close

సోమవారం, డిసెంబర్ 09, 2019

ప్రధానాంశాలు

 వినూత్న తరహాలో ఆకట్టుకునే వాతావరణం

అనుభూతితో ఆరగించండి!
 నగరంలో థీమ్‌ రెస్టారెంట్లకు పెరుగుతున్న ఆదరణ
 పేరుకు తగ్గట్టుగా లోపలి ఆకృతుల ఏర్పాటు
ఈనాడు, హైదరాబాద్‌

* జైలు గోడల మధ్య ఊచలు లెక్కిస్తూ.. స్నేహితులతో సరదాగా కబుర్లు చెప్పుకొంటూ.. ఖైదీలను పలకరిస్తూ భోజనం చేయాలనుకుంటున్నారా..! ఇదేంటి...? జైలుకు వెళ్లి భోజనం ఎలా చేస్తామని ఆశ్చర్యపోకండి..! ఇందుకు నేరుగా జైలుకే వెళ్లనక్కర్లేదు. అలాంటి ఆకృతులతో నిర్మించిన ‘జైల్‌ఖానా రెస్టారెంట్‌’కు వెళితే సరిపోతుంది. ఖైదీ బొమ్మల మధ్య.. ఊచలతో నిర్మించిన ప్రత్యేక గదులలో కూర్చుని సరికొత్త రుచులు ఆరగించేలా ఇక్కడి రెస్టారెంట్‌ను తీర్చిదిద్దారు. మాదాపూర్‌ సైబర్‌ టవర్స్‌ వద్ద ఉందీ రెస్టారెంట్‌.

* అమీర్‌పేట శ్రీనగర్‌కాలనీలోని రెస్టారెంట్‌ పేరు కొబ్బరిల్లు. దీనికి తగినట్టుగా సంప్రదాయ సొగసులు అద్దారు. రూఫ్‌టాప్‌గా కొబ్బరి తాళ్లతో తయారు చేసి మంచాలు వేలాడదీసి.. కొబ్బరితో రూపొందించిన క్యాబిన్లలో డైనింగ్‌ నిర్వహిస్తున్నారు. చెక్క కుర్చీలకు తోడు కొబ్బరిపీచు తయారు చేసిన సామగ్రి వినియోగిస్తుంటారు. పేరుకు తగ్గట్టే లోపల వాతావరణం కొబ్బరితో తయారు చేసిన ఇల్లు తరహాలో ఉంటుంది. ప్రకృతిహితంగా డిజైన్‌ చేశారు.

నగరంలో ఆహార ప్రియులు ఎక్కువ. ఇందుకు రుచికరమైన ఆహారం వడ్డించడం ఎంత ముఖ్యమో.. రెస్టారెంట్లలో కూర్చుని తినేందుకు ఆకట్టుకునే వాతావరణం కల్పించడమూ అంతే అవసరం. ఇందుకు తగినట్టుగా నగరంలో పలు రెస్టారెంట్లు వినూత్నంగా ముస్తాబై సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ‘థీమ్‌ రెస్టారెంట్ల’ పేరిట పేరుకు తగ్గట్టుగా లోపలి ఆకృతులు.. వాతావరణాన్ని పూర్తిగా అదే తరహాలో రూపొందిస్తున్నారు. గతంలో ఎక్కువగా తెలుగు, సంప్రదాయ పేర్లతో కూడిన రెస్టారెంట్లు/హోటళ్లను ఏర్పాటు చేసేందుకు యజమానులు ఆసక్తి చూపేవారు. ఇప్పుడు పేరుతో ఆకట్టుకోవడంతోపాటు అందుకు తగ్గ వాతావరణాన్ని కల్పించాల్సి వస్తోంది. కొత్తగా మార్కెట్‌లోకి వెళ్లానుకుంటే విభిన్నంగా ఉండాలి. లేకపోతే సందర్శకులు వచ్చే పరిస్థితి ఉండదు. ఆహారం రుచిగా, శుచిగా ఉండటంతోపాటు ఇంటిరీయర్‌ డిజైన్‌ వినూత్న రీతిలో ఉండటం ఎంతో అవసరం. ప్రజల అభిరుచులకు తగినట్లుగా డిజైన్‌ చేసి ఆహారాన్ని వడ్డిస్తే.. మళ్లీ రప్పించేందుకు అవకాశం ఉంటుందన్న ఉద్దేశంలో హోటళ్ల యజమానులు ‘థీమ్‌’కు ప్రాధాన్యం ఇస్తున్నారు. వాస్తవానికి గతంలో ఇంటీరియర్‌ డిజైన్‌ అంటే గోడలకు చిత్ర కళాఖండాలు లేదా కాగిత/ప్లాస్టిక్‌ పూల అలంకరణలు ఎక్కువగా ఉండేవి. దీని స్థానంలో ‘థీమ్‌’కు ఆదరణ పెరిగింది.

ఓరిస్‌ది కీలక పాత్ర

ఈ తరహా రెస్టారెంట్లు తీసుకురావడంలో ఓరిస్‌ది కీలకపాత్ర. ఎన్టీఆర్‌ గార్డెన్‌ వద్ద ఓరీస్‌ 70ఎంఎం పేరిట బాలీవుడ్‌ చిత్రాల థీమ్‌, బషీర్‌బాగ్‌లో కేవ్‌ ఇంటీరియర్‌ డిమ్‌ లైటింగ్‌తో ప్రారంభించింది. ప్రస్తుతం ఈ ట్రెండ్‌ నగరంలో ఎక్కువగా కనిపిస్తోంది.

అంతటా పర్యావరణహితం..

ప్రత్యేక అంశాలతో వాతావారణాన్ని సృష్టించడమే కాదు.. ఉత్పత్తుల్లోనూ ప్రత్యేకత పాటిస్తున్నారు. పర్యావరణ హిత ఉత్పత్తులకు ఎక్కువగా పెద్దపీట వేస్తున్నారు. రెస్టారెంట్లకు వచ్చేవారికి పర్యావరణహిత డిజైన్లతో స్వాగతం పలుకుతున్నారు. మట్టి పాత్రల్లో నీటిని అందించడం.. రాగి పాత్రల్లో బిర్యానీ/ఇతర వంటకాలు వడ్డించడం.. విస్తర్లలో భోజనం ఏర్పాటు చేయడం.. ఇలా సందర్శకులకు వినూత్న వాతావరణం కల్పిస్తున్నారు. ఇలాంటి సరికొత్త రెస్టారెంట్లలో ప్రత్యేకంగా సెల్ఫీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆహారం ఆరగించేందుకు వచ్చిన ప్రతిఒక్కరూ కచ్చితంగా సెల్ఫీ దిగి అక్కడి వాతావారణాన్ని తమ కెమెరాల్లో బంధించి మురిసిపోతున్నారు.

ఆదరణ పెంచుకునేందుకు కొత్త మార్గం
 నిఖిల్‌, ఆర్కిటెక్ట్‌, డిజైన్‌ షేడ్స్‌

నగరంలో కొత్తగా మార్కెట్‌లో రావాలనుకునే వారు ఎక్కువగా థీమ్‌ రెస్టారెంట్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అప్పటికే జనం నోళ్లలో ఉన్న రెస్టారెంట్లకు ప్రత్యేకంగా ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం లేదు. పోటీతత్వాన్ని తట్టుకుని ముందుకు సాగాలంటే ఏదో విధంగా కొత్త తరహాలో వినియోగదారుడిని ఆకట్టుకోవాలి. అందుకే ఎక్కువగా థీమ్‌ రెస్టారెంట్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు.  పటాన్‌చెరులో స్వీట్‌హార్ట్‌ రెస్టారెంట్‌, నాగోల్‌లో లక్కీ రెస్టారెంట్‌, అత్తాపూర్‌లో స్కైబాక్స్‌.. ఇలా నగరంలో చాలాచోట్ల అందుబాటులోకి వచ్చిన రెస్టారెంట్లు ఒక్కో థీమ్‌తో ఆకట్టుకుంటున్నాయి

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.