close

శనివారం, ఏప్రిల్ 04, 2020

ప్రధానాంశాలు

నిప్పు రాజుకుంటే.. ఆర్పే దిక్కు ఏదీ?

అగ్నిమాపక యంత్రాలకు నీటి కొరత
రాత్రి వేళల్లో ఎక్కువ ఇబ్బందులు
ప్రత్యేక ఏర్పాట్లు అవసరం
ఈనాడు, హైదరాబాద్‌:

మలక్‌పేటలో సోమవారం రాత్రి పది గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది. మూడు అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగాయి. మంటలను ఆర్పే ప్రయత్నం చేశాయి. యంత్రాల్లో ఉన్న కొద్దిపాటి నీళ్లు అయి పోవడంతో....సమీపంలోని జలమండలి ఫిల్లింగ్‌ కేంద్రానికి వెళితే సిబ్బంది లేకపోవడంతో మళ్లీ ఫోన్‌ చేసి పిలిపించాల్సి వచ్చింది. ఇంతలో మంటలు మరింత అంటుకున్నాయి. మరుసటి రోజు ఉదయం వరకు అదే పరిస్థితి. మళ్లీ జలమండలి నుంచి ట్యాంకర్లను తెప్పించి మంటలను ఆర్పారు. తరచూ ఎక్కడో ఒక చోట ఇలాంటి పరిస్థితి ఎదురవుతోంది.

వేసవి వస్తే చాలు...నగరంలో చాలా ప్రాంతాల్లో అగ్నిమాపక ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ఈ సమయంలో తీవ్ర నీటి ఎద్దడి ఎదురవుతోంది. నీళ్లు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రమాదాల సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జలమండలికు సమాచారం అందించి ట్యాంకర్లు వచ్చే వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. కొన్నిసార్లు నేరుగా జలమండలి ఫిల్లింగ్‌ కేంద్రాలకు వెళ్లి నీటిని తీసుకునే వెసులుబాటు ఉంది. కానీ రాత్రి వేళల్లో ఇబ్బందులు తప్పడం లేదు. ప్రస్తుతం పంజాగుట్ట, లంగర్‌హౌస్‌, సనత్‌నగర్‌, సికింద్రాబాద్‌, మౌలాలి, ముషీరాబాద్‌, గౌలిగూడ, మొఘల్‌పురా, చందులాల్‌బారాదరి, మలక్‌పేట, సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, సాలార్‌జంగ్‌ మ్యూజియం తదితర ప్రాంతాల్లో అగ్ని మాపక కేంద్రాలు ఉన్నాయి. చాలా కేంద్రాల్లో తీవ్రమైన నీటి కొరత ఉంది. వేసవిలో ఈ పరిస్థితి ఇంకా ఎక్కువే. 3-5 వేల లీటర్ల సామర్థ్యం మేరకే అక్కడ ట్యాంకర్ల ఉన్నాయి. పెద్ద అగ్ని ప్రమాదాలు సంభవించే సమయాల్లో నీళ్లు సరిపోవడం లేదు. ఫిల్లింగ్‌ కేంద్రాలకు వెళ్లి నీళ్లు నింపుకొని వచ్చేలోపు పుణ్యం కాలం గడిచిపోతోంది. జలమండలికి నగర వ్యాప్తంగా 70 వరకు నీటి ఫిల్లింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. వీటి చిరునామాలు తెలియకపోవడంతో అత్యవసర సమయాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గతంలో జలమండలి వెబ్‌సైట్‌లో రూట్‌ మ్యాప్‌, ఆయా కేంద్రాల చిరునామాలు, ఫోన్‌ నంబర్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనలు ముందుకు సాగలేదు.

పైపులైన్లపై ఫైర్‌ హైడ్రేంట్స్‌ పెడితే...
అగ్ని ప్రమాదాలు జరిగే సమయాల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రత్యేక వ్యవస్థ ఉంది. కీలక ప్రాంతాలను ఎంపిక చేసి అక్కడ ఫైర్‌ హైడ్రేంట్స్‌ అందుబాటులో ఉంటాయి. ఫిల్లింగ్‌ కేంద్రాలతో పని లేకుండా ఇక్కడ నుంచే నీటిని తీసుకోవచ్చు. వీటికి పెద్ద పెద్ద పైపులు కూడా ఉంటాయి. సమీపంలో అగ్ని ప్రమాదం జరిగితే ఈ పైపుల సాయంతో మంటలను అదుపులోకి తేవచ్చు. అప్పట్లో జలమండలికి నగరంలో ఫైర్‌ హైడ్రేంట్స్‌ పెట్టేందుకు కొన్ని ప్రాంతాలను కూడా ఎంపిక చేశారు. కానీ ఇంతవరకు ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. ఫిల్లింగ్‌ కేంద్రాల చిరునామాలే కాకుండా...ఫైర్‌ హైడ్రేంట్స్‌కు అందుబాటులోకి తేవడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. నగరంలో 1000 ఎంఎం డయా అంతకంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న పైపులైన్లు ఒక రిజర్వాయర్‌ నుంచి మరొక రిజర్వాయర్‌కు అనుసంధానించి ఉంటాయి. ఇందులో 24 గంటలపాటు నీళ్లు ప్రవహిస్తుంటాయి. ఇలాంటి పైపులైన్లు వెళ్లే కీలక ప్రాంతాల్లో ఈ ఫైర్‌ హైడ్రేంట్స్‌ ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించారు. ప్రధాన పైపులైన్‌కు ఒక రంధ్రం పెట్టి అక్కడ ఒక ఛాంబర్‌ను నిర్మించి అక్కడ ఒక వాల్వు ఏర్పాటు చేస్తారు. ఇది కూడా పైపులైన్‌ మాదిరిగా ఉంటుంది. దానికి రెండు వైపులా మూతలు బిగించి ఉంటాయి. అగ్నిమాపక శాఖకు అత్యవసర సమయాల్లో నీళ్లు కావాల్సి వచ్చినప్పుడు ఈ మూతలు తొలగించి పైపుపెట్టి నేరుగా ట్యాంకర్లలో నీళ్లు పట్టుకునే అవకాశం ఉంది. వీటినే ఫైర్‌ హైడ్రేంట్స్‌గా వ్యహరిస్తారు. ప్రస్తుతం వాటర్‌ ట్యాంకర్లు అయితే ఒక దఫాకు 5 వేల లీటర్లకు మించి ఎక్కువ సరఫరా చేయలేని పరిస్థితి ఉంది. అదే ఈ పాయింట్ల నుంచి ఎన్ని నీళ్లు కావాలన్నా తీసుకోవచ్చు. ఎలాంటి అభ్యంతరం ఉండదు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.