ఫలితమా..పరీక్షా..?
eenadu telugu news
Published : 20/09/2021 06:51 IST

ఫలితమా..పరీక్షా..?

కొన్నిచోట్ల తడిసిన బ్యాలెట్లు.. చెదలు పట్టిన వైనం

సామర్లకోట  టీటీడీసీలో చెదలు పట్టిన బ్యాలెట్‌ పత్రాలు

ఈనాడు, కాకినాడ- న్యూస్‌టుడే, పెద్దాపురం, మసీదు సెంటర్, అమలాపురం, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ: పరిషత్తు ఎన్నికలో ఓటరు తీర్పును భద్రపరిచే క్రమంలో కొన్ని లోపాలు చోటు చేసుకున్నాయనేది ఆదివారం నాటి పరిణామాలతో తేటతెల్లమైంది. స్ట్రాంగ్‌రూముల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నా.. అవేవీ సమర్థంగా సాగలేదు. వర్షాలకు కొన్నిచోట్ల కిటికీల నుంచి వాటిలోకి వర్షపునీరు ప్రవేశించడంతో బ్యాలెట్‌ పత్రాలు తడిసిపోయాయి. మరికొన్నిచోట్ల చెదలు పట్టి ఆనవాళ్లు లేకుండా మారాయి. ఈ ఘటనలు స్ట్రాంగ్‌రూముల్లో భద్రత వైఫల్యాలను తేటతెల్లం చేశాయి. 

లెక్కింపులో జాప్యం..

రంగరాయ వైద్య కళాశాలలోని ఓట్ల లెక్కింపు కేంద్రంలో బ్యాలెట్‌ బాక్సులు తీసుకొస్తున్న సిబ్బంది

ఓట్ల లెక్కింపు క్రమంలో చాలాచోట్ల జాప్యం చోటుచేసుకుంది. బ్యాలెట్లు తడిసిన, చెదలు పట్టినచోట్ల.. సాంకేతిక కారణాలతో ప్రక్రియను తాత్కాలికంగా నిలిపి, ఉన్నతాధికారుల సలహాలు తీసుకుని మొదలు పెట్టేక్రమంలో ఆలస్యమైంది. రంగరాయలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఆందోళనతో కొంత ఆటంకం ఎదురైంది. అమలాపురం జడ్పీ ఉన్నత పాఠశాల కేంద్రంలో ఓట్లు లెక్కించడానికి ఎనిమిది కేంద్రాలు నిర్దేశించారు. ఇక్కడ కౌంటింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. సిబ్బందిని కేటాయించడంలో కొంత, ప్రారంభ లెక్కింపులో మరికొంత జాప్యం జరిగింది. ఉదయం 9 గంటలకు మొదలైన ప్రక్రియ మధ్యాహ్నం 1.30 గంటల వరకు సాగింది. ఇక్కడ 2.30 గంటల వరకు ఆహారం రాలేదు. దీంతో భోజనం అనంతరం మళ్లీ 3.10 గంటలకు లెక్కింపు ప్రారంభించారు. 

ఆకలి కేకలు..

భోజనం బాగోలేదని సిబ్బంది నిరసన

కాకినాడలోని రంగరాయ వైద్యకళాశాలలోని ఓట్ల లెక్కింపు కేంద్రంలో సకాలంలో భోజనాలు అందకపోవడం.. అవీ నాణ్యతగా లేవని పలువురు ఉద్యోగులు అసహనం వ్యక్తంచేశారు. విధులు బహిష్కరిస్తామని నిరసన తెలపడంతో ఆర్డీవో చిన్నికృష్ణ, డీఎస్పీ రామకృష్ణ తదితరులు అక్కడికి చేరుకుని వారికి సర్దిచెప్పారు. మీ ఇంట్లో ఇలాంటి భోజనం తింటారా అంటూ.. అక్కడి ఉద్యోగులు లెక్కింపు కేంద్రాల్లోని అధికారుల వద్ద అసహనం వ్యక్తంచేశారు. మధ్యాహ్నం 3 గంటలకు భోజనాలు సమకూర్చడంతో కొద్దిసేపటికి పరిస్థితి సద్దుమణిగింది.

