నిబంధనలు ఉండగ.. దీపాల పండగ..
eenadu telugu news
Published : 26/10/2021 05:16 IST

నిబంధనలు ఉండగ.. దీపాల పండగ..

హరిత టపాసులపై అవగాహన ఏదీ..?

నల్గొండ అర్బన్‌, న్యూస్‌టుడే: దీపావళి పండగకు టపాసులు కాల్చొచ్చు.. ఆకాశాన్ని తాకేలా రాకెట్లు ఎగరేయొచ్చు.. కానీ కొవిడ్‌ మహమ్మారి కారణంగా ఈసారీ టపాసులకు దూరంగా ఉండాలని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో గాలిలో నాణ్యత తక్కువున్నట్లు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ గతేడాది ఉత్తర్వులు వెలువరించిన విషయం విదితమే. టపాసుల విక్రయాలు నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే ఈసారి అలాంటి ఆదేశాలు ఇప్పటివరకు రాలేదని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు.

అనుమతి తీసుకుంటేనే..
టపాసుల విక్రేతలు ఆన్‌లైన్‌లో వారం ముందు దరఖాస్తు చేసుకోవాలి. పోలీస్‌, అగ్నిమాపక, విద్యుత్తు శాఖల అనుమతి తప్పనిసరి. చివరగా రెవెన్యూ శాఖ నుంచి టపాలసులు విక్రయించే అనుమతి లభిస్తుంది. ప్రజాప్రతినిధులు, అధికారుల అండదండలతో కొందరు వ్యాపారులు కిరాణ దుకాణాల్లోనే బాణసంచా విక్రయిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో అనుమతులు ఇచ్చే శాఖల సిబ్బందికి మామూళ్లు ఇస్తూ గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు సాగిస్తున్నారు. కాలుష్యం వెదజల్లని హరిత టపాసులపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ ప్రాంతాల్లో మాత్రమే అమ్మకాలు
నల్గొండలోని ఎన్జీకళాశాల గ్రౌండ్స్‌, మిర్యాలగూడలో ఎన్నెస్పీ క్యాంపు గ్రౌండ్‌, దేవరకొండలో డిండి రోడ్డు వెంట ఖాళీస్థలం, సూర్యాపేటలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల గ్రౌండ్‌, కోదాడలో రామ్మూర్తినగర్‌, హుజూర్‌నగర్‌లో ఎమ్మెల్యే కాలనీలోని ఖాళీ స్థలాలు, భువనగిరి శివారు ఖాళీస్థలాల్లో బాణసంచా అమ్మకాలకు అధికారులు అనుమతులిచ్చారు. పెద్ద గ్రామపంచాయతీల్లో నివాస గృహాలు లేని ఖాళీ స్థలాల్లో దుకాణాలు ఏర్పాటు చేసుకోవచ్చు.

నిబంధనలు తప్పనిసరి..
కొవిడ్‌ కారణంగా స్వచ్ఛందంగా ఆంక్షలు విధించుకోవడంతో పాటు నిబంధనలు పాటించాలి. బాణసంచా దుకాణాలను జీఏ షీట్లతోనే ఏర్పాటు చేయాలి. అలంకరణ కోసం వస్త్రాలను వినియోగించకపోవటం శ్రేయస్కరం. విద్యుత్తు పరికరాలు, తీగలు నాణ్యతంగా ఉండాలి. దుకాణాలకు మధ్య మూడు నుంచి ఐదు అడగుల దూరం అవసరం. దుకాణాలు ఎదురెదురు ఉండొద్దు. ప్రతి దుకాణదారు నాలుగు ఇసుక బకెట్లు, 200 లీటర్ల నీళ్ల డ్రమ్స్‌, రెండు ఫైర్‌ ఎక్స్‌టింగ్విషర్స్‌ను అందుబాటులో ఉంచుకోవాలి. దుకాణాల వద్ద బాణసంచా కాల్చి ప్రదర్శించడానికి వీల్లేదు.


అప్రమత్తత అవసరం: యజ్ఞనారాయణ, ఉమ్మడి జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి

పాసుల దుకాణాలకు అనుమతుల మంజూరులో ఇబ్బందులు ఎదురైనా, లంచాలు అడిగినా చరవాణి నంబర్‌ 87126 99152 కు ఫిర్యాదు చేయొచ్చు. పెద్దవాళ్ల పర్యవేక్షణలో చిన్నారులు బాణసంచా కాల్చటం శ్రేయస్కరం. టపాసులు కాల్చే సమయంలో కాటన్‌ దుస్తులు ధరించాలి. నీళ్లు దగ్గర ఉండేలా చూసుకోవాలి. తలుపులు, కిటికీలు మూసేయాలి. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చాలి. నిబంధనలు విస్మరిస్తే చర్యలు తప్పవు. దీపావళి పండుగ రోజు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు విధులు నిర్వర్తిస్తారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని