయి. కర్నాటక, కడప, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో కేసులున్నాయి. 2016లో జైలు నుంచి విడుదలై తిరిగి నేరాలకు పాల్పడుతున్నాడు. 2017లో బంగారు గొలుసు చోరీ చేస్తుండగా పట్టుబడి జైలుకెళ్లాడు.

ప్రసారమాధ్యమాలు చూస్తూ: టీవీల్లో వచ్చే వార్తలను చూస్తూ పోలీసు అధికారులు ఎందుకు వీఆర్‌లో ఉన్నారు...ఎందుకు సస్పెండ్‌ అయ్యారు...క్రిమినల్‌ కేసుల్లో ఎందుకు ఇరుక్కున్నారనేది ఆరా తీసేవాడు. సంబంధిత పోలీసుస్టేషన్‌కు సంబంధించిన ల్యాండ్‌లైన్‌కు ఫోన్‌ చేసి డీఐజీని మాట్లాడుతున్నానని నమ్మ బలికి వివరాలు సేకరించేవాడు. వివరాలు అడిగే సమయంలో ఏమైనా తేడా అనిపించి మీరేవరని పోలీసులు గట్టిగా అడిగితే వెంటనే ఫోన్‌ కట్‌ చేసేవాడు. నేరాలకు పాల్పడిన తరువాత సెల్‌, సిమ్‌ మార్చేస్తాడు. దర్యాప్తులో భాగంగా బ్యాంకు ఖాతా ఎవరిదని ఆరా తీయగా పలు ఆసక్తికరమైన విషయాలు బయట పడ్డాయి.

పుస్తకంలోనే అంతా: శ్రీను వద్ద దొరికిన ఓ పుస్తకంలో ఎవరెవరిని బురిడీ కొట్టించాలనే పేర్లను రాసుకున్నాడు. అందులో గుంటూరుకు చెందిన ఎస్‌.ఐ. బాలకృష్ణ, వరంగల్‌ అర్బన్‌ పోలీసు కానిస్టేబుల్‌, జీడిమెట్ల పోలీసుకానిస్టేబుల్‌, అమలాపురానికి చెందిన ఉపాధ్యాయుడు, విశాఖపట్నం కంచరపాలెం కానిస్టేబుల్‌, విజయనగరం జిల్లా మక్కువలో జరిగిన హత్యకేసు నుంచి 12 మందిని రక్షించేందుకు, కర్నూలు సీఐ, పీసీ, మంగళగిరి బెటాలియన్‌ పీసీ, గుంటూరు జిల్లా గురజాల పీసీ, హైదరాబాద్‌ వనస్థలిపురం పీసీ, విజయవాడ పీసీ, హైదరాబాద్‌ సిటీ జీడిమెట్ల పీసీ ఇలా పేర్లు ఉన్నాయి. ఇతడిపై అనుమానం వచ్చిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎస్‌.ఐ.అశోక్‌బాబు ఆ బ్యాంకు ఖాతా వివరాలతో కూపీ లాగడంతో అసలు విషయం బయటపడింది. శ్రీనును గురువారం  అరెస్టు చేసి ఓ చరవాణి, రూ.50 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇతడిని చాకచక్యంగా పట్టుకున్న పోలీసుసిబ్బందికి రివార్డులు అందజేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని