close

ఆదివారం, డిసెంబర్ 08, 2019

ప్రధానాంశాలు

మాకు మేమే సాటి.. రేపటికి పోటీ!

భిన్న రంగాల్లో ప్రతిభ చాటుతున్న నగర చిన్నారులు

పిల్లలు కాదు.. పిడుగులు.. ప్రపంచంతో పోటీపడుతూ దూసుకెళ్లే రాకెట్లు.. సంప్రదాయాలను గౌరవిస్తారు, ఆధునికత వైపు అడుగులు వేస్తారు.. చిన్న వయసులోనే అద్భుతాలు సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. భుజం తడితే చాలు.. భవిష్యత్‌కు తాము ఆశా కిరణాలుగా మారగలమనే ఆత్మవిశ్వాసం వ్యక్తంచేస్తున్నారు. అమ్మానాన్నల ఆశయానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. తమ అభిరుచులకు సానపడుతూ  సృజనాత్మకవైపు పరుగులు తీస్తున్నారు. ఆటపాటలు.. ఆవిష్కరణలు.. సాంస్కృతిక అంశాలు.. ఇలా ప్రతి చోట విజయబావుటా ఎగురవేస్తున్నారు. బాలల దినోత్సవం సందర్భంగా.. నగరంలో భిన్న రంగాల్లో రాణిస్తున్న చిన్నారుల విజయాలు, విశేషాలివిగో...

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే - హైదరాబాద్‌, జూబ్లీహిల్స్‌, రాయదుర్గం

బాల మేధావి

వయస్సు ఆరేళ్లు.. ఏ పథకాల వివరాలడిగినా ఇట్టే చెబుతాడు..  తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, నదుల ప్రాముఖ్యం, సంక్షేమ, సాగునీటి పథకాల వంటి వివరాలు అలవోకగా చెప్పేస్తాడు. ఆరేళ్ల వయస్సులోనే ఈ ప్రతిభతో అందరినీ అబ్బుర పరుస్తున్నాడు. బుడ్డోడి మేధాశక్తిని గుర్తించిన ఎంపీ మల్లారెడ్డి 2018 ఫిబ్రవరిలో పార్లమెంటు సందర్శనకు తీసుకెళ్లారు. అక్కడ ప్రధాని మోదీని కలిశాడు. ప్రథమ్‌ ఆదిత్యన్‌ చెప్పే విషయాలు వింటూ ప్రముఖులు ఆశ్చర్యపోతున్నారు. ఈ బుడతడు తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డు, తెలంగాణ బుక్‌ ఆఫ్‌ రికార్డు, వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులలో చోటు దక్కించుకున్నాడు. ఉదయం నిద్ర లేవగానే దినపత్రికలో విషయాలను అడిగి తెలుసుకుంటాడు. వార్తా ఛానళ్లను చూస్తాడు. పోలీసు అధికారిని అవుతానని దీమాగా చెబుతున్నాడు. ప్రథమ్‌ ఆదిత్యన్‌ ప్రస్తుతం ఓ ప్రైవేటు పాఠశాలలో ఒకటో తరగతి విద్యార్థి.

రాక్‌ బ్యాండ్‌తో  దూసుకెళతాం..

సరిగమలు పల్లవించే ఇంట పుట్టారు.. స్వరాలు వింటూ పెరిగారు.. బడికెళ్లే వయసులో సంగీతమే శ్వాసగా దూసుకెళ్తున్నారు. లక్షలాది మంది సంగీత ప్రియుల మనసు దోచుకుంటున్నారు. నగరానికి చెందిన మురళి, శృతి, దయారా, రోణక్‌ నలుగురు.. బడికెళ్లకపోయినా చదువుకుంటున్నారు. ఇంటిపట్టునే అక్షరాలు దిద్దుతూ.. ఇప్పుడు ఉన్నతపాఠశాల చదువు వరకూ చేరారు.. మంచి మార్కులు సాధిస్తున్నారు. ‘ది వి’ బ్యాండ్‌’ పేరిట రాక్‌ మ్యూజిక్‌తో అద్భుతాలు సృష్టిస్తున్నారు. తామే స్వయంగా పాటలు రాస్తారు.. సంగీతాన్ని సమకూర్చుతారు.. అలవోకగా ఆలపించి ఔరా. అనిపిస్తూ మెప్పు పొందుతున్నారు. మహానగరంలోనే కాదు.. చుట్టుపక్కల ఏ ఇంట పుట్టినరోజు వేడుకలు.. ఏ కళాశాలలో ఉత్సవాలు.. కార్పొరేట్ సంస్థల నిర్వహించే కార్యక్రమాలు నిర్వహించినా ది వి2 రాక్‌ బ్యాండ్‌ సంగీత హోరు ఉండాల్సిందే.

తైక్వాండోలో  అరుదైన రికార్డు

కొత్తపేటకు చెందిన రవికుమార్‌, నిహారిక దంపతుల బుజ్జాయి ప్రజ్వలిత.. అతి చిన్న వయస్సులో తైక్వాండోలో అరుధైన ఘనత సాధించింది. 2018- యంగెస్ట్‌ బ్లాక్‌బెల్‌్్ట డాన్‌-2లో రికార్డు సాధించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అన్నయ్య తైక్వాండోలో సాధన చేసే సమయంలో అనుసరిస్తూ తాను నేర్చుకుంటానని మారం చేసింది. అలా మొదలైన ప్రయాణంతో ఏడాది వ్యవధిలో తైక్వాండోలోనే పతకాలను సాధించింది. ఏడేళ్ల వయస్సులో మొదటి తెలంగాణ ఓపెన్‌ తైక్వాండో ఛాపింయన్‌షిప్‌ పోటీల్లో, 3వ తెలంగాణ ఓపెన్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో స్వర్ణ పతకాలను సాధించింది. భరత నాట్యం, కర్ణాటక సంగీతంలో కూడా ప్రతిభ చూపిస్తోంది. వేమన, సుమతీ శతకాలు వల్లిస్తుంది. సైన్యంలో చేరి దేశానికి సేవ చేస్తానంటోందీ చిన్నారి. ప్రస్తుతం బండ్లగూడలోని ఓ ప్రైవేటు పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది.

ఆ ఇద్దరు..  కాలుష్యాన్ని తగ్గించారు

పెరుగుతున్న వాహనాలు, కాలుష్యంతో పర్యావరణానికి ముంచుకొస్తున్న ముప్పును తగ్గించేందుకు ఇద్దరు చిన్నారులు చేసిన ఆలోచన జాతీయ స్థాయిలో ఉత్తమంగా నిలిచింది. జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్స్‌ పబ్లిక్‌ స్కూల్‌(విద్యాశ్రమం)కు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థులు సిద్దాంత్‌ ఎల్లంకి, శ్రీయాస్‌ భార్గవ్‌లు సీనియర్‌ ప్రిన్సిపల్‌ రమాదేవి, ఉపాధ్యాయురాలు మాధవీలత సహకారంతో వాహన కాలుష్యాన్ని తగ్గించే ఓ నమూనాను రూపొందించారు. దీని ప్రకారం.. కొబ్బరిచిప్పలను కాలిస్తే వచ్చే బొగ్గు, ఎండిన మొక్కజొన్న పొత్తును మెత్తగా చేసి కలిపి రూపొందించిన ఒక ఉత్పత్తిని వాహన సైలెన్సర్‌ గొట్టంలో అమరుస్తారు. దీంతో హైడ్రోకార్బన్‌లు 27 శాతం తక్కువగా, కార్బన్‌ మోనాక్సైడ్‌ 10 శాతం తక్కువగా వెలువడుతున్నాయి. ఈ నమూనానే ఇటీవల ఐఐటీ ఖరగ్‌పూర్‌లో యంగ్‌ ఇన్నోవేటర్స్‌ కార్యక్రమంలో ప్రదర్శించారు. వివిధ దేశాల విద్యార్థుల నుంచి 850 నమూనాలు రాగా వివిధ వడపోతల అనంతరం నిర్వాహకులు ఫైనల్‌కు మూడింటిని ఎంపిక చేశారు. భవన్స్‌ విద్యార్థుల ప్రాజెక్టు ఉత్తమ రెండో ప్రాజెక్టుగా ఎంపికై రూ.30వేల బహుమతిని సాధించింది.

అన్నింటా.. అక్షర

అక్షర చదివేది.. ఆరో తరగతి. మంచి మార్కులు తెచ్చుకుంటోంది. ఓస్‌ ఇంతేగా! అనుకునేరు. బాలనటిగా మూడేళ్ల వయసు నుంచే సినిమాల్లో.. బుల్లితెర సీరియల్స్‌లోనూ నటిస్తోంది. మోడలింగ్‌తో సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు పక్కన మెరిసింది. పవన్‌కళ్యాణ్‌, సుమంత, రామ్‌ తదితర నటీనటులతో కలసి నటించింది కూడా. నృత్యం, కరాటే, ఈత తదితర అంశాల్లోనూ ప్రావీణ్యం సంపాదించింది. అహనా పెళ్లంట పేరుతో ఓ అల్బమ్‌ చేసి ఇట్టే ఆకట్టుకుంది. అమ్మ, నాన్నల తోడ్పాటుతో మరిన్ని సినిమాల్లో నటిస్తానంటోంది. చదువునూ నిర్లక్ష్యం చేయబోనని చెబుతోంది  అక్షర.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.