కొవిడ్‌ నిబంధనలా..?  అవెక్కడ..?

అమలాపురంలో భౌతికదూరం లేకుండా..

ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో కొవిడ్‌ నిబంధనలు సాధ్యపడలేదు. లెక్కింపు గదులు ఇరుగ్గా ఉండడంతో ఏజెంట్లు, అధికారులు భౌతికదూరం పాటించే అవకాశం లేకుండా పోయింది. ఉదయం థర్మల్‌ స్క్రీనింగ్, శానిటైజర్‌ అందుబాటులో ఉంచారు. టీకా వేయించుకున్న ధ్రువీకరణ పత్రం చూపితేనే లోనికి అనుమతిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించినా.. అది సాధ్యపడలేదు. చరవాణులు లోనికి అనుమతించకపోవడంతో ఓచోట భద్రపరచాల్సి వచ్చింది. వైద్యారోగ్య సిబ్బంది ధ్రువీకరణగానీ, మెసేజ్‌గానీ చూపించమని అడుగగా.. సెల్‌ఫోన్లలో ఉండిపోయాయని చెప్పడంతో చేసేదిలేక లోనికి వదిలారు. కాకినాడలో పది మందికి వ్యాక్సిన్‌ వేసి అనుమతించారు. వీరిలో ఏజెంట్లతోపాటు.. అభ్యర్థులూ ఉన్నారు. 

పెద్దాపురం మండలంలోని పొలిమేరు ఎంపీటీసీ స్థానం పరిధిలోని బ్యాలెట్‌ పెట్టెలోని 301 ఓట్లకు చెదలు పట్టాయి. ఇందులో 139 ఎంపీటీసీ, 162 జడ్పీటీసీ ఓట్లు ఉన్నాయి. దీంతో వాటిని పక్కనపెట్టి మిగిలిన వాటిని లెక్కించారు. 

కరప మండలంలోని అరట్లకట్ల ఎంపీటీసీ స్థానంలోని బ్యాలెట్‌ పెట్టెలోకి నీరు చేరింది. దీంతో వాటిని ఆరబెట్టారు. కరప మండలానికి సంబంధించి కాకినాడలోని బాలికల పాలిటెక్నిక్‌ కళాశాల స్ట్రాంగ్‌ రూమ్‌ తాళం పగలగొట్టి గదిని తెరవాల్సిన పరిస్థితి నెలకొంది. 

మారేడుమిల్లి మండలంలోని దొరచింతల ఎంపీటీసీ స్థానంలోని ఏడు బ్యాలెట్‌ పెట్టెల్లోకి వర్షం నీరు వెళ్లింది. దీంతో ఆదివారం సాయంత్రానికి రెండు పెట్టెల్లోని పత్రాలు ఆరబెట్టి చెల్లుబాటైనవి పక్కన పెట్టారు. మిగిలిన వాటిని ఆరబెట్టే పనిలో నిమగ్నమయ్యారు. పెట్టెల్లో 2,189 వరకు ఓట్లు ఉన్నట్లు సమాచారం.

గంగవరం మండలంలోని 33 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు, రాజవొమ్మంగి-2 ఎంపీటీసీ పరిధిలోని 50 వరకు తడిసిపోయాయి.

మార్గదర్శకాల  ప్రకారమే..

ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాగింది. పెద్ద జిల్లా కావడంతో కొంత జాప్యం జరిగింది. బ్యాలెట్‌ పెట్టెల్లోకి నీరు చేరడం, చెదలు పట్టడం వంటి సమస్యలు గుర్తించాం. వీటి కారణాలు తెలుసుకుంటాం. ఎక్కడా ఓట్ల లెక్కింపునకు ఆటంకం కలగలేదు. ఆయా ఓట్లు గెలుపుపై ప్రభావం చూపే పరిస్థితులు ఎదురైతే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటాం. ఒకట్రెండు చోట్ల భోజనం సరఫరాలో జాప్యమవ్వగా.. వాటిని వెంటనే చక్కదిద్దాం. జిల్లాలో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాగింది. - సి.హరికిరణ్, కలెక్టర్‌ 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని