యజమాని ఇంటికి కన్నమేసిన దంపతులు అరెస్టు
eenadu telugu news
Published : 26/09/2021 03:48 IST

యజమాని ఇంటికి కన్నమేసిన దంపతులు అరెస్టు

రూ.68 లక్షల సొత్తు స్వాధీనం 
షోలాపూర్‌లో పోలీసులకు చిక్కిన కిలాడీలు

కేసు దర్యాప్తు బృందంతో సీపీ స్టీఫెన్‌ రవీంద్ర

ఈనాడు,హైదరాబాద్‌, న్యూస్‌టుడే, రాయదుర్గం: గచ్బిచౌలి టెలికాంనగర్‌లోని ఓ వ్యాపారి ఇంట్లో కాపలాదారులుగా పనిచేస్తూ యజమాని ఇంటికే భారీ కన్నం వేసిన నేపాలీ దంపతులు లంకా బహదూర్‌, ఖద్కే పవిత్రలను రాయదుర్గం పోలీసులు అరెస్ట్‌ చేశారు. 1.10 కిలో బంగారు ఆభరణాలు, రూ.7.23 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర శనివారం తెలిపారు. బీరం గోవిందరావు ఇంట్లో పనిచేస్తున్న వీరిద్దరూ ఈనెల 18న తమ యజమాని, అతడి కుటుంబీకులు శ్రీశైలం వెళితే... అదే రోజు బంగారు ఆభరణాలు, నగదుతో ఉడాయించారని వివరించారు. నిందితులను అరెస్టు చేసేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను నియమించామని, వారి ఫొటోలను దిల్లీలో ఉంటున్న తన స్నేహితుడు, పోలీస్‌ ఉన్నతాధికారి సాయంతో సరిహద్దు భద్రత దళాలకు పంపించి పట్టుకోవాలంటూ అభ్యర్థించామని పేర్కొన్నారు. షోలాపూర్‌లో ఉన్నట్టు గుర్తించి శనివారం అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.

ఫేస్‌బుక్‌ పరిచయం..

నేపాల్‌లోని కాలికోట్‌ జిల్లా ఖందచక్ర నగర్‌ పాలికకు చెందిన లంకా బహదూర్‌ సాహీ అలియాస్‌ లక్ష్మణ్‌ ఐదో తరగతితో చదువు మానేశాడు. 18 ఏళ్ల క్రితం ముంబయికి వచ్చాడు. హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో పనిచేస్తూ 2012లో మళ్లీ నేపాల్‌కు వెళ్లాడు. రీతాను పెళ్లిచేసుకున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలతో తిరిగి ముంబయి చేరుకున్నాడు. లాక్‌డౌన్‌ వేళ కుటుంబంతో కలిసి నేపాల్‌కు వెళ్లి వ్యవసాయం చేశాడు. గతేడాది ఫేస్‌బుక్‌ ద్వారా పవిత్ర ఖడ్కే లక్ష్మణ్‌కు పరిచయయ్యింది. అప్పటికే ఆమె భర్తను వదిలేసింది. ఆమెకు తొమ్మిదేళ్ల కుమారుడున్నాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుని ఐదు నెలల క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. గోవిందరావు వద్ద గతంలో పనిచేసిన నేపాలీ యామ్‌లాల్‌ ద్వారా ఆ ఇంట్లో పనిలో చేరారు.

ఇలా దొరికిపోయారు...

నేపాలీ దంపతులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.. పోలీసులు తమను పట్టుకునేందుకు నేరుగా నేపాల్‌కు వెళ్తారని భావించిన లక్ష్మణ్‌, ఖద్కేలు అక్కడికి వెళ్లకుండా ముంబయికి వెళ్లారు. మళ్లీ పోలీసులు వస్తారన్న అనుమానంతో షోలాపూర్‌ వెళ్లాలనుకున్నారు. మూడురోజుల క్రితం షోలాపూర్‌లో మకాం వేశారు. నిందితుల మనస్తత్వాన్ని అంచనా వేసిన పోలీసులు ఒక బృందాన్ని నేపాల్‌కు పంపించారు. మరో రెండు బృందాలను ముంబయి, షోలాపూర్‌ ప్రాంతాలకు వెళ్లమన్నారు. నేపాలీయులు ఉంటున్న ప్రాంతాల్లో విచారిస్తుండగా... శనివారం ఉదయం లక్ష్మణ్‌, ఖద్కేలు కనిపించారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్‌కు తరలించారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా నిలిచిన పోలీసు కానిస్టేబుళ్లు ఆనంద్‌గౌడ్‌, ఆనంద్‌రెడ్డి, అశోక్‌ను కమిషనర్‌ ప్రశంసించి నగదు పురస్కారాలు అందజేశారు. డీఐలు లాల్‌మాదర్‌, బాలరాజ్‌, ఇన్‌స్పెక్టర్‌ యాదయ్య తదితరులకూ సీపీ పురస్కారాలు అందజేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని