Published : 24/01/2021 02:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆగేనా... అడుగు పడేనా?

● సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

● తొలిదశ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఎస్‌ఈసీ

● మూడు రోజులు సెలవుపై వెళ్లిన కలెక్టర్‌

● ఎన్నికల నిర్వహణపై అధికారుల సహాయ నిరాకరణ

వీడియో సమావేశానికి హాజరుకాని జిల్లా అధికారులు.. ఖాళీ కుర్చీలతో వీసీ గది

ఈనాడు డిజిటల్‌ - కర్నూలు: పల్లె పోరుకు రాష్ట్ర ఎన్నికల సంఘం తన పని తాను చేసుకుంటూ వెళుతోంది. ప్రకటించిన విధంగానే శనివారం ఉదయం పది గంటలకు తొలి దశ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నామినేషన్ల స్వీకరణ ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు జరుగుతుందన్నారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారని ఎన్నికల సంఘం ప్రకటించింది. 5వ తేదీ ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తామని, అదేరోజు సాయంత్రం 4 గంటల నుంచి ఫలితాల లెక్కింపు ఉంటుందన్నారు. ఎన్నికలు జరిగితే జిల్లాలో మొదటి విడతలో ఆదోని డివిజన్‌ పరిధిలో 14 మండలాల్లోని 292 పంచాయతీలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు.

*కరోనా టీకా పంపిణీ సమయంలో ఎన్నికల నిర్వహణ కష్టమంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సోమవారం దీనిపై తీర్పు వెలువడనున్న నేపథ్యంలో అంతటా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఎన్నికల సంఘం హైకోర్టు తీర్పు అనుసరించి పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అడుగులు వేస్తోంది. ముందుగా చెప్పినట్లుగానే తొలిదశ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మరోవైపు రెవెన్యూ, ఎన్జీవో సంఘాలు ఎన్నికల విధులు నిర్వహించలేమంటూ ఇప్పటికే ప్రకటించాయి.

తొలి విడత

ఆదోని(రెవిన్యూ డివిజన్‌): ఆలూరు, చిప్పగిరి, దేవనకొండ, హాలహర్వి, హోళగుంద, ఆస్పరి, కోసిగి, కౌతాళం, మంత్రాలయం, పెద్దకడబూరు, ఆదోని, గోనెగండ్ల, నందవరం, ఎమ్మిగనూరు(మండలాలు).

రెండో విడత

నంద్యాల: ఆళ్లగడ్డ, చాగలమర్రి, దొర్నిపాడు, రుద్రవరం, శిరివెళ్ల, ఉయ్యాలవాడ, గోస్పాడు, నంద్యాల, బండి ఆత్మకూరు, మహానంది

కర్నూలు: ఆత్మకూరు, వెలుగోడు

మూడో విడత

నంద్యాల: బనగానపల్లి, కోవెలకుంట్ల, కొలిమిగుండ్ల, అవుకు, సంజామల, గడివేముల, పాణ్యం

కర్నూలు: కల్లూరు, ఓర్వకల్లు, సి.బెళగల్‌, గూడూరు, కోడుమూరు, కర్నూలు

నాలుగో విడత

ఆదోని: మద్దికెర, పత్తికొండ, తుగ్గలి

కర్నూలు: జూపాడుబంగ్లా, కొత్తపల్లి, మిడుతూరు, నందికొట్కూరు, పగిడ్యాల, పాములపాడు, బేతంచెర్ల, డోన్‌, ప్యాపిలి, కృష్ణగిరి, వెల్దుర్తి

సెలవులో కలెక్టర్‌

జిల్లా సర్వోన్నతాధికారి వీరపాండియన్‌ ఈ నెల 25 వరకు సెలవు పెట్టారు. శనివారం నుంచి మూడు రోజులపాటు సెలవులో ఉండనున్నారు. ఎన్నికల నిర్వహణపై కలెక్టర్ల సహాయ నిరాకరణలో తొలి అడుగు కర్నూలు నుంచే పడిందని చర్చనీయాంశంగా మారింది. అయితే జిల్లా కలెక్టర్‌కు జ్వర లక్షణాలు కనిపించడంతోనే సెలవు పెట్టినట్లు కార్యాలయ వర్గాలు ధ్రువీకరించాయి. ఈ మూడు రోజులపాటు జేసీ రాంసుందర్‌రెడ్డికి ఇన్‌ఛార్జి కలెక్టర్‌గా బాధ్యతలిచ్చారు.

ఎన్నికల సంఘం వీడియోకాన్ఫరెన్స్‌కు గైర్హాజరు...

రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా అధికారులతో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు వీడియో సమావేశం ఏర్పాటు చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో టీకా, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించడానికి వేదికగా వీసీకి హాజరవ్వాలని సూచించారు. ఇన్‌ఛార్జి కలెక్టర్‌ రాంసుందర్‌రెడ్డి, ఎస్పీ, డీపీవో ఎవరూ ఈ సమావేశానికి హాజరుకాలేదు. ఇన్‌ఛార్జి కలెక్టర్‌ బాధ్యతలు చేపట్టిన జేసీ రాంసుందర్‌రెడ్డి అదే సమయంలో మండలస్థాయి రెవెన్యూ అధికారులు, సర్వేయర్లతో మినీట్రక్కులు, భూహక్కు, భూ రక్ష పథకం, రీసర్వేలపై వీసీ ద్వారా సమీక్షలో పాల్గొన్నారు.

ప్రాణాలు పణంగా పెట్టి ఎన్నికలు నిర్వహించలేం

ఉద్యోగులకు కరోనా టీకా ఇంకా రాలేదు. రెండు డోసులు వేసిన తర్వాత ఎన్నికలు నిర్వహించమంటే ఇబ్బంది లేదు. ఆగమేఘాలపై ప్రాణాలు పణంగా పెట్టి ఎన్నికల్లో పాల్గొనలేం. రాష్ట్ర నాయకత్వం ఆదేశిస్తే అవసరమైతే సమ్మెకు దిగుతాం. - వెంగళరెడ్డి, ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు, ఐకాస ఛైర్మన్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని