ప్రశాంతంగా ముగిసిన ఓట్ల లెక్కింపు
eenadu telugu news
Published : 20/09/2021 05:33 IST

ప్రశాంతంగా ముగిసిన ఓట్ల లెక్కింపు

అక్కడక్కడా చెదరుమదురు ఘటనలు
ఊపిరి పీల్చుకున్న యంత్రాంగం
ఈనాడు, గుంటూరు - న్యూస్‌టుడే, కలెక్టరేట్‌
కమాండ్‌ కంట్రోల్‌ రూం సిబ్బందికి సూచనలు చేస్తున్న కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌

జిల్లా పరిషత్‌ ఎన్నికల ఫలితాలకు సంబంధించి పలుచోట్ల చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. తెదేపా కొద్ది మెజార్టీతో విజయం సాధించిన పలు ఎంపీటీసీ స్థానాల్లో రీకౌంటింగ్‌కు పట్టుబట్టడం, నోటాకు వచ్చిన ఓట్లు వైకాపా అభ్యర్థుల ఖాతాలో కలిపి తిరిగి ఓట్ల లెక్కింపు చేపట్టాలని పట్టుబట్టడం వంటివి ఆయా కౌంటింగ్‌ కేంద్రాల్లో వైకాపా-తెదేపా అభ్యర్థులు, కౌంటింగ్‌ ఏజెంట్ల మధ్య ఘర్షణకు దారి తీశాయి. వీటిపై ఆయా కేంద్రాల్లోని పోలీసులు వెంటనే అప్రమత్తమై ఇరువర్గాలకు ఎన్నికల అధికారుల సూచనల మేరకు నడుచుకోవాలని సర్ది చెప్పారు. దీంతో అరుపులు, కేకలతో ఆగిపోయారు. చిలకలూరిపేట సీఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల లెక్కింపు కేంద్రంలో మాత్రం నాదెండ్ల మండలం అప్పాపురం ఎంపీటీసీ స్థానాన్ని తెదేపా గెలుచుకోగా వైకాపా తరఫున పోటీలో నిలిచిన అభ్యర్థి నోటా ఓట్లు కూడా కలిపి లెక్కించి తిరిగి కౌంటింగ్‌ నిర్వహించాలని కోరారు. దానికి తెదేపా ఏజెంట్లు అభ్యంతరం తెలిపారు. వైకాపా అభ్యర్థి తెదేపాకు చెందిన ఓ ఏజెంట్‌పై చేయిచేసుకోవడంతో కొంతసేపు అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి వైకాపా అభ్యర్థిని బయటకు తీసుకొచ్చి వివాదం మరింత రచ్చకాకుండా చూశారు. గుంటూరు ఏఎల్‌ బీఈడీ కళాశాలలో జరిగిన కౌంటింగ్‌లో తాడికొండ మండలం బేజాత్‌పురం గ్రామానికి చెందిన బ్యాలెట్‌ బాక్సులు వర్షానికి తడిశాయని, బ్యాలెట్‌ పత్రాలను ఆరబెట్టిన అనంతరం కౌంటింగ్‌ చేపట్టాలని తెదేపా ఏజెంట్లు ఎన్నికల అధికారులను కోరారు. దీనికి వైకాపా ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. తడిసినా సరే వాటితోనే లెక్కింపు కొనసాగించాలని పట్టుబట్టడంతో ఇక్కడ కూడా కొద్దిసేపు తెదేపా, వైకాపా ఏజెంట్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఇదే కేంద్రంలో ఆశా కార్యకర్తలు తమకు భోజనం పెట్టలేదని ఆందోళనకు దిగారు. వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని వారికి కూడా భోజన కూపన్లు అందించటంతో వారు శాంతించారు. వివాదం సద్దుమణిగింది. వట్టిచెరుకూరు ఎంపీటీసీ స్థానాన్ని తెదేపాకు చెందిన భీమినేని కోటేశ్వరరావు 27 ఓట్లతో గెలుపొందినట్లు తొలుత ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే దీనికి వైకాపా అభ్యంతరం వ్యక్తం చేసి తిరిగి లెక్కింపు చేపట్టాలని పట్టుబట్టగా రీకౌంటింగ్‌ చేశారు. రెండోసారి లెక్కింపులో తెదేపాకు చెందిన 38 ఓట్లను తీసేసి లెక్కింపు చేపడుతున్నారని తెలుసుకుని తెదేపా కార్యకర్తలు కౌంటింగ్‌ కేంద్రం వెలుపల గుంటూరు- ప్రత్తిపాడు రహదారిపై ఆందోళనకు దిగారు. అప్రమత్తమైన ఎన్నికల అధికారులు తిరిగి తెదేపా అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించంతో అక్కడ వివాదం సమసిపోయింది. దుగ్గిరాల మండలం పెదకొండూరు ఎంపీటీసీ స్థానాన్ని జనసేన 63 ఓట్లతో గెలుచుకుంది. అయితే వైకాపా వాళ్లు తిరిగి ఓట్ల లెక్కింపు చేపట్టాలని కోరడంతో ఆ మేరకు లెక్కింపులో భాగంగా బ్యాలెట్‌ పత్రాలపై ముద్రలు సరిగా పడలేదని కొన్నింటిని అనర్హమైనవిగా పక్కన పెడుతున్నారని జనసేన ఏజెంట్లు అభ్యంతరం తెలపడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. సత్తెనపల్లి మండలం బురుగుబండలో పార్టీల వారీగా పోలైన ఓట్లను కట్టలు కట్టి ట్రేలో వేసేటప్పుడు జనసేన-వైకాపా ఏజెంట్లు వాదులాడుకోవడంతో అలజడి నెలకొంది. దీనిపై యంత్రాంగం అప్రమత్తమై ఇంకా లెక్కింపు ప్రారంభించలేదని కేవలం కట్టలు కట్టడమే చేస్తున్నామని చెప్పడంతో శాంతించారు. అమరావతి మండలం యండ్రాయి ఎంపీటీసీకి సంబంధించిన ఓట్ల లెక్కింపు విషయంలో వివాదం చోటుచేసుకుంది. అక్కడ వేరే బూత్‌కు చెందిన వైకాపా ఏజెంట్‌ ఒకరు ఇక్కడకు వచ్చి కట్టలతో కూడిన ట్రేలో చేయిపెట్టారని తెదేపా ఏజెంట్లు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులు స్పందించి అతన్ని బయటకు పంపడంతో వివాదం సద్దుమణిగింది. సత్తెనపల్లి మండలం అబ్బూరు ఎంపీటీసీ కౌంటింగ్‌ విషయంలో కొద్దిసేపు వివాదం చోటుచేసుకుంది. కొల్లూరు మండలం ఈపూరులోనూ బ్యాలెట్‌ పత్రాలు తడిశాయని తెలుసుకుని ఆందోళన చెందారు. అయితే దీనిపై ఎవరి నుంచి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇవి మినహా మిగిలిన అన్నిచోట్ల కౌంటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది.

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : గుంటూరు రేంజ్‌ డీఐజీ డాక్టర్‌ త్రివిక్రమ వర్మ, అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌లు ఆదివారం పలు లెక్కింపు కేంద్రాలను పరిశీలించి బందోబస్తు తీరును తనిఖీ చేశారు. భద్రతా పరంగా అందరూ బాధ్యతగా ఉండాలంటూ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు.

అధికారులకు సూచనలు చేస్తున్న డీఐజీ త్రివిక్రమ వర్మ, అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌


సజావుగా ప్రక్రియ

జిల్లా వ్యాప్తంగా 14 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ప్రక్రియను ఉదయం 6 గంటల నుంచే ప్రారంభించింది. స్ట్రాంగ్‌రూమ్‌ నుంచి బ్యాలెట్‌ బాక్సులను కౌంటింగ్‌ కేంద్రంలోకి తీసుకొచ్చి పెట్టడం, వాటిని ఏజెంట్ల సమక్షంలో తెరవటం వంటివి ప్రణళికాబద్ధంగా నిర్వహించారు. దీంతో కౌంటింగ్‌ ప్రక్రియ నిర్వహణలో ఎక్కడా అంతరాయం చోటుచేసుకోలేదు. ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారులు సూపర్‌వైజర్లను అప్రమత్తం చేస్తూ ఓట్ల లెక్కింపునకు పాటించాల్సిన మార్గదర్శకాలను మైకులో చెప్పారు. ఉద్యోగులు పొరపాట్లకు తావు లేకుండా లెక్కింపు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ఎన్నికలు ఏకపక్షమేనన్న అభిప్రాయం ఉన్నా యంత్రాంగం ఓట్ల లెక్కింపులో రాజీపడలేదు. ప్రతి పార్టీ తరఫున కౌంటింగ్‌ అభ్యర్థులను ఆహ్వానించడం, ఒకటికి రెండుసార్లు మైకులో పిలవడం వంటివి చేసి ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేశారు. చివరకు అభ్యర్థులు రాకపోయినా వారికి చెందిన గెలుపు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వటానికి ఫోన్లు చేసి మరీ వారిని కౌంటింగ్‌ కేంద్రానికి పిలిపించడం కనిపించింది. సకాలంలో ఓట్ల లెక్కింపునకు చర్యలు తీసుకోవటం వల్లే గంటల వ్యవధిలోనే ఎంపీటీసీ స్థానాల ఫలితాలు వెలువడ్డాయనే అభిప్రాయం వ్యక్తమైంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని