Published : 22/01/2021 01:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తూటాలపై తాటాకు చప్పుళ్లు!

యథేచ్ఛగా వేటగాళ్ల సంచారం

వెలుగులోకి వస్తున్న కేసులు తక్కువే

ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌

* నాలుగేళ్ల క్రితం దామగుండం అటవీ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న కొందరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వేటకు వచ్చారని వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది.

* ఇటీవల మరో సారి దామగుండం అటవీ ప్రాంతంలోనే బుల్లెట్‌కు ఆవు దూడ బలయింది. ఈ కేసు విచారణ చివరికి చేరుకుంది. ఇందులో అసలు దోషులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

* గత నెల 24న యాలాల అటవీ ప్రాంతంతో తూటా, మ్యాగజిన్‌ లభించింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

జిల్లాలోని అటవీప్రాంతాల్లో వేటగాళ్లు ఇష్టానుసారం సంచరిస్తున్నారు. అయినా అటవీ అధికారులు, పోలీసులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కేవలం ఏదైనా సంఘటన జరిగినపుడు మాత్రం హడావుడి చేస్తున్నారు తప్పితే, కట్టడికి సరైన కార్యాచరణ చేపట్టడంలేదు. సరిహద్దుల్లో ఇంటిగ్రేడెట్‌ చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కాగితాలకే పరిమితమయింది. తనిఖీలు లేకపోవడంతో వేటగాళ్లు అడవులకు చేరుకుని వన్యప్రాణులను బలిగొంటున్నారు.

హైదరాబాద్‌, తదితర ప్రాంతాల నుంచి వికారాబాద్‌, దామగుండం, ధారూర్‌, కుల్కచర్ల అటవీప్రాంతాలను అడ్డాగా చేసుకుని కార్యకలాపాలు చేపడుతున్నారు. కొన్ని చోట్ల స్థానికుల సహకారం తీసుకుని కొంత మొత్తాన్ని ముట్టజెబుతున్నట్లు సమాచారం. ఎపుడైనా వీరు పట్టుబడితే తప్పించేందుకు కొందరు పెద్దలు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ సందర్భంగా అమాయకులపై కేసు నమోదు చేయించి, నిందితులు దర్జాగా తప్పుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికంగా ఉన్న వ్యవసాయ క్షేత్రాలే వీరికి కేంద్రాలు. అనుమతులు లేకుండా రాత్రుళ్లు విందు, వినోదాలు జరుగుతున్నా ఇక్కడ తనిఖీలు కొనసాగవు.


అడాల్‌పూర్‌ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి

యాలాల మండలం అడాల్‌పూర్‌ అటవీ పరిధిలో గత నెల 24న తూటా, మ్యాగజిన్‌ లభించింది. ఈ నెల 16వ తేదీ వరకు బయట ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇన్నాళ్లు ఈ విషయాన్ని ఎందుకు దాచారన్నది ప్రశ్నార్థకం. జనవరి రెండో వారంలో నెమ్మదిగా విషయం బయటకు పొక్కడంతో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. తాండూరు నియోజకవర్గంలో తుపాకీ లైసెన్సులు పొందిన 61మంది వివరాలు సేకరించారు. ప్రభుత్వం కేటాయించిన తూటాలు, గన్‌ వినియోగం తదితర అంశాలపై ఆరా తీస్తున్నారు.


వ్యవసాయ క్షేత్రాలపై పర్యవేక్షణ కరవు

పూడూరు, వికారాబాద్‌, నవాబుపేట, మోమిన్‌పేట్‌, ధారూర్‌, పరిగి తదితర మండలాల్లో పెద్ద సంఖ్యలో వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి. అక్కడ నిత్యం వారాంతాల్లో హైదరాబాద్‌ నుంచి పెద్దవాళ్లు ఇక్కడకు రావడం, విందులు, వినోదాలు నిర్వహించడం పరిపాటిగా మారింది. ఈ సంస్కృతి వన్యప్రాణులకు ప్రాణ సంకటంగా మారింది. కొంత మంది దుండగులు అర్ధరాత్రి అటవీ ప్రాంతాల్లో తూటాల మోతమోగిస్తున్నారు. ఎప్పుడైనా దొరికినపుడు పలుకుబడి ఉపయోగించి పైనుంచి ఒత్తిడి తెచ్చి తప్పించుకుంటున్నారు. అడ్డుకునే ప్రయత్నం చేసే వారిపై వాహనాలతో దాడులకు దిగుతున్నారని అటవీ శాఖ సిబ్బంది పేర్కొంటున్నారు.


విచారణ జరుగుతోంది..: నారాయణ, ఎస్పీ

యాలాల మండలంలో లభించిన తూటా విషయమై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఆదేశించాం. మొదట తాండూరు పరిసర ప్రాంతాలకు చెందిన గన్‌ లైసెన్సు తీసుకున్న వారి వివరాలు సేకరించి పరిశీలిస్తున్నాం. స్థానికులా, బయటి నుంచి ఎవరైనా వచ్చారా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. తూటా ఎవరిది అని గుర్తించే ప్రక్రియ జరుగుతోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని