ఆచార్య హాజరేదీ - Nizamabad - EENADU
close

గురువారం, సెప్టెంబర్ 19, 2019

ప్రధానాంశాలు

ఆచార్య హాజరేదీ

లక్షల్లో వేతనాలు.. రావడానికి ఆపసోపాలు

తెవివి ఉద్యోగుల్లో కొరవడిన సమయపాలన

న్యూస్‌టుడే, తెవివి క్యాంపస్‌ (డిచ్‌పల్లి)

ఆచార్యుడి నెల వేతనం రూ. 1.50 లక్షలు.. సహ ఆచార్యుడికి రూ. 1.20 లక్షలు, సహాయ ఆచార్యుడికి రూ. 65-80 వేలు. ఇవి తెలంగాణ విశ్వవిద్యాలయంలో బోధన ఉద్యోగులు పొందుతున్న వేతనాలు. ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీ, డీఏ పెంపు అమల్లోకి వస్తే ఆచార్యుడికి రూ. 2.40 లక్షలు, సహ ఆచార్యుడికి రూ. 2.20 లక్షలు, సహాయ ఆచార్యుడికి రూ. 1.10 లక్షలు వచ్చే అవకాశం ఉంది. నెలకు రూ. రెండు కోట్లు వర్సిటీలో ఉద్యోగుల జీతభత్యాలకు చెల్లిస్తుండడం గమనార్హం. ఒక ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకు లేని వేతనాలు వర్సిటీ ఆచార్యులకు ప్రభుత్వం చెల్లిస్తోంది. సమాజంలో ఎంతో గౌరవం ఉంటుంది. ఆచార్యులు తమ బాధ్యతను గుర్తెరిగి అందరికీ ఆదర్శంగా నిలవాల్సి ఉంటుంది. కానీ, తెవివిలో కొంత మంది ఆచార్యులు విధులకు సకాలంలో హాజరుకారని, వారానికోసారి వచ్చి రిజిష్టర్‌లో సంతకాలు చేసి వేతనాలు తీసుకుంటూ వృత్తిని అబాసుపాలు చేస్తున్నారనే విమర్శ ఉంది. ఇటీవల వర్సిటీ ఇన్‌ఛార్జి ఉపకులపతిగా బాధ్యతలు తీసుకున్న ఐఏఎస్‌ అధికారి అనిల్‌కుమార్‌ దృష్టికి ఆఈ విషయం వచ్చింది. ఆయన ఆదేశాలతో వర్సిటీ ఉద్యోగులు ఉదయం 10 గంటలకు విధులకు వచ్చి సాయంత్రం 4 వరకు ఉండాల్సిందేనని, అనుమతి లేకుండా సెలవు పెట్టడం, వర్సిటీ వదిలి వెళ్లరాదని రిజిస్ట్రార్‌ బలరాములు శనివారం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వర్సిటీ ఉద్యోగుల పనితీరుపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

ఆచార్యుడు నిత్యం సకాలంలో విధులకు హాజరై పాఠాలు బోధించడంతో సరిపోదు. రీసెర్చ్‌ పేపర్లు, ఆర్టికల్స్‌ రాయాలి. జర్నల్స్‌ రాసి జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో ప్రచురించాలి. కొత్త విషయాలు ఆవిష్కరించి సెమినార్లు, కార్యశాలలు నిర్వహించి విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించాలి. వీటితో పాటు వివిధ ప్రాంతాల్లో జరిగే కాన్ఫరెన్సుల్లో పాల్గొని తమ ఆవిష్కరణలతో వర్సిటీకి పేరు, ప్రఖ్యాతలు తేవాలి. కానీ, తెవివిలో పని చేస్తున్న ఆచార్యుల్లో చాలా మంది వీటిపై దృష్టి పెట్టడం లేదని తోటి ఆచార్యులే బహిరంగంగా విమర్శిస్తుండడం గమనార్హం. ఆచార్యులు తప్పక పీహెచ్‌డీ పట్టా పొంది ఉండాలని యూజీసీ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఉద్యోగంలో చేరిన నాలుగైదేళ్ల తర్వాతైనా డాక్టరేట్‌ సాధించాల్సి ఉంటుంది. కానీ, వర్సిటీలో చేరి పదేళ్లు గడుస్తున్నా కొందరికి పీహెచ్‌డీ పట్టా లేదనంటే వారి పనితీరును అర్థం చేసుకోవచ్ఛు

బయోమెట్రిక్‌ అమలేదీ?

ఉద్యోగుల హాజరుకు బయెమెట్రిక్‌ విధానం అమల్లో ఉంది. ఉదయం విధులకు రాగానే వేలిముద్ర వేయాలి. తిరిగి సాయంత్రం వెళ్లేటపుడు మళ్లీ వేయాల్సి ఉంటుంది. కానీ, ఈ విధానం అమలు కావడం లేదు. ఉద్యోగుల ఒత్తిడితో ఉన్నతాధికారులు దీనిని పట్టించుకోవడమే మానేశారు. రిజిస్టర్లో పెట్టిన సంతకాలనే పరిగణనలోకి తీసుకొని వేతనాలు చెల్లిస్తున్నారు. విధులకు వస్తున్న ఆచార్యులు కనీసం తరగతి గదుల ముఖం చూడడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్ఛు రాగానే రిజిస్టర్లలో సంతకాలు పెట్టి ఒకచోట చేరి పిచ్చాపాటి కబుర్లు, వర్గపోరుతో వర్సిటీ ప్రతిష్ఠను దిగజారుస్తున్నారు. ఫలితంగా జీవితంపై ఎన్నో ఆశలతో సీట్లు పొందిన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత ఆచార్యులపై ఇప్పటి వరకు క్రమ శిక్షణ చర్యలు లేవు. శనివారం వచ్చిందంటే చాలా మంది హైదరాబాద్‌ బయలుదేరేందుకు మధ్యాహ్నమే సిద్ధమవుతారు.

దక్షిణ ప్రాంగణంపై పర్యవేక్షణ కరవు

భిక్కనూర్‌ దక్షిణ ప్రాంగణంలో కొందరు ఆచార్యులు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. ఈ క్యాంపస్‌పై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడంతో ఉద్యోగులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ రెండు విభాగాల్లో శాశ్వత బోధకులు వారానికి ఒక్కసారే వస్తున్నారని, ఒప్పంద అధ్యాపకులతో కాలం వెళ్లదీస్తున్నారనే విమర్శ ఉంది. ఈ ప్రాంగణం హైదరాబాద్‌కు సమీపంగా ఉండడంతో ఆచార్యులు ఇష్టానుసారంగా విధులకు వచ్చి వెళ్తున్నారు.

పాలన గాడిలో పడేనా?

వర్సిటీలో పరిపాలన గాడితప్పింది. ప్రస్తుతం ఇన్‌ఛార్జి వీసీగా ఐఏఎస్‌ అధికారి అనిల్‌కుమార్‌ వచ్చారు. ఆయనకు పొట్టిశ్రీరాములు యూనివర్సిటీ ఇన్‌ఛార్జి బాధ్యతలు కూడా ఉన్నాయి. పైగా వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌గా, దేవాదాయశాఖ కమిషనర్‌, రాష్ట్ర పోలీసు బోర్డు అదనపు బాధ్యతలతో తీరిక లేకుండా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నెలలో రెండు, మూడు సార్లు వర్సిటీకి వచ్చే వీలుంది. పూర్తికాలపు వీసీ లేకపోవడంతో రిజిస్ట్రార్‌ బలరాములు పాత్ర కీలకంగా మారింది. రిజిస్ట్రార్‌ మరింత క్రియాశీలకంగా పనిచేయాల్సిన తరుణం. బోధన, బోధనేతర ఉద్యోగుల్ని సమన్వయం చేసుకొని అన్నీతానై కీలక నిర్ణయాలు తీసుకోవడం రిజిస్ట్రార్‌కు పెద్ద సవాలే. అయితే ఉద్యోగులు సమయపాలన పాటించేందుకు ఉత్తర్వులు ఇవ్వడంలో ఆయన సఫలీకృతుడయ్యారు. ఆచార్యులు ఎంత మేరకు పాటిస్తారనేది చూడాలి.

రాజధాని నుంచి రాకపోకలు

కొందరు ఆచార్యులు రాజధాని నుంచి వచ్చిపోతుంటారు. ఈ సంస్కృతి చాలా కాలంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌ నుంచి విధులకు వచ్చి వెళ్లడాన్ని ఇన్‌ఛార్జి వీసీ తప్పుబట్టారు. ఉదయం 11:30 గంటల తర్వాత విధులకు వస్తుండటం ఇక్కడ నిత్యకృత్యం. కొందరు ఆచార్యులైతే వారం, పది రోజులకోసారి విధులకు వచ్చి రిజిష్టర్లో సంతకాలు పెడుతున్న విషయం వీసీ దృష్టికి వచ్చింది. చెప్పా పెట్టకుండా సెలవులు పెడుతున్నారు. నిజానికి సెలవు కోసం ముందస్తుగా సంబంధిత విభాగాధిపతి సంతకం తీసుకొని ప్రిన్సిపల్‌ అనుమతి పొందాలి. ఈ నిబంధనను ఆచార్యులు అతిక్రమిస్తున్నారనే అపవాదు ఉంది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.