ఆగిన అభివృద్ధి..!
eenadu telugu news
Published : 26/10/2021 04:11 IST

ఆగిన అభివృద్ధి..!

నేడు డీఆర్‌సీ సమావేశం

అసంపూర్తిగా వంశధార రిజర్వాయర్‌

జిల్లా అభివృద్ధికి ఎంతో ఉపయోగపడే జిల్లా సమీక్ష మండలి (డీఆర్‌సీ) సమావేశం నేడు జరగనుంది. దాదాపు 38 నెలల తర్వాత, వైకాపా అధికారంలోకి వచ్చాక ఇప్పుడు తొలిసారిగా ఈ సమావేశం నిర్వహించనున్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో ఈ సమావేశం జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో జరగనుంది. జిల్లా అభివృద్ధిపై, సమస్యలు వాటికి పరిష్కారాలు, సాగు, తాగునీటి సమస్యలు, వివిధ శాఖల పనితీరు, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై జిల్లా ప్రజాప్రతినిధులంతా కలిసి చర్చిస్తారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పేరుకుపోయిన ప్రధాన సమస్యలపై ప్రత్యేక కథనం.

- ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం

వంశధార ప్రాజెక్టు జిల్లాకి జీవనాడి వంటిది. 20 మండలాల్లో మొత్తం 2.5 లక్షల ఎకరాల ఆయుకట్టు లక్ష్యంగా వంశధార ప్రాజెక్టుకి ఫేజ్‌-2లో స్టేజ్‌-2 పనులు జరుగుతున్నాయి. ఇప్పటికి 89 శాతం పనులు పూర్తయ్యాయి. బిల్లులు సకాలంలో చెల్లింపులు జరగకపోవడంతో గడచిన సంవత్సర కాలంగా పనులు మరీ నత్తనడకన సాగుతున్నాయి. సర్దార్‌ గౌతు లచ్చన్న తోటపల్లి కాలువల ద్వారా జిల్లాలో 31 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలి. గత ప్రభుత్వం రూ.119 కోట్లతో తోటపల్లి ఆధునికీకరణ పనులు ప్రారంభించింది. 12శాతం పనులు మాత్రమే జరిగాయి. బిల్లులు చెల్లింపులు లేకపోవడంతో పనులు నిలిచాయి. ప్రణాళిక లేకుండా పనులు చేయడం వల్ల తీవ్ర జాప్యం జరుగుతోంది.

జైకా నిధులతో చేపట్టినా...! రూ.112 కోట్ల జైకా నిధులతో 2018లో ఆధునికీకరణ పనులు చేపట్టారు. పనులు చాలా నెమ్మదిగా జరిగాయి. దీనిపై 37 వేల ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉంది. ప్రణాళిక లోపం వల్ల పనులు ఆలస్యమవుతున్నాయి.


* కిడ్నీ వ్యాధులతో కొట్టుమిట్టాడుతున్న ఉద్దానం ఏడు మండలాలకు వంశధార నుంచి తాగునీటి సరఫరాకి రూ.700 కోట్లు కేటాయించి పనులు చేస్తున్నారు. మధ్యలో పనులు నిలిచిపోవడం, నెమ్మదించడం వల్ల మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నాయి. ఎప్పుడు తమకు స్వచ్ఛమైన తాగునీరు అందుతుందా అని ఉద్దానం మండలాల ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.

* పలాసలో ఏర్పాటు చేస్తున్న కిడ్నీ ఆసుపత్రి, రీసెర్చ్‌ సెంటర్‌ పనులు ప్రారంభించి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆశించిన మేర పనులు జరగలేదు. అధికారులు, గుత్తేదారు మధ్య సమన్వయ లోపం, బిల్లుల చెల్లింపుల్లో జాప్యం కారణంగా ముందుకు సాగడం లేదు. ఫలితంగా కిడ్నీ నిర్ధారిత పరీక్షలకు రోగులు శ్రీకాకుళం, విశాఖపట్నం వెళ్లాల్సి వస్తోంది.


పూడికతో సామర్థ్యం కోల్పోతున్న గొట్టా ...

* గొట్టా బ్యారేజీలో దాదాపు 20 లక్షల క్యూబిక్‌ మీటర్ల పూడిక ఉన్నట్లు అధికారులు లెక్కలు వేశారు. దీనివల్ల 30 శాతం మేర నీటి నిల్వ సామర్థ్యం కోల్పోతోంది. ఎడమ కాలువ ఆధునికీకరణ చేపట్టకపోవడంతో టెక్కలి, పలాస, వజ్రపుకొత్తూరు, నందిగాం తదితర శివారు మండలాలకు సాగునీరు అందడం లేదు. కుడి కాలువకు రూ.80 కోట్ల విలువైన పనులు పెండింగులో ఉండిపోయాయి. ఇప్పటికీ దానికి గుర్తింపు ఇవ్వకపోవడంతో నీటి తీరువా వసూలు, నిర్వహణకు నిధులు రావడం లేదు.

* ప్రధానమైన పాలకొండ-రాజాం, పాలకొండ-ఆమదాలవలస-శ్రీకాకుళం-కళింగపట్నం రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. శ్రీకాకుళం-ఆమదాలవలస రహదారి విస్తరణకు నిధులు మంజూరైనా పనులు జరగడం లేదు. గ్రామీణ రహదారులన్నీ అధ్వానంగా తయారయ్యాయి.

* ఇసుక నిల్వ చేయడానికి స్టాక్‌ యార్డుల గుర్తింపు, నిల్వ సక్రమంగా జరగడం లేదు.అధికారులు, జెపీ సంస్థ ప్రతినిధుల మధ్య సమన్వయ లోపం వల్ల సకాలంలో అందని దుస్థితి నెలకొంది.


తవ్వి వదిలేసిన కాలువ

అటకెక్కిన నదుల అనుసంధానం.. వంశధార వరద నీటిని నారాయణపురం ఆనకట్టకు మళ్లించడానికి నిర్దేశించింది అనుసంధాన కాలువ. దీని వల్ల రబీ పంటకూ నీరు ఇవ్వొచ్ఛు రూ.145.34 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పనులు 80 శాతం పూర్తయి నిలిచిపోయాయి. ఎనిమిది నెలలుగా గడువు పెంచుకుంటూ పోతున్నారే తప్ప ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేకపోతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని