close

శుక్రవారం, డిసెంబర్ 13, 2019

ప్రధానాంశాలు

వెబ్ ప్రత్యేకం

విజ్ఞానం.. నిస్తేజం!

అభివృద్ధికి నోచుకోని గ్రంథాలయాలు

పేరుకుపోయిన రూ.14 కోట్ల బకాయిలు

నేటి నుంచి వారోత్సవాలు


గ్రంథాలయంలో పాఠకులు 

న్యూస్‌టుడే, సంగం : జిల్లాలో ప్రస్తుతం మొదటి శ్రేణి గ్రంథాలయాలు రెండు, రెండో శ్రేణి అయిదు, మూడో శ్రేణి 54 మొత్తం కలసి 61 ఉన్నాయి. వాటిలో దిన, వార, పక్ష, మాస పత్రికలతో పాటు 5,35,952 గ్రంథాలున్నాయి. వీటికి ఏటా 9,61,718 మంది పాఠకులు హాజరువుతున్నారు. 42,248 మంది సభ్యులున్నారు. ఇవన్నీ సక్రమంగా పనిచేయాలంటే 152 మంది సిబ్బంది అవసరం కాగా 49 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. 103 మంది కొరత ఉంది. 1996 సంవత్సరం నుంచి నూతన నియామకాలు లేవు. బాహ్యసేవల సిబ్బంది పరిమితంగా ఉన్నారు. దాంతో రోజువారీ నిర్వహణ అధ్వానంగా ఉంది.

మనుగడ కష్టం

స్వాతంత్య్రోద్యమంలో కీలక పాత్ర పోషించిన గ్రంథాలయాల నిర్వహణ బాధ్యతను స్థానిక సంస్థలకు అప్పగించారు. వాటి నుంచి లభించే పన్నుల రాబడితో ఇవి మనుగడ సాధించాల్సి ఉండగా.. అవి సక్రమంగా జమ కాకపోవడంతో మొక్కుబడి కేంద్రాలుగా కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గ్రంథాలయాల చట్టం 1960 సెక్షన్‌ 20(1) ప్రకారం స్థానిక సంస్థలు వసూలు చేసే ఇంటి పన్నులో నూటికి ఎనిమిది పైసల వంతున గ్రంథాలయ సంస్థకు చెల్లించాలి. ఇది అమలు కానందున జిల్లాలో 940 పంచాయతీలు, నెల్లూరు నగరపాలక సంస్థ, ఆత్మకూరు, కావలి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, నాయుడుపేట పురపాలక సంఘాల నుంచి దాదాపు రూ.14 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి.

అటకెక్కిన ఆన్‌ డిమాండ్‌ పథకం

నిరుద్యోగులు, విద్యార్థులు తమకు కావాల్సిన పుస్తకాలు, గ్రంథాలు అందుబాటులో లేకపోతే వాటి వివరాలను అక్కడ నమోదు చేస్తే వాటిని ప్రత్యేకంగా కొనుగోలు చేసి అందుబాటులో ఉంచే ఆన్‌ డిమాండ్‌ పథకం అటకెక్కింది. ఆన్‌లైన్‌ పుస్తక పఠనం సుదూర స్వప్నంగా ఉంది. సంగంలో టీవీ ఉన్నా ఇందుకు కనెక్షన్‌ లేదు. ఫైబర్‌ నెట్‌ కనెక్షను ఇస్తే ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి చర్యలు చేపడితే ఇంకా ఎక్కువ మంది పాఠకులు వచ్చే అవకాశముంది.

ఆర్థిక సంఘం నిధులిస్తే..: స్థానిక సంస్థల విద్యుత్తు బకాయిలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులు అందించి చేయూతనిస్తోంది. అలాగే గ్రంథాలయాల నిర్వహణకు చర్యలు చేపడితే వీటికి కొంతవరకు మేలు జరుగుతుంది. ఫలితంగా ప్రజలకు విజ్ఞానాన్ని అందిస్తాయి.

ఒకప్పుడు ఒక వెలుగు వెలిగాయి. నిత్యం వందలాది మందితో కళకళలాడాయి. పత్రికలు చదివేవారు కొందరు.. పుస్తకాల సారం ఒంట బట్టించుకొనేవారు మరికొందరు.. నవల పఠనంలో మునిగితేలేవారు ఇంకొందరు.. అలా గ్రంథ భాండాగారాలు వచ్చిపోయేవారితో సందడిగాఉండేవి. దాదాపు రెండు దశాబ్దాలుగా ఇవి కళ తప్పాయి. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాలు ఈనెల 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఏటా వీటిని మొక్కుబడిగానే నిర్వహిస్తున్నారు. ఫలితంగా వాటి స్థితిగతులు మెరుగు పడక నానాటికి అధ్వానంగా తయారవుతున్నాయి

దయనీయంగా భవనాలు

జిల్లాలో 21 సొంత భవనాలు, నాలుగు అద్దెవి ఉన్నాయి. 36 భవనాలు విరాళంగా లభించాయి. 1980లో నిర్మాణం జరిగిన భవనాలకు సక్రమంగా నిర్వహణ లేకపోవడంతో అవి బాగా దెబ్బతిన్నాయి. సంగంలో భవనాన్ని దాతలు ఇప్పటికే ఒక పర్యాయం రూ.లక్షలు వ్యయంతో ఆధునికీకరించినా.. ప్రస్తుతం వర్షం వస్తే నీరు కారుతోంది. శ్లాబు దెబ్బతిని పెచ్చులూడుతున్నాయి. ఏ.ఎస్‌.పేటలో పశువైద్యశాల, గ్రంథాలయ భవనం ఒకటిగా ఉండటంతో పాఠకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 1955లో ఆత్మకూరులో రెండో శ్రేణి గ్రంథాలయం ఏర్పాటుచేశారు. గ్రామ పంచాయతీ పట్టణంగా మారినా ఇప్పటికీ అక్కడ సొంత భవనమే లేదు. కోవూరు, రాపూరు, కావలిలోనూ ఇదే పరిస్థితి. అనంతసాగరంలో రేకుల గదిలో కొనసాగుతోంది. గ్రంథాలయాల్లో కాలం చెల్లిన పుస్తకాలను తొలగించడం, రెండేళ్లుగా పత్రికల వేలం జరగనందున అపరిశుభ్ర వాతావరణం నెలకొంటోంది. దుమ్ము, ధూళిమయంగా మారింది. అవసరమైన పుస్తకాలు, ఫర్నీచర్‌ కొనుగోళ్లు పదేళ్లుగా జరగలేదు.


సంగంలోని 
గ్రంథాలయం

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.