దంపతుల ఆత్మహత్యాయత్నం
logo
Published : 16/06/2021 02:59 IST

దంపతుల ఆత్మహత్యాయత్నం

భర్త మృతి... భార్య పరిస్థితి విషమం...


రఘుబాబు (పాతచిత్రం)

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: అతనో ప్రభుత్వ ఉద్యోగి.. అవినీతి ఆరోపణలు రావడంతో గత ఏడాది విధుల నుంచి తప్పించారు. కుటుంబపోషణకు అప్పులు చేస్తూ వచ్చారు. మరో నాలుగు రోజుల్లో తిరిగి ఉద్యోగంలో చేరుతారనగా.. అప్పులబాధ తాళలేక భార్యాభర్తలిద్దరూ పురుగు మందు తాగారు. ఈ సంఘటన ఉంగుటూరు మండలం పెద్దఅవుటపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని పొట్టిపాడుకు చెందిన దోమ రఘుబాబు(47) స్థానిక పోస్టుమాస్టర్‌గా పనిచేస్తున్నారు. గతేడాది ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఇంటి దగ్గరే ఉంటూ జీవనం సాగిస్తున్నారు. కుటుంబ అవసరాల దృష్ట్యా పలువురి నుంచి కొంత నగదును అప్పుగా తీసుకున్నారని సమాచారం. రోజులు గడుస్తున్నా తీసుకున్న నగదు రఘుబాబు చెల్లించకపోవడంతో అప్పులు ఇచ్చిన వారు తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన అతను భార్యతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సోమవారం రాత్రి సమీప గ్రామమైన పెద్దఅవుటపల్లిలోని ఓ ప్రైవేట్‌ వసతి గృహంలో బస చేసేందుకు అని వచ్చి వెంట తెచ్చుకున్న పురుగుల మందును ఇద్దరూ తాగారు. ఆ సమయంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఫోన్లో అతన్ని సంప్రదించగా.. ఫోన్‌లిఫ్ట్‌ చేసిన అతని భార్య పురుగుమందు తాగిన విషయం చెప్పడంతో పోలీసుల సాయంతో సంఘటనా స్థలికి గ్రామస్థులు చేరుకున్నారు. విజయవాడలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ రఘుబాబు మంగళవారం ఉదయం మృతిచెందగా.. భార్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆత్కూరు పోలీసులు వివరించారు. ఆ దంపతులకు ఇంటర్‌ చదువుతున్న ఓ కుమారుడు, ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం చదువుతున్న కుమార్తె ఉన్నారు. సస్పెండ్‌ గడువును ముగించుకుని మరో నాలుగు రోజుల్లో విధుల్లో చేరతారన్న నేపథ్యంలో రఘుబాబు ఆత్మహత్య చేసుకోవడం పలువురిని కలచివేస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని