కస్తూర్భా. ఉన్నతికి దూరమేనా..!
eenadu telugu news
Updated : 17/10/2021 03:31 IST

కస్తూర్భా. ఉన్నతికి దూరమేనా..!

స్థాయి పెంపులో జిల్లాకు మొండిచేయి

అవకాశం కల్పించాలని కోరుతున్న తల్లిదండ్రులు

న్యూస్‌టుడే, పరిగి, బొంరాస్‌పేట

ఇటీవల పదో తరగతి పూర్తిచేసిన బాలికలు

పేదింటి బాలికలు ఉన్నత విద్యావంతులు కావాలనే లక్ష్యంతో ప్రభుతం కస్తూర్బా విద్యాలయాలను (కేజీబీవీ) ఏర్పాటుచేస్తోంది. ఇవి ఆశించిన ఫలితాలను చక్కగా అందిస్తున్నాయి. విద్యార్థుల సంఖ్య, ఆయా ప్రాంతాల అవసరం దృష్ట్యా వీటి స్థాయిని (ఇంటర్‌ వరకు) పెంచుతున్నారు (అప్‌గ్రేడ్‌). రాష్ట్ర వ్యాప్తంగా కొన్నింటిలో ఇంటర్‌ విద్యను అమలు చేసేందుకు అప్‌గ్రేడ్‌ చేస్తున్నటుల ఇటీవలే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ప్రకటించారు. దీంతో తమ పిల్లలకు కూడా ఈ అవకాశం దక్కుతుందని జిల్లా విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆశలు పెరిగినా చివరకు ఒక్కటీ ఉన్నతికి నోచుకోక పోవడంతో నిరాశే మిగిలింది. ఇంటర్‌ అందుబాటులో లేకపోవడంతో పేదింటి పిల్లలకు ఉన్నత చదువులు దూరమయ్యే వీలుందని ఈ విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. దీనికి సంబంధించి ‘న్యూస్‌టుడే’ కథనం.

ఈసారీ 3200 మందిపైగా...

18 గ్రామీణ మండలాలు 566 పంచాయతీల పరిధిలో ప్రాథమిక 748, ప్రాథమికోన్నత 118, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు 156 ఉండగా 90,496 మంది విద్యార్థులు చదువుతున్నారు. జిల్లా అక్షరాస్యత సగటున 63 శాతం ఉండగా గిరిజన జనాభా అధికంగా ఉన్న కుల్కచర్ల మండలంలో 54.28 శాతంగా ఉంది. జిల్లా అచ్చంగా గ్రామీణ ప్రాంతం కావడం, తల్లిదండ్రుల అమాయకత్వం తదితర కారణాలతో విద్యాభివృద్ధి ఆశించినంతగా జరగడం లేదు. అందులోనూ బాలికలే దూరమవుతున్నారు. అక్షరాస్యతను పెంచేందుకు ప్రత్యేక కృషి చేస్తున్న ప్రభుత్వం జిల్లాలోని కేజీబీవీల్లో ఇంటర్‌ తరగతులు ప్రారంభించాలని కోరుతున్నారు. ఈసారి కూడా 3200 మందికి పైగా బాలికలు పదో తరగతిలో చేరనున్నారు.

నస్కల్‌ కేజీబీవీ


సదుపాయాల కల్పనతో ఆదరణ

ర్థికంగా వెనుకబడిన వారు, మధ్యలో చదువు మానేసిన పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాలనే ఉద్దేశంతో కేజీబీవీలను నెలకొల్పుతున్నారు. అన్ని సదుపాయాలను సమకూర్చి విద్యాభ్యాసాన్ని అందిస్తుండటంతో వీటిలో చేర్పించేందుకు తల్లిదండ్రులు, సంరక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. అదే సమయంలో దశల వారీగా వీటి స్థాయిని ప్రభుత్వం పెంచుతోంది. ఫలితంగా నిరుపేద బాలికల భవిష్యత్తు బంగరు బాటలు పడుతున్నాయి. జిల్లాలోని తాండూరు, పరిగి, వికారాబాద్‌, కొడంగల్‌ నియోజకవర్గాల పరిధిలో 18 కస్తూర్బా గురుకుల పాఠశాలలు పనిచేస్తున్నాయి. వీటి ప్రారంభ సమయంలో రెండు కేజీబీవీలను ప్రభుత్వం ఇంటర్‌ వరకు ప్రారంభించి రెండేళ్ల క్రితం మరో మూడింటిని అప్‌గ్రేడ్‌ చేసింది. దీంతో వీటి సంఖ్య ఐదుకు చేరుకున్నాయి. అంతటితో వీటి ఉన్నతి ఆగిపోయింది.


పెళ్లి పీటలెక్కిస్తున్నారు

జిల్లాలో ప్రస్తుతం కుల్కచర్ల, దోమ, కొడంగల్‌, మోమిన్‌పేట్‌, వికారాబాద్‌, యాలాల్‌, తాండూరు కేజీబీవీల్లోనే ఇంటర్‌ వరకు కొనసాగుతుండగా మిగతా చోట్ల బాలికలకు అవకాశం లేకుండా పోయింది. కరోనా ప్రభావం చూపినా ఈడాది పదో తరగతిలో సుమారు మూడువేలకు పైగా విద్యార్థులు ఇంటర్‌కు అర్హత సాధించారు. వీరంతా వివిధ గ్రామాలు, గిరిజన తండాలకు చెందిన వారు. ఇంటర్‌లో చేర్పించడం వారికి తలకుమించిన భారంగా మారుతోంది. చదువుతున్న విద్యాలయంలోనే ఇంటర్‌కు అవకాశం ఉంటే ఎలాంటి సమస్య ఉత్పన్నం అయ్యేది కాదని పలువురు పేర్కొంటున్నారు. ఇంటర్‌ చదవాలంటే దూర ప్రాంతాలకు అవస్థలు పడి వెళ్లక తప్పదు. ఇది పేద పిల్లలకు సాధ్యమయ్యేది కాదు.ఈ సమస్యలన్నీ ఎందుకని తల్లిదండ్రులు వారికి బాల్య వివాహాలు చేస్తున్నారు. గతేడాది వరకు పరిగిలో డిగ్రీ కళాశాల లేకపోవడంతో ఇంటర్‌ పూర్తి చేసిన అనంతరం అనేక మంది తల్లిదండ్రులు వారికి వివాహాలు చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని