అరుదైన పరిశోధన కేంద్రానికి ఆరవై ఏళ్లు - Hyderabad - EENADU
close

ఆదివారం, సెప్టెంబర్ 22, 2019

ప్రధానాంశాలు

అరుదైన పరిశోధన కేంద్రానికి ఆరవై ఏళ్లు

నేటి నుంచి అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ ఓరియంటల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ఉత్సవాలు
ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు
న్యూస్‌టుడే, నారాయణగూడ

స్వాతంత్య్రోద్యమంలో జవహర్‌లాల్‌నెహ్రూతో కలిసి నడిచిన సమరయోధుడు, భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలనా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ స్మారకార్థం 1959లో హైదరాబాద్‌ నగర నడిబొడ్డులోని పబ్లిక్‌గార్డెన్స్‌లో మసీదు ప్రాంగణంలో ‘అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ ఓరియంటల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌’ నెలకొల్పారు. అరుదైన పరిశోధన గ్రంథాలకు, పుస్తకాలకు నెలవు ఇది. అప్పటి కేంద్ర శాస్త్రపరిశోధన, సాంస్కృతిక శాఖ మంత్రి హుమాయూన్‌ కబీర్‌ ప్రారంభించారు. నవాబ్‌ మెహెదీ నవాజ్‌జంగ్‌ తొలి అధ్యక్షులుగా ఉన్నారు. ఈ కేంద్రాన్ని స్థాపించి ప్రస్తుతం అరవై ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ నెల 23 నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షురాలు డా.ఆష్రఫ్‌ రఫీ వెల్లడించారు.

వేల సంఖ్యలో పుస్తకాలు..
ఈ కేంద్రంలో ఉర్దూ, పర్షియన్‌, ఆంగ్లం, తెలుగు, సంస్కృత భాషల్లో అరుదైన పరిశోధన గ్రంథాలున్నాయి. భారతీయ రాజకీయాలు, పురాతన, మధ్యయుగం నాటి ప్రయాణికుల దృష్టిలో దక్కన్‌, గ్రామర్‌ ఆఫ్‌ ది దక్కనీ లాంగ్వేజ్‌, కాంట్రిబ్యూషన్‌ ఆఫ్‌ యూరోపియన్‌ టు హిందీ లాంగ్వేజ్‌ అండ్‌ లిటరేచర్‌ వంటి అనేక పరిశోధన గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి. 17,560 వరకు ఉర్దూ, తెలుగు, పర్షియన్‌, ఆంగ్ల, సంస్కృత భాషల్లో గ్రంథాలు, పుస్తకాలున్నాయి. సంస్కృత భాషలో తాళపత్ర గ్రంథాలు కనిపిస్తాయి. 1904లో అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ సూచన మేరకు తీర్చిదిద్దిన ‘ఉర్దూ ఎన్‌సైక్లోపీడియా’ కూడా ఇక్కడుంది. చరిత్ర పరిశోధకులు, సాహితీవేత్తలు, ఔత్సాహిక పాఠకులు ఈ గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని ఆమె చెబుతున్నారు.

ఎలాంటి లాభాపేక్ష లేకుండా..
ఈ కేంద్రం పరిశోధనలతోపాటు సమకాలీన సమస్యలపై ప్రత్యేక దృష్టిని సారిస్తుంది. ఆయా విషయాలపై సదస్సులు, చర్చాగోష్ఠులు, ప్రసంగ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంది. మహాత్మాగాంధీ, మౌలానా ఆజాద్‌, అరబిందోఘోష్‌ వంటి మహనీయుల స్మారకార్థం అనేక స్మారక ప్రసంగాలు, సదస్సులు నిర్వహించింది. 1962 నుంచి 1984 వరకు నలుగురు పరిశోధకులకు ఈ సంస్థ ద్వారా ఫెలోషిప్‌ ఇచ్చేవారు. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి గ్రాంట్‌లు ఆగిపోవడంతో వాటిని కూడా నిలిపివేసినట్లు ఆష్రఫ్‌ రఫీ చెప్పారు. 2011లో చివరగా ‘హిస్టరీ ఆఫ్‌ హైదరాబాద్‌’ పరిశోధన గ్రంథాన్ని రెండు భాగాలుగా ఈ కేంద్రం ద్వారా ప్రచురించినట్లుగా ఆమె వెల్లడించారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం చరిత్రను నిక్షిప్తం చేయాలనే తలంపుతోనే ఈ కేంద్రం పని చేస్తోంది.

ఈనెల 23 నుంచి స్వర్ణోత్సవాలు..
ఈనెల 23న ఇనిస్టిట్యూట్‌ ఉత్సవాలను విశ్రాంత ఐపీఎస్‌ అధికారి, ప్రభుత్వ సలహాదారు ఏ.కె.ఖాన్‌ ప్రారంభిస్తారని సంస్థ గౌరవ కార్యదర్శి, సంచాలకులు అహ్మద్‌ అలీ, గులామ్‌ యజ్దానీ తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షుడు ప్రొ.సులేమాన్‌ సిద్ధిఖీ ప్రధాన ప్రసంగం చేస్తారన్నారు. మణిశంకర్‌ అయ్యర్‌, కుష్వంత్‌సింగ్‌, సల్మాన్‌ ఖుర్షీద్‌ వంటి ప్రముఖులను ఆహ్వానించామన్నారు. ప్రముఖ పరిశోధకులు, సాహితీవేత్తలు సమర్పించే పరిశోధనా పత్రాలు, ప్రసంగాలను పుస్తక రూపంలో తీసుకువస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.