సోమవారం, డిసెంబర్ 16, 2019
జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్) పరిధిలో ‘పోషణ్ అభియాన్’ పోస్టుల భర్తీలో సరికొత్త కోణమిది. ఈ పోస్టుల భర్తీ వ్యవహారాన్ని గుంటూరుకు చెందిన ఓ పొరుగు సేవల ఏజెన్సీకి అప్పగించారు. ఇదే అదనుగా సదరు ఏజెన్సీ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తోంది. పనిలో పనిగా చేతివాటం ప్రదర్శించడానికి తెరదీసింది. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. ఏ ప్రతిపాదికన పోస్టులు భర్తీ చేశారో కూడా తెలియదు. కానీ... నేరుగా అభ్యర్థుల ఫోన్లకు సంక్షిప్త సందేశాన్ని (ఎస్ఎంఎస్) పంపారు. సరికదా... సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో రూ.వేల వసూలుకు ఒడిగట్టారు. ఇది కూడా డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) రూపంలో ఆ మొత్తాన్ని చెల్లించాలని నిర్దేశించారు. ఆ కంపెనీ ప్రతినిధులను ఎవరూ చూడలేదు. ఎవరు భర్తీ చేస్తున్నారో కూడా తెలియదు. కానీ ఒక చిరునామా ఇచ్చి డీడీలు పంపాలని చెప్పడంపై నిరుద్యోగుల్లో అనుమానం తలెత్తింది. దీనిపై ఐసీడీఎస్ యంత్రాంగం ఏమాత్రం నోరు మెదపలేదు. తమకు ఏమాత్రం సంబంధం లేదని తప్పించుకోవడం కొసమెరుపు.
‘ఆన్లైన్’లో దరఖాస్తుల స్వీకరణ...
ఐసీడీఎస్ పరిధిలో పోషణ్ అభియాన్ పథకం అమలు అవుతోంది. ఈ పథకం కింద ప్రభుత్వ ఒప్పందం కింద చాలా మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న జిల్లా సమన్వయకర్త, బ్లాక్ సమన్వయకర్త, బ్లాక్ సహాయకులు... ఈ మూడు రకాల పోస్టుల భర్తీకి సంబంధించి గుంటూరుకు చెందిన ఎక్స్ఈఏఎం వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానించింది. గత నెల 8 నుంచి 25 దాకా దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలో వందల మంది దరఖాస్తు చేసుకున్నారు.
‘సెక్యూరిటీ’ పేరుతో దందా...
అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. కానీ.. ఎంత మంది దరఖాస్తు చేశారు. ఎవరిని ఎలా ఎంపిక చేశారు. మెరిట్ ఏంటనే వివరాలేవీ అందుబాటులో ఉంచలేదు. అసలు ఎంపిక ఏ ప్రతిపాదకన చేశారనే దానిపై స్పష్టత లేదు. జిల్లా ఐసీడీఎస్ యంత్రాంగానికి కూడా ఈ వివరాలేవీ చెప్పకపోడం విశేషం. ఎంపికైన అభ్యర్థుల నుంచి సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో డబ్బు వసూలు చేస్తున్నారు. జిల్లా కో-ఆర్డినేటర్తో రూ.25 వేలు, బ్లాక్ కో-ఆర్డినేటర్తో రూ.20 వేలు, బ్లాక్ సహాయకుడితో రూ.15 వేలు చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ మొత్తంతో డీడీ తీసి పంపాలని ఎస్ఎంఎస్ పంపడం విశేషం. ఈ డబ్బుకు గ్యారెంటీ ఏంటనే దానిపై అభ్యర్థుల్లో ఒక్కటే చర్ఛ అసలు డబ్బు ఎందుకు ఇవ్వాలని అనుమానిస్తున్నారు. నిర్దేశిత మొత్తంలో డీడీ పంపితేనే ఆఫర్ లేఖ ఇస్తామంటూ ఎస్ఎంఎస్ వివరాల్లో చెప్పడం విశేషం.
పోస్టుల భర్తీ తెలియదు
పోషణ్ అభియాన్ పథకంలో కొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి సంబంధించి ఏదో ప్రైవేట్ కంపెనీకి అప్పగించారు. నవంబరు ఆఖరు నాటికి పొరుగు సేవల ఉద్యోగులు వస్తారనే సమాచారం పంపారు. ఆ కంపెనీ ఏదో తెలీదు. ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తున్నారనే విషయం తెలియదు. ఈ పోస్టుల భర్తీ వ్యవహారంతో మాకు ఏమాత్రం సంబంధం లేదు.
- చిన్మయదేవి, పీడీ, ఐసీడీఎస్
మళ్లీ వెనక్కి ఇస్తాం
నిజమే... సెక్యూరిటీ డిపాజిట్ వసూలు చేస్తున్నాం. డీడీ రూపంలో బ్యాంకులో జమ చేయాలని చెప్పాం. ఇది రిఫండబుల్... మళ్లీ వెనక్కి ఇస్తాం. ఎంపిక చేసిన వారికి మొబైల్ ఫోన్లు ఇస్తాం. ఎప్పుడైనా ఉద్యోగం వదిలేసినప్పుడు మొబైల్స్ వెనక్కి ఇస్తే... డబ్బు వెనక్కి ఇస్తాం.
- వినోద్, కంపెనీ ప్రతినిధి
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